Protests in Canada: నిరసనలతో అట్టుడుకుతున్న కెనడా.. కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి ప్రధాని

ప్రభుత్వం విధించిన ఈ నిబంధనలు ప్రజల్లో ఆగ్రహావేశాలు రగిల్చాయి. దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కుటుంబంతో సహా రాజధానిని వదిలి అజ్ఞాతంలోకి జారుకున్నారు.

Protests in Canada: నిరసనలతో అట్టుడుకుతున్న కెనడా.. కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి ప్రధాని

Canada

Protests in Canada: కెనడా దేశ రాజధాని నిరసనకారులతో అట్టుడుకుతోంది. వేలాది మంది నిరసన కారులు ఒట్టావాలోని పరిపాలన కార్యాలయం “పార్లమెంట్ హిల్” వద్దకు చేరుకుని కెనడా ప్రభుత్వానికీ, ఆ దేశ ప్రధానికీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శనివారం ఉదయం సాధారణ నిరసనగా ప్రారంభమైన ఆందోళనలు ఒకదశలో అదుపుతప్పాయి. దేశంలో కరోనా వాక్సిన్ తప్పనిసరి చేస్తూ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదేశాలు జారిచేశారు. ప్రభుత్వం విధించిన ఈ నిబంధనలు ప్రజల్లో ఆగ్రహావేశాలు రగిల్చాయి. దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కుటుంబంతో సహా రాజధానిని వదిలి అజ్ఞాతంలోకి జారుకున్నారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు, భద్రతా సిబ్బంది విశ్వప్రయత్నం చేశారు. నిరనసకారులను అదుపుచేస్తే మరింత రెచ్చిపోయి హింసాత్మక అల్లర్లకు దారి తీసే అవకాశం ఉందన్న భద్రతా వర్గాల సమాచారం మేరకు..పోలీసులు సైతం జాగ్రత్తగా వ్యవహరించారు.

Also Read: Afghanistan: ఆహార సంక్షభంతో అవయవాలు అమ్ముకుంటున్న ఆఫ్ఘన్ తల్లిదండ్రులు

రవాణా నిమిత్తం అమెరికాకు వెళ్లివచ్చే ట్రక్ డ్రైవర్లకు కరోనా వాక్సిన్ తప్పనిసరి చేయగా, వలసదారులకు కరోనా నెగటివ్ రిపోర్ట్ మరియు 4 రోజుల క్వారంటైన్ నిబంధన తప్పనిసరి చేసింది కెనడా ప్రభుత్వం. ఈక్రమంలో గత కొన్ని రోజులుగా ట్రక్ డ్రైవర్లు కెనడా ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా ఆంక్షలతో సతమతమౌతున్న దేశ ప్రజలు.. కొత్తగా వచ్చిన నిబంధనలతో విసుగుచెందారు. దీంతో ట్రక్ డ్రైవర్లకు మద్దతు పలుకుతూ కెనడాలోని ప్రధాన నగరాల్లో ప్రజలు నిరసనకు దిగారు. వాక్సిన్ మ్యాండేట్ వద్దంటూ “స్వేచ్ఛ కాన్వాయ్” పేరుతో చేపట్టిన ఈ నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. కొందరు నిరసనకారులు విచక్షణ మరిచి..సైనికుల స్మారక చిహ్నాల వద్ద నృత్యాలు చేశారు. వార్ మెమోరియల్ వద్దనున్న ఒక సైనికుడి సమాధిపైకి ఎక్కారు.

Also read: Corona Update: దేశంలో అదుపులోకి మహమ్మారి, కొత్తగా ఎన్ని కేసులంటే?

ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటనలపై కెనడా రక్షణ మంత్రి అనితా ఆనంద్ స్పందిస్తూ..”దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికుల స్మారక చిహ్నాల వద్ద నిరసనకారులు నృత్యాలు చేయడం సిగ్గుచేటు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఎంతో పవిత్రంగా భావించే వార్ మెమోరియల్, సైనికుల సమాధులపై నిరసనకారులు పైత్యాన్ని ప్రదర్శించడం ఎంతో అవమానమని, దయచేసి దేశ ప్రజలు సంయమనం పాటించాలని అనితా ఆనంద్ అన్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప ఆందోళనలు సద్దుమణిగే అవకాశం లేదని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు.

Also read: Terrorist Encounter: జైషే మహమ్మద్ కమాండర్ సహా ఐదుగురు ముష్కరులు హతం