Biden-Xi Talks : బైడెన్ కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన జిన్ పింగ్..తెరమీదకు ట్రంప్-జిన్ పింగ్ డిన్నర్ మీట్

మంగళవారం ఉదయం అమెరికా-చైనా దేశాధినేతల మధ్య తొలిసారి జరిగిన వర్చువల్‌ చర్చలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ బలప్రదర్శనకు వాడుకొన్నారు. తైవాన్ స్వాతంత్ర్య ఉద్యమాన్ని

Biden-Xi Talks : బైడెన్ కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన జిన్ పింగ్..తెరమీదకు ట్రంప్-జిన్ పింగ్ డిన్నర్ మీట్

Biden Xi

Biden-Xi Talks మంగళవారం ఉదయం అమెరికా-చైనా దేశాధినేతల మధ్య తొలిసారి జరిగిన వర్చువల్‌ చర్చలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ బలప్రదర్శనకు వాడుకొన్నారు. తైవాన్ స్వాతంత్ర్య ఉద్యమాన్ని అమెరికా ప్రోత్సహించడాన్ని వ్యతిరేకిస్తూ జో బైడెన్​ను నేరుగా హెచ్చరించారు జిన్ పింగ్.ఈ భేటీలో మొదట ఇద్దరు దేశాధినేతలు వ్యక్తిగత సంబంధాలను గుర్తుకు తెచ్చుకొన్నారని, అనంతరం ఇరు దేశాల మధ్య అత్యంత కీలకమైన వివాదం ప్రస్తావనకు వచ్చినట్లు చైనా మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. సమావేశం సందర్భంగా చైనా అధ్యక్షుడు తైవాన్ అంశంపై మాట్లాడారని తెలిపింది.

జిన్ పింగ్ మాట్లాడుతూ… “తైవాన్‌ కోసం అక్కడి అధికారులు తరచూ అమెరికాను మద్దతు కోరడం.. ఇదే సమయంలో అమెరికాలో కొందరు చైనాను దెబ్బతీయడం కోసం తైవాన్‌ను వాడుకోవాలనుకోవడం వంటి చర్యలు అత్యంత ప్రమాదకరమైనవి. నిప్పుతో చెలగాటమాడుకోవడం లాంటివే. నిప్పుతో ఎవరైతే చెలగాటం ఆడుకుంటారో.. వారు భస్మం కావడం ఖాయం”అని సమావేశం సందర్భంగా జిన్ పింగ్ వ్యాఖ్యానించినట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది. ఇక,ఇరు దేశాలు సమస్యలను సంయుక్తంగా పరిష్కరించాలని చైనా అధ్యక్షుడు ఆంకాంక్షించారని తెలిపింది.

మరోవైపు,అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. జిన్‌పింగ్‌ ఆరోపణలను తోసిపుచ్చారు. తాము యథాతథ పరిస్థితిలో మార్పులు తెచ్చేందుకు గానీ, తైవాన్‌ జలసంధిలో ఉద్రిక్తతలు సృష్టించడానికి వ్యతిరేకమని తెలిపారు.

అయితే అమెరికా అధ్యక్షుడిని జిన్​పింగ్ నేరుగా హెచ్చరించడం ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జిన్​పింగ్​ను హెచ్చరించిన విషయం ఇప్పుడు తెరమీదకు వచ్చింది. 2017 లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అమెరికాలో పర్యటించిన సమయంలో ఫ్లొరిడాలోని పామ్‌ బీచ్‌ వద్ద ఉన్న తన భవనంలో జిన్‌పింగ్‌కు ఆతిథ్యం ఇచ్చారు ట్రంప్.

అయితే మరోపక్క సిరియాలోని బషర్‌ అల్‌ అసద్‌ సేనలకు వ్యతిరేకంగా అమెరికా సంకీర్ణ సేనలు పోరాడుతున్నాయి. రష్యా ప్రోత్సాహంతో చైనా నుంచి బషర్‌ సర్కారుకు సాయం అందుతోందన్న అనుమానాలు అమెరికాలో ఉన్నాయి. బషర్‌ అల్‌ అసద్‌పై తీసుకొస్తున్న ఐరాస తీర్మానాలను తరచూ రష్యాతో కలిసి చైనా అడ్డుకుంటోంది. దీనికి తోడు అసద్‌ విషవాయువులను సిరియాలోని సొంత ప్రజలపై ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

దీంతో జిన్‌ పింగ్‌ను హెచ్చరించడానికి డిన్నర్‌ను వాడుకొన్నారు ట్రంప్. ట్రంప్‌, జిన్‌పింగ్‌ భోజనం ముగించి చాక్లెట్‌ కేక్‌ తింటున్నారు. అదే సమయంలో ట్రంప్‌… జిన్ పింగ్ ను ఉద్దేశించి “మిస్టర్‌ ప్రెసిడెంట్‌ మీకో విషయం చెబుతాను. ఇప్పుడే మేము 59 క్షిపణులను ప్రయోగించాం. అవి ఇప్పుడే సిరియావైపు వెళుతున్నాయి. మీకు ఆ విషయం తెలియాలి అనుకొంటున్నాను” అని అన్నారు. ట్రంప్ మాటలు విన్న జిన్ పింగ్ కు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యింది. కొద్దిసేపు జిన్ పింగ్ కు నోటి వెంట మాట రాలేదు. కొద్ది క్షణాల తర్వాత పక్కనే ఉన్న అధికారిని పిలిచి ట్రంప్‌ ఏమన్నారో మరోసారి చెప్పమని కోరారు. అనంతరం జిన్‌పింగ్‌ స్పందిస్తూ.. “మీరు చెప్పినట్లు గానీ, ఇంకా ఏ విధంగానైనాగానీ ఎవరైనా విషవాయువులను చిన్నపిల్లలు, పసికందులపై ప్రయోగించడం రాక్షసత్వం. ఇట్స్‌ ఓకే” అని జిన్‌పింగ్‌ అన్నారు.

ALSO READ CM KCR: ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరికి నిరసనగా.. ఈనెల 18న హైదరాబాద్‌లో TRS ధర్నా

ALSO READ China Overtakes U.S : ప్రపంచంలో నెం.1 సంపన్న దేశంగా చైనా..తాజా రిపోర్ట్ లో కీలక విషయాలు