Afghanistan Taliban : తాలిబాన్లతో చేతులు కలుపుతున్న బంగ్లాదేశ్‌ యువకులు..ఇండియా మీదుగా అఫ్ఘానిస్తాన్ వెళ్లేలా ప్రయత్నం

తాలిబన్లతో చేతులు కలిపేందుకు కొంతమంది బంగ్లాదేశ్‌ యువకులు ప్రయత్నిస్తున్నారు. భారత్ మీదుగా అఫ్ఘానిస్థాన్‌లో ప్రవేశించి తాలిబన్లలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.

Afghanistan Taliban : తాలిబాన్లతో చేతులు కలుపుతున్న బంగ్లాదేశ్‌ యువకులు..ఇండియా మీదుగా అఫ్ఘానిస్తాన్ వెళ్లేలా ప్రయత్నం

Afganistan (1)

Bangladesh youth : తాలిబన్లతో చేతులు కలిపేందుకు కొంతమంది బంగ్లాదేశ్‌ యువకులు ప్రయత్నిస్తున్నారు. అఫ్ఘానిస్తాన్‌ వెళ్లడానికి ఇండియానే మార్గంగా ఎంచుకుంటున్నారు. బంగ్లాదేశీ యువత కొందరు భారత్ మీదుగా అఫ్ఘానిస్థాన్‌లో ప్రవేశించి తాలిబన్లలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని బంగ్లాదేశ్ పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఉగ్రవాద భావజాలం ఉన్న యువకులు భారత్‌లోకి చొరబడేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. వీరు సరిహద్దు గుండా భారత్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఢాకా పోలీస్ కమిషనర్ షఫీకుల్ ఇస్లామ్ వెల్లడించారు.

బంగ్లాదేశ్‌ పోలీసుల హెచ్చరికలతో బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ అప్రమత్తమైంది. తమ దళాలు అన్నీ హై అలర్ట్‌లో ఉన్నాయని BSF తెలిపింది. అయితే..ఇప్పటివరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని BSF దక్షిణ బెంగాల్ ఫ్రాంటియర్‌కు చెందిన డీఐజీ వెల్లడించారు. అటు అఫ్ఘానిస్థాన్‌కు రావాలంటూ బంగ్లాదేశ్ యువతకు తాలిబన్లు పిలుపునిచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి BSF గస్తీని మరింత కట్టుదిట్టం చేసింది. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడంతో బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదులు క్రియాశీలకంగా మారారని బీఎస్ఎఫ్ అధికారులు భావిస్తున్నారు.

అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. దేశం విడిచి వెళ్లిపోవాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రాణాలకు తెగించి వారంతా కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. దీంతో ఎయిర్‌పోర్టు, పరిసరాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. భారత్ సహా అనేక దేశాలు తమ ప్రజలను, ఉద్యోగులను సురక్షితంగా స్వదేశాలకు తీసుకెళ్తున్నాయి. కాబూల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర దేశం విడిచి వెళ్లేందుకు అప్ఘన్లు చేస్తున్న ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

తాలిబన్ల అరాచకాలు, ఆగడాలు పెరుగుతుండటంతో అప్ఘాన్ పౌరులతో పాటు అక్కడ చిక్కుకున్న ఇతర దేశాలకు చెందినవారు అష్టకష్టాలు పడుతున్నారు. ఏదో విధంగా దేశం నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. కానీ సరిహద్దులు మూసివేయడంతో అక్కడి నుంచి బయటపడాలనుకునే వారికి కాబూల్‌లోని విమానాశ్రయం ఒకే ఒక్క దారిగా మిగిలింది. దీంతో ఎలాగైనా దేశం విడిచి పారిపోయేందుకు ఎయిర్‌ పోర్టుకు వేలాదిగా తరలివస్తున్నారు. మరోవైపు వీరిని అణచివేసేందుకు తాలిబన్లు తుపాకీ గుళ్లు కురిపిస్తున్నారు.

అఫ్ఘాన్‌లో ఇప్పటికే అడ్డూ అదుపు లేకుండా ఆంక్షలు విధిస్తున్న తాలిబన్ పాలకులు.. రోజుకో ఆదేశాలతో అందరిలో ఆందోళన పెంచుతున్నారు. తాజాగా కాబూల్ విమానాశ్రయం వద్ద కూడా ఆంక్షల అమలుకు ఆదేశాలు జారీచేశారు. ఎయిర్ పోర్టు బయట ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో గుమిగూడ వద్దన్నారు. దీనిని ధిక్కరిస్తే కాల్పులకు తెగబడుతూ అందరిలో నెలకొన్న ఆందోళనను పెంచేస్తున్నారు. అయితే… ఇంకా వేలాది మంది అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న తరుణంలో… తాలిబన్ రాక్షస మూకలు ఎంతమంది బలి తీసుకుంటాయోనన్నది మరింత భయాందోళన కలిగిస్తోంది.

అఫ్ఘానిస్తాన్‌లో త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న తాలిబన్‌ మూకల కన్ను ఇప్పుడు పంజ్‌షీర్‌పై పడింది. పంజ్‌షీర్ స్వాధీనం చేసుకునేందుకు ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే పంజ్‌షీర్ సరిహద్దుల వరకూ వెళ్లినట్టు తెలుస్తోంది. పంజ్‌షీర్‌కు చెందిన గిరిజన నేతల్ని లొంగిపోవాల్సిందిగా తాలిబన్లు హుకుం జారీ చేశారు. లేకపోతే దాడులు చేస్తామని హెచ్చరించారు.