China : భూటాన్ అడ్డు పెట్టుకొని చైనా అరాచకాలు..డోక్లాం వద్ద గ్రామాల నిర్మాణం..సిలిగురి కారిడార్‌పై డ్రాగన్ కన్ను!
భూటాన్ అడ్డు పెట్టుకొని చైనా అరాచకాలకు పాల్పడుతోంది...డోక్లాం వద్ద గ్రామాల నిర్మాణం..ఈశాన్య రాష్ర్టాలను కలిపే సిలిగురి కారిడార్ ప్రాంతం నేరుగా డ్రాగన్ దేశం కన్ను పడింది.

Chinese Villages In Bhutan's Doklam Now Fully Occupied
Bharath-china : చర్చలు, ఒప్పందాలు అంటూ ఓ వైపు ఓవరాక్షన్ చేస్తూనే.. మరోవైపు కుటిలబుద్ధిని బయటపెట్టుకుంటోంది చైనా. భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న చైనా.. ఇప్పుడు భూటాన్ అడ్డు పెట్టుకొని మరో తెంపరితనానికి తెగించింది. ఏకంగా ఓ గ్రామం నిర్మించింది. ఇంతకీ ఆ గ్రామంతో ఇండియాకు వచ్చే సమస్య ఏంటి.. చైనా వేసిన కన్నింగ్ ప్లాన్ ఏంటి.. ?
పక్కదేశాల భూభాగాలపై కన్నేసి.. దురాక్రమణతో రెచ్చిపోతోంది. అర్థం లేని వాదనలు వినిపిస్తూ.. దిగజారుడుతనానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారుతోంది. చైనా మారదు. తన తీరు మార్చుకోదు. డ్రాగన్ ఎలాగైతే పరాన్న జీవో.. చైనా కూడా పరాన్న దేశమే. భారత సరిహద్దుల్లో చైనా ఎప్పుడూ కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది. గాల్వన్ లోయ ఘటన తర్వాత.. దశలవారీగా చర్చలు జరిగాయ్. భారత భూభాగంలోకి చొచ్చుకు రావొద్దని నిబంధన విధించగా.. కొద్దిరోజులు సైలెంట్‌గా ఉన్న చైనా.. ఇప్పుడు మళ్లీ తోక జాడిస్తోంది. కుక్కతోక బుద్ధి అంటే ఏంటో చూపిస్తోంది. సమయం దొరికిన ప్రతీసారి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.
హిమాలయాల పొడవునా అక్రమ నిర్మాణాలు చేపడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. లద్ధాఖ్ సమీపంలో ఇటీవల చైనా ఓ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ విషయం శాటిలైట్ ఫోటోల ద్వారా బహిర్గతం అయింది. చైనా బాగోతాన్ని ప్రపంచవేదికపై ఇండియా బయటపెట్టగా.. ఆ వ్యవహారంపై చర్చ జరుగుతుండగానే.. డ్రాగన్ తన దొంగ బుద్ధి బయటపెట్టింది. ఇప్పుడు భూటాన్ భూభాగంలో అక్రమంగా గ్రామాలు నిర్మిస్తోంది. వ్యూహాత్మక సరిహద్దు ప్రాంతాల విషయంలో భారత్ మీద పైచేయి సాధించేందుకు పావులు కదుపుతోంది. దీంతో భారత్‌కి చెందిన కీలకమైన ప్రాంతాలపై కూడా కన్నేసే ప్రమాదం ఉంది. చైనా చేపట్టిన గ్రామాల నిర్మాణానికి సంబంధించి మాక్సర్ సంస్థ శాటిలైన్ చిత్రాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయ్. దీంతో డ్రాగన్ దొంగబుద్ది ఏంటో బయటపడింది.
2017లో భారత్, చైనా దళాల మధ్య ఘర్షణలు జరిగిన డోక్లాం పీఠభూమికి తూర్పుగా… 9 కిలోమీటర్ల దూరంలో పంగ్డా పేరుతో ఓ గ్రామాన్ని నిర్మించింది. అక్కడికి తమ దేశ ప్రజలను తరలించింది. భూటాన్ భూభాగంలోని అమోచూ నదీ వెంట నిర్మించిన ఈ గ్రామంలో… భవనాలు, ఇళ్ల ముందు కార్లు పార్కింగ్ చేసి ఉన్నట్లు మాక్సర్ విడుదల చేసి శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. నదీ తీరంలో ఏకంగా 10 కిలోమీటర్ల దూరం మేర భూమిని చైనా ఆక్రమించింది. ఈ ప్రాంతంలో రెండో గ్రామం కూడా నిర్మాణం జరుగుతోంది. ఇక మూడో గ్రామం కోసం నదిపై ఓ బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టింది.
2017లో డోక్లాం పీఠభూమిని ఆక్రమించేందుకు చైనా ప్రయత్నిస్తే… దాన్ని మన సైన్యం గట్టిగా అడ్డుకుంది. అప్పుడు రెండువైపుల నుంచి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయ్. చేసేదిలేక అప్పుడు డ్రాగన్ సైన్యం వెనక్కు తగ్గింది. ఆ తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉన్న చైనా.. చడీచప్పుడు లేకుండానే డోక్లాంకు 9కిలోమీటర్ల దూరంలో ఉన్న భూటాన్ భూభాగంలో ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించింది. సైనికావసరాల కోసమే ఆ గ్రామం అని అప్పుడు ప్రకటించినా.. ఇప్పుడు మాములు జనాలు కూడా జీవిస్తున్నారు. చాలా ఇళ్ల ముందు కార్లు కూడా కనిపిస్తున్నాయ్. అంటే చైనా చెప్పేదొకటి చేసేదొకటని మరోసారి ప్రూవ్ అయింది. ఈ గ్రామం చుట్టుపక్కల చైనా సరిహద్దుల నుండి చాలా రోడ్లు కనిపిస్తున్నాయ్. సైనిక వాహనాల రాకపోకలకు పక్కా రోడ్లను ఏర్పాటు చేసుకున్నట్లు క్లియర్‌గా అర్థం అవుతోంది.
డోక్లాం సమీపంలో చైనా గ్రామాలు నిర్మిస్తుండడం… భారత్‌కు ఆందోళనకర అంశమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఈ నిర్మాణాలతో అమోచూ నది సమీపం నుంచి అత్యంత కీలకమైన డోక్లాం పీఠభూమిలోని జంపేరి అనే వ్యూహాత్మక శిఖరానికి చేరుకోవడం చైనా బలగాలకు తేలిక అవుతుంది. దీంతో భారత్‌కి చెందిన సున్నితమైన, వ్యూహాత్మకమైన దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఈశాన్య రాష్ర్టాలను కలిపే సిలిగురి కారిడార్ ప్రాంతం నేరుగా డ్రాగన్ గురిలోకి వస్తుంది. 2017లో జంపేరీ దగ్గరకు రాకుండా చైనా సైనికులను భారత బలగాలు అడ్డుకున్నాయ్. దీంతో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా అదే శిఖరానికి చేరుకోవడానికి డ్రాగన్ ఇప్పుడు కుట్రలకు పాల్పడుతోంది.