China Population : చైనాలో వేగంగా తగ్గిపోతున్న జనాభా..ఫలితంగా..రోజు రోజు పడిపోతున్న ఉత్పాదక శక్తి

చైనాకు ఇదే ముప్పు ఎదురుకాబోంది. చైనా జనాభా ఊహించిన దానికంటే వేగంగా తగ్గుతోంది. అదే సమయంలో పనిచేసే వయసున్న వారి జనాభా క్రమంగా తగ్గుతోంది. యువత తగ్గిపోవడంతో అక్కడ ఉత్పాదక శక్తి వేగంగా పడిపోతోంది. క్రమంగా దేశ అవసరాలకు తగినంత కార్మిక శక్తి లేక కొత్తకొత్త సవాళ్లు ఎదురు కానున్నాయి.

China Population : చైనాలో వేగంగా తగ్గిపోతున్న జనాభా..ఫలితంగా..రోజు రోజు పడిపోతున్న ఉత్పాదక శక్తి

China’s Population Growth Rate Falls (1)

China Population : కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు… చైనాకు ఇదే ముప్పు ఎదురుకాబోంది. చైనా జనాభా ఊహించిన దానికంటే వేగంగా తగ్గుతోంది. అదే సమయంలో పనిచేసే వయసున్న వారి జనాభా క్రమంగా తగ్గుతోంది. యువత తగ్గిపోవడంతో అక్కడ ఉత్పాదక శక్తి వేగంగా పడిపోతోంది. క్రమంగా దేశ అవసరాలకు తగినంత కార్మిక శక్తి లేక కొత్తకొత్త సవాళ్లు ఎదురు కానున్నాయి.

చైనా తన ఉత్పాదన సామర్థ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఓ స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఉత్పాదన శక్తిలో తనకు తిరుగులేదని నిరూపించుకుంది. కానీ రాబోయే రోజుల్లో పనిచేసే వయసున్న వారి సంఖ్య చైనాలో తగ్గిపోతోంది. ఆశించిన స్థాయిలో జనాభా పెరగడం లేదు. అంతకంటే వేగంగా జనాభా వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. చైనా జనాభా 2029లో గరిష్ట స్థాయిలో 144 కోట్లకు పెరిగిపోతుందని చైనా అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ 2019లో అంచనా వేసింది. ఆ తర్వాత 2031-32 సంవత్సరాల నాటికి కూడా ఈ పెరుగుదల కొనసాగుతుందని అప్పటికి గరిష్ట స్థాయిలో 146 కోట్లకు జనాభా సంఖ్య పెరుగుతుందని 2019 నాటి ఐక్యరాజ్యసమితి జనాభా అంచనాల నివేదిక లెక్కగట్టింది. కానీ అంచనాలకు భిన్నంగా గత ఏడాది నుంచి చైనా జనాభా వేగంగా తగ్గుతూ వస్తోంది. 2021 నుంచి దేశ జనాభా ఏటా 1.1 శాతం చొప్పున తగ్గుతూ వస్తుందని.. 2100 సంవత్సరం నాటికి జనాభా ఇప్పటికన్నా సగానికి పైగా తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు.

Also read : China Population : సంకటం పరిస్థితుల్లో చైనా..ఓవైపు ప్రపంచంపై ఆధిపత్యం కోసం ఆరాటం..మరోవైపు తగ్గిపోతున్న జనాభా

చైనా జనం పిల్లలను కనేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఇప్పటికే జనాభా తగ్గుముఖం పట్టింది. ఈ తగ్గుదల ఇలాగే కొనసాగితే 2030 నాటికి చైనా జననాల రేటు 1.15 నుంచి 1.1 శాతానికి పడిపోతుందని.. అది 2100 సంవత్సరం వరకూ అలాగే కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. జనాభా ఇంత వేగంగా తరిగిపోవటం చైనా ఆర్థిక వ్యవస్థ మీద భారీ ప్రభావం చూపుతుంది. చైనాలో పనిచేసే వయసు జనాభా 2014లో గరిష్ట స్థాయికి పెరిగిపోయింది. ఈ వయసు వారి జనాభా 2100 సంవత్సరానికి గరిష్ట స్థాయిలో మూడో వంతుకు తరిగిపోతుందని అంచనా. ఈ కాలంలో చైనాలో 65ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వయోవృద్ధుల జనాభా పెరుగుతూ వస్తోంది. 2080 నాటికి వృద్ధుల సంఖ్య.. పనిచేసే వయసు వారి సంఖ్యను మించిపోతుందని.. ఆ తర్వాత కూడా వృద్ధుల జనాభా పెరుగుదల కొనసాగుతుందని అంచనాలు వేశారు. ఈ మార్పు చైనా ఉత్పాదక సామర్ద్యంపై ప్రభావం చూపుతోంది. పనిచేసే వాళ్ల సంఖ్య తగ్గిపోయి కూర్చొని తినేవాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారనుందని అంచనా వేస్తున్నారు

