China Population : సంకటం పరిస్థితుల్లో చైనా..ఓవైపు ప్రపంచంపై ఆధిపత్యం కోసం ఆరాటం..మరోవైపు తగ్గిపోతున్న జనాభా

China Population : సంకటం పరిస్థితుల్లో చైనా..ఓవైపు ప్రపంచంపై ఆధిపత్యం కోసం ఆరాటం..మరోవైపు తగ్గిపోతున్న జనాభా

China’s Population Growth Rate Falls

China Population : ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అనే ట్యాగ్‌లైన్‌ను చైనా త్వరలో కోల్పోనుందా? ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న చైనాకు ఇప్పటి వరకు ఉన్న బలమే బలహీనతగా మారిపోనుందా? చైనా జనాభా వేగంగా పడిపోతోందనే అంచనాలు దేనికి సంకేతం నాలుగు దశాబ్దాల పాటు గణనీయంగా పెరిగిన చైనా జనాభా ఎందుకు తగ్గుతోంది..? పిల్లలను కన్నవారికి చైనా ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్నా జనం ఎందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ పరిణామాలతో చైనా భవిష్యత్ ఎలా మారోబోతోంది?

ప్రపంచానికి పెద్దన్నగా మారాలనుకుంటున్న చైనా కోరిక నెరవేరేలా కనిపించడం లేదు. ఇంతకాలం జనాభానే తన బలమనుకున్న చైనాకు అదే బలహీనతగా మారుతోంది. చైనాలో రోజురోజుకు తగ్గిపోతున్న జనాభా ఆదేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికైతే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనాయే. చైనా జనాభా ప్రపంచ జనాభాలో ఆరో వంతు కన్నా ఎక్కువగా ఉంటుంది. నాలుగు దశాబ్దాల్లో ఆ దేశ జనాభా 66 కోట్ల నుంచి 140 కోట్లకు పెరిగిపోయింది. కానీ ఈ ఏడాది తొలిసారిగా ఆ దేశ జనాభా సంఖ్య తగ్గబోతోంది. 1959-1961 మధ్య దేశాన్ని కరవు పీడించింది ఆ సమయంలో ఆకలి చావులు పెరిగి చైనా జనాభా స్వల్పంగా తగ్గింది ఆ తర్వాత చైనా జనాభా తగ్గటం ఇదే తొలిసారి.

చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాల ప్రకారం.. 2021లో ఆ దేశ జనాభా 141 కోట్ల 21 లక్షల 20 వేల నుంచి 141 కోట్ల 26 లక్షలకు మాత్రమే పెరిగింది. అంటే దశాబ్దం కిందట 80 లక్షలుగా వార్షిక జనాభా పెరుగుదల గత ఏడాది కేవలం 4 లక్షల 80 వేలకు పడిపోయింది. కఠినమైన కోవిడ్ నియంత్రణ చర్యలు అమలులో ఉండటం వల్ల పిల్లలను కనడానికి ఇష్టపడకపోవటం.. గత ఏడాది జననాల తగ్గుదలకు ఒక కారణమైనప్పటికీ ఈ తగ్గుదల అంతకుముందు కొన్నేళ్లుగానూ కనిపిస్తూ వస్తోంది. ఇది అకస్మాత్తుగా వచ్చిన మార్పు కాదు అంతకు ముందు జంటకు ఒకర్నే కనాలనే పాలసీని అమలు చేసిన ఫలితం ఇప్పుడు అక్కడ జనాభా గణనీయంగా తగ్గిపోతోంది.

1980 సమయంలో చైనాలో ఒక మహిళకు సగటు జననాల రేటు 2.6 గా ఉండేది. అప్పటి మరణాల రేటు 2.1 గా ఉండగా.. అంతకంటే ఎక్కువగానే జననాల రేటు ఉండేది. 1994 తరువాత జననాల రేటు 1.6 నుంచి 1.7 మధ్య ఉండేది. 2020 నాటికి అది 1.3కి, 2021 నాటికి 1.15కి పడిపోయింది. ఇతర దేశాలతో పోల్చిచూసినపుడు.. అమెరికా, ఆస్ట్రేలియాల్లో సగటు జననాల రేటు ఒక మహిళకు 1.6 జననాలుగా ఉంది. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న జపాన్‌లో ఈ రేటు 1.3గా ఉంది.

జనాభా నియంత్రణ కోసం గతంలో ప్రవేశపెట్టిన ఒకే బిడ్డ విధానాన్ని చైనా 2016లో సడలించింది. ఇద్దరు బిడ్డలను కనేందుకు ప్రజలను అనుమతించింది. అనంతరం 2021లో ముగ్గురు బిడ్డల విధానాన్ని ప్రవేశపెట్టి, పన్ను రాయితీలు, ప్రోత్సాహాలు ప్రకటించింది. అయినప్పటికీ చైనాలో జననాల రేటు పడిపోతూ వస్తోంది. ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నా చైనా మహిళలు పిల్లలను కనటానికి ఎందుకు ఇష్టపడటం లేదనే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తాయి

దశాబ్దాల పాటు అమలు చేసిన ఒకే బిడ్డ పాలసీ జనంపై తీవ్ర ప్రభావం చూపింది.జనం చిన్న కుటుంబాలకు అలవాటు పడ్డారు. దేశవ్యాప్తంగా పెరిగిన ధరలతో జీవన వ్యయం పెరిగిపోయింది. ఇదే కాకుండా కెరీర్ కోసం పెళ్లిని వాయిదా వేయడంతో చైనాలో సగటు వివాహ వయసు పెరుగిపోయింది. కెరీర్‌పైనే దృష్టిపెట్టడంతో పిల్లలు కావాలనే కోరిక సన్నగిల్లటం కూడా చైనాలో జనాభా తగ్గిపోవడానికి ఒక కారణంగా భావిస్తున్నారు

చైనాలో పిల్లలు కనేందుకు ఉన్న నిబంధనలు సడలించినా ఇప్పుడు దేశంలో పిల్లలను కనే వయసున్న మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. 1980 నుంచీ కేవలం ఒకే బిడ్డకు జన్మనివ్వటానికి పరిమితం కావటం వల్ల చాలా మంది దంపతులు మగపిల్లవాడు కావాలని కోరుకున్నారు. దీనివల్ల.. జననాల్లో 100 మంది బాలికలకు 106 మంది బాలురుగా ఉన్న లింగ నిష్పత్తి 100 బాలికలకు 120 మంది బాలురకు పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ నిష్పత్తి 100:130గా ఉంది.

చైనా జనాభా వృద్ధి 60 ఏళ్ల కిందటి దుర్భిక్షం తర్వాత గత ఏడాది తొలిసారిగా అతి తక్కువకు పడిపోయింది. 1,000 మంది జనాభాకు కేవలం 0.34 మాత్రానికి పెరుగుదల రేటు నమోదైంది. నిజానికి షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ బృందం ఈ జనాభా వృద్ధి తరుగుదల ఈ ఏడాది ఉంటుందని.. 1,000 మందికి 0.49కి అది తగ్గుతుందని అంచనా వేసింది. ఇది ఆందోళన కలిగించే పరిణామంగా భావిస్తోంది చైనా.