తెలంగాణ కేబినేట్ ప్రక్షాళన: రాసలీలల మంత్రి.. మరో ముగ్గురు అవుట్!

  • Published By: vamsi ,Published On : November 3, 2020 / 09:27 PM IST
తెలంగాణ కేబినేట్ ప్రక్షాళన: రాసలీలల మంత్రి.. మరో ముగ్గురు అవుట్!

తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమైంది. వారంలోగా కేబినెట్ విస్తరణ కాదు..ప్రక్షాళన ఖాయమని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి దీనిపై తుది కసరత్తు చేసినట్లు వివ్వసనీయ సమాచారం. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం వెలువడిన వెంటనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండబోతున్నట్లుగా చెబుతున్నారు. కొత్త వారికి అవకాశం ఇస్తే ఎవరిపై వేటు పడుతుంది. ఇప్పుడు ఇవే ప్రశ్నలు పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తూ ఉండగా.. కేబినెట్ రీ షఫుల్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.



ఈ మాట చాలా కాలం నుంచి వినిపిస్తుండగా.. కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తారనేదానిపై ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఏ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ రాసలీలల మంత్రితో పాటు మరో ముగ్గురు మంత్రులపై వేటు పడే అవకాశం ఉందని అంటున్నారు. ఉద్వాసన పలికితే వారి పదవి పోవడానికి ఎలాంటి అంశాలు కారణంగా మారుతాయనే విషయం ఆసక్తికరం.



దుబ్బాక ఉప ఎన్నికతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఆ వేడి చల్లారేలోపే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపఎన్నికకు ముందు తెలంగాణలో మంత్రి రాసలీలల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారగా.. ఆ మంత్రిపై 10టీవీలో కూడా వరుసగా కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవగా.. ఈ ఇష్యూపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంత్రి రాసలీలల వ్యవహారంపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా సీఎంవోకు పూర్తి స్థాయి రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా డర్టీ మినిస్టర్‌పై వేటు పడే అవకాశం కనిపిస్తుంది. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినా మంత్రికి అవకాశం దొరకలేదని సమాచారం.



కేబినెట్‌లో బెర్త్ కోల్పోయే మంత్రుల విషయానికి వస్తే… ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులతో పాటు.. దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రి ఉన్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. పదవిలోకి వచ్చి రెండేళ్లైనా తమకు కేటాయించిన శాఖపై పూర్తిగా పట్టు సాధించకపోవడం.. పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టకపోవడం, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోకపోవడం లాంటి అంశాలు మంత్రుల పనితీరుపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక కొందరు మంత్రుల అనుచరులు, బంధువులు చేస్తున్న దందాలు, సెటిల్మెంట్లు కూడా వారి సీటుకు ఎసరు తెచ్చినట్లుగా తెలుస్తోంది.



పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కొందరు మంత్రులను తప్పిస్తే… కేబినెట్‌లో కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుంది. ఈ అంశంపై ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో, పార్టీలో చర్చ సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓ నేతకు.. ఉత్తర తెలంగాణకు చెందిన ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో చోటు దక్కవచ్చు అంటున్నారు. త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండగా.. ఈ పరిస్థితుల్లో గ్రేటర్ పరిధి నుంచి ప‌ద్మారావు లేదా దానం నాగేంద‌ర్‌లో ఒకరికి మంత్రి పదవి దక్కడం ఖాయమనే ప్రచారం ఉంది.



అలాగే సామాజిక స‌మీక‌ర‌ణాల‌ వారీగా చూస్తే… వ‌రంగ‌ల్‌, ఆదిలాబాద్ జిల్లాల‌కు చెందిన విన‌య్ భాస్కర్ లేదా జోగు రామన్నలో ఒక‌రికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు… మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై మరోరకమైన వాదన కూడా ప్రచారంలో ఉంది.