హైదరాబాద్‌ని వదలని వర్షం : చెరువులను తలపిస్తున్న రోడ్లు

  • Published By: madhu ,Published On : September 27, 2019 / 01:46 AM IST
హైదరాబాద్‌ని వదలని వర్షం : చెరువులను తలపిస్తున్న రోడ్లు

నగరాన్ని వర్షం వీడడం లేదు. వరుసగా నాలుగో రోజు వర్షం దంచి కొట్టింది. భాగ్యనగరాన్ని వణికిస్తోంది. సెప్టెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి ఒక్కసారిగా కుంభవృష్టి కురిసింది. నగర వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఉరుములు, మెరుపులతో గజగజా వణికించింది. రాత్రంతా కురిసిన భారీ వర్షానికి రహదారులు సముద్రాన్ని తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడనే భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

ఉప్పల్, మియాపూర్, లకడీకపూల్ పరిసర ప్రాంతాల్లో 12 నుంచి 15 సెం.మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్, లింగంపల్లి, చందానగర్, మియాపూర్, అల్వాల్, తిరుమలగిరి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మారేడ్ పల్లి, సైనిక్ పురితో పాటు పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. గుడి మల్కాపూర్‌లో అత్యధికంగా 15 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. 

రంగంలోని దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై నిలిచిన నీటిని కాల్వల్లోకి పంపిస్తున్నారు. ఇక ఉప్పల్ మెట్రో ఫ్లై ఓవర్ రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షం ధాటికి కాలాపత్తర్‌లోని ఓ స్కూల్ గోడ కూలి పార్కింగ్ చేసిన కారుపై  పడిపోయింది. దీంతో కారు ధ్వంసమైంది.

వర్షపు నీటితో ముంపునకు గురయిన ప్రాంతాలను నగర మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్, విజిలెన్స్ డైరెక్టర్ విశ్వజిత్‌లు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. మక్తల్ పరిసర ప్రాంతాల్లో నివాసాల్లోకి వర్షపు నీరు చేరడంతో వారంతా రాత్రి జాగరణ చేశారు. ఏది ఏమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్ సూచించారు.