Canada PM Justin Trudeau: 18ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెప్పిన కెనడా ప్రధాని.. భార్య సోఫీ నుండి విడిపోతున్నట్లు ప్రకటన
కెనడా ప్రధాని ట్రూడో, సోఫీ 2005లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Canada PM Justin Trudeau
Canada PM Justin Trudeau Divorce: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Canada PM Justin Trudeau) అతని భార్య సోపీ గ్రెగోయిర్ ట్రూడో (Sophie Gregoire Trudeau) తో విడిపోతున్నట్లు ప్రకటించారు. 18ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పోస్టులో జస్టిన్ ట్రూడో బుధవారం ప్రకటించారు. అయితే, వీరు సుదీర్ఘ చర్చలు తరువాత విడిపోవాలని నిర్ణయించుకున్నారట. ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఇద్దరూ చట్టపరమైన విభజన ఒప్పందంపై సంతకం చేసినట్లు పేర్కొంది.

Canada PM Justin Trudeau
వీరిద్దరు 2005లో మాంట్రియల్‌లో వివాహం చేసుకున్నారు. 48ఏళ్ల సోఫీ గ్రెగోయిర్ ట్రూడో క్యూబెక్ లో టెలివిజన్ రిపోర్టర్‌గా కూడా పనిచేశారు. ఆమె 51ఏళ్ల జస్టిన్ ట్రూడోతో కలిసి మూడు ఎన్నికలకు కూడా ప్రచారం చేసింది. ఆమె మహిళల హక్కులు, మానసిక ఆరోగ్య సమస్యలకోసం వాదించడం ద్వారా చాలాసార్లు వార్తల్లో నిలిచారు.

Canada PM Justin Trudeau,Sophie Gregoire Trudeau
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, సోఫీ గ్రెగోయిర్ ట్రూడో దంపతులకు ముగ్గురు పిల్లలు. 15ఏళ్ల జేవియర్, 14ఏళ్ల ఎల్లా -గ్రేస్, తొమ్మిదేళ్ల హాడ్రియన్. విడిపోవడానికి సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో తన పిల్లలకు ఒక కుటుంబంలా ఉంటానని జస్టిన్ ట్రూడో తెలిపారు. పిల్లలనుసురక్షితమైన, ప్రేమ పూర్వక వాతావరణంలో పెంచడంపై ఇద్దరూ దృష్టిపెడతామని చెప్పారు. ఇదిలాఉంటే పదవిలో ఉండగా భార్య నుంచి విడిపోయిన రెండో ప్రధాని జస్టిన్ ట్రూడో. అంతకుముందు అతని తండ్రి పియరీ ట్రూడో 1979లో భార్య మార్గరెట్ నుండి విడిపోయారు. ఇద్దరూ 1984లో విడాకులు తీసుకున్నారు.