కార్మిక శక్తి వేగంగా పడిపోతుండటం వల్ల కార్మిక శక్తి ఖరీదు పెరిగిపోతుంది. ఫలితంగా తక్కువ లాభాలుండే, కార్మిక శక్తి ఎక్కువ అవసరమయ్యే తయారీ రంగం చైనా నుంచి బయటకు తరలిపోతుంది. కార్మిక శక్తి పుష్కలంగా లభించే వియత్నాం, బంగ్లాదేశ్, ఇండియా వంటి దేశాలకు ఆ తయారీ రంగం మళ్లుతుంది. ఇప్పటికే.. వియత్నాంతో పోలిస్తే చైనాలో తయారీ రంగపు కార్మిక శక్తి ఖరీదు రెట్టింపుగా ఉంది. అదే సమయంలో.. పెరుగుతున్న వృద్ధ జనాభా అవసరాలను తీర్చటానికి చైనా తన ఉత్పాదక వనరుల్లో ఎక్కువ భాగాన్ని ఆరోగ్యం, వైద్య రంగాలకు మళ్లించాల్సి వస్తుంది.చైనాలోఇప్పుడున్న పెన్షన్ విధానంలో మార్పులు చేయకపోతే.. 2020 సంవత్సరంలో జీడీపీలో 4 శాతంగా ఉన్న ఆ దేశ పెన్షన్ చెల్లింపులు 2100 సంవత్సరానికి జీడీపీలో 20 శాతానికి పెరిగిపోతుందని.. ఆస్ట్రేలియాలోని విక్టోరియా యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఆఫ్ పాలసీ స్టడీస్ రూపొందించిన ఒక నమూనా హెచ్చరిస్తోంది.

Also read : Indian Defence : చైనాతో యుద్ధం చేయాల్సి వస్తే..భారత్ దగ్గరున్న ఆయుధ సంపత్తి ఎంత? చైనా ఆయుధ సత్తా ఎంత?

చైనాకు వనరులను ఎగుమతులు చేసే ఆస్ట్రేలియా వంటి దేశాలు.. ఈ మార్పుల ఫలితంగా మున్ముందు చైనా వెలుపల తయారీదారులకు తన ఎగుమతులను మళ్లించే అవకాశం ఉంది. అలాగే చైనా నుంచి దిగుమతులు చేసుకునే అమెరికా వంటి దేశాలు క్రమంగా.. కొత్తగా ఆవిర్భవించే తయారీ కేంద్రాలవైపు మళ్లాల్సి వస్తుంది. అంటే ఇండియా, వియత్నాం లాంటి నాణ్యమైన కార్మిక శక్తి ఉన్న దేశాలవైపు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడం ఖాయమనే భావన కలుగుతోంది.

ఇది చైనా శతాబ్దం అంటూ ప్రచారం చేసుకుంటున్న ఆ దేశానికి ఊహించని ఎదురుదెబ్బలు తగిలే ప్రమాదం కనిపిస్తోంది. చైనాను ఈ పరిస్థితుల నుంచి తప్పించడం ఇప్పుడున్న పరిస్థితులలో ఎవరి వల్లా కాదు. కానీ ఆ తీవ్రత తగ్గించేందుకు చైనా తన ఉత్పాదక సామర్ధ్యం తగ్గకుండా ఉండేందుకు ఆధునికీకరణవైపు మల్లాలి. వేగంగా యాంత్రీకరణ సామర్ధ్యం పెంచుకొని కార్మికుల అవసరాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలి. కానీ అప్పుడు ఉత్పాదక ఖర్చు పెరిగి వస్తువుల ధరలు పెరుగుతాయి. ఖరీదైన వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ తగ్గిపోతుంది అప్పుడు ఆర్థికాభివృద్ధి మరింతగా తగ్గిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎలా చూసుకున్నా రాబోయే వందేళ్లు చైనాకు అత్యంత గడ్డుకాలమనే చెప్పుకోవాలి.