కూల్‌కూల్ పానీ : రైల్వేస్టేషన్‌‌లో వాటర్ ATMలు

  • Published By: madhu ,Published On : May 12, 2019 / 08:46 AM IST
కూల్‌కూల్ పానీ : రైల్వేస్టేషన్‌‌లో వాటర్ ATMలు

సూరీడి భగభగలకు గొంతెండిపోతుంది. ఎన్ని నీళ్లు తాగినా నాలుక పిడుచకట్టుకుపోతోంది. దీనికి తోడు ప్రయాణాలంటే డబ్బులను మంచి నీళ్లలాగే ఖర్చుపెడితే తప్ప గొంతు తడుపుకోలేము. అందుకే ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టడానికి తక్కువ ఖర్చుకే చల్లటి మంచినీళ్లతో…ప్రయాణికుల దాహం తీర్చడానికి రైల్వేస్టేషన్స్‌లో వాటర్ ATMలను సిద్ధం చేశారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. 

మండుతున్న ఎండలకు మంచినీటితోనే కాస్తయినా రిలీఫ్ అవుతాం. అందులోనూ వేసవిలో ప్రయాణాలంటే సూరిబాబు పట్టపగలే చుక్కలు చూపిస్తాడు. దీంతో వాటర్ బాటిల్ క్యారీ చేయడమో… మంచినీళ్ల బాటిల్ కొనుక్కోవడమో చేస్తాం. ఇక కుటుంబంతో సుదూర ప్రాంతాలకు వెళ్లేటపుడు ఇలాంటపుడు ఎంతకాదన్నా జేబుకు చిల్లుపడటం గ్యారంటీ. 

బస్టాండ్స్‌లో, రైల్వేస్టేషన్స్‌లో ఒక్కో బాటిల్ ధర 20 రూపాయల నుంచి 25 రూపాయల వరకూ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో కూల్ వాటర్‌కు ఎక్స్‌ట్రా డబ్బులు అడిగినా కిమ్మనకుండా అవసరం కొద్దీ కొనుక్కుంటాం. కొంతమంది పోనీ అంత ధర పెట్టి కొనడం ఎందుకులే అనుకుని ఫ్లాట్‌ఫామ్‌లలో వెతికినా… కనుచూపు మేరలో కుళాయిలే కనిపించవు. దీంతో గత్యంతరం లేక అడిగినంత ఇచ్చి వాటర్ బాటిల్స్ కొనుక్కుంటారు. 

రైల్వే ప్రయాణికులకు ఇలాంటి కష్టాలు లేకుండా చేయడానికి దక్షిణమధ్య రైల్వే హైదారాబాద్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్స్‌లో ఓ స్వచ్చంధ సంస్ధతో కలిసి నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్స్‌లోని ఫ్లాట్ ఫామ్‌లో వాటర్ ఏటీఎమ్స్‌ను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్స్‌లోని, అన్ని ఫ్లాట్ ఫామ్ లో వాటర్ ఏటీఎంలు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్స్ లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది.

రైల్వేస్టేషన్స్‌లో ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎంలకు ప్రయాణికుల దగ్గర నుంచి విశేష స్పందన లభిస్తోంది. 300 మిల్లీలీటర్లు 1 రూపాయి. అర లీటర్ 2 రూపాయలు, లీటర్ 5 రూపాయలకు అందిస్తున్నారు. జేబుకు చిల్లుపడకుండా తక్కువ ఖర్చుకే చౌకగా చల్లటి మంచి నీళ్లను అందించడంతో ప్రయాణీకులు ఖుషీ అవుతున్నారు.