ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురైనట్లు ప్రచారం.. పాకిస్థాన్‌లో దుమారం

ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. ఆయనపై ఉన్న అనేక కేసుల్లో విచారణ జరుగుతోంది.

ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురైనట్లు ప్రచారం.. పాకిస్థాన్‌లో దుమారం

Imran Khan

Updated On : November 26, 2025 / 6:31 PM IST

Imran Khan: ఆడియాలా జైలులో పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ హత్యకు గురయ్యారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ? అంటూ ఇమ్రాన్‌ అక్కాచెల్లెళ్లు, పీటీఐ నేతలు ఆందోళనకు దిగారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ అక్కాచెల్లెళ్ల పేర్లు నూరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు రావల్పిండిలోని ఆడియాలా జైలు వద్దకు వెళ్లారు. ఇమ్రాన్ ఖాన్‌ను కలవనివ్వాలని జైలు బయట పాక్ తహ్రీక్ ఏ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) నేతలతో కలిసి ఆ ముగ్గురు మహిళలు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు తమపై దాడి చేశారని తెలిపారు. (Imran Khan)

ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి ఆడియాలా జైలులో ఉన్నారు. ఆయనను మూడు వారాలుగా కలవనివ్వకుండా తమను అడ్డుకుంటున్నారని నూరీన్ నియాజీ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ అన్నారు.

Also Read: మేం ఊరుకోం, తగలబెట్టేస్తాం.. 2025లో ప్రభుత్వాలను పడగొట్టిన జెన్‌ జీ.. అన్ని దేశాలకు ఎలా విస్తరించింది? 2026లో ఇక..

పంజాబ్ పోలీస్ చీఫ్ ఉస్మాన్ అన్వార్‌కు వారు ముగ్గురు లేఖ రాశారు. ఈ హింస క్రూరమైందని, ముందస్తు ప్రణాళికలో భాగంగా దాడి చేశారని పేర్కొన్నారు.

“ఇమ్రాన్‌ ఆరోగ్య పరిస్థితిపై మాలో ఆందోళన నెలకొంది. దీంతో మేము శాంతియుతంగా నిరసన చేశాం. అయినా ఆ ప్రాంతంలో స్ట్రీట్‌ లైట్లు ఆర్పేశారు. వెంటనే పంజాబ్ పోలీస్ సిబ్బంది క్రూరంగా దాడి చేశారు” అని నూరీన్ నియాజీ అన్నారు.

“నా వయస్సు 71 ఏళ్లు. నా జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టేసి రహదారి మీదకు లాగేశారు, గాయాలు అయ్యాయి” అని ఆమె ధ్వజమెత్తారు. జైలు బయట ఉన్న ఇతర మహిళలను చెంపదెబ్బలు కొట్టి లాగేశారని ఆమె చెప్పారు. పోలీసుల ప్రవర్తన పూర్తిగా నేరపూరితమైనది, అక్రమం, అనైతికం అని మండిపడ్డారు.

వారం రోజుల నుంచి నిరసనలు
ఆడియాలా జైలు బయట పీటీఐ నేతలతో కలిసి నూరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ వారం రోజుల నుంచి నిరసన తెలుపుతున్నారు. జైలులో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ను చూడనివ్వకుండా కొన్ని వారాల తరబడి అడ్డుకుంటున్నారని ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లు అన్నారు. ఈ కారణంగానే తాము ప్రశాంతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేయవలసి వచ్చిందని పేర్కొన్నారు.

ఇమ్రాన్‌ను హత్య చేశారు!: బలూచిస్థాన్‌ విదేశాంగ శాఖ
ఇమ్రాన్‌ను హత్య చేశారని వార్తలు వస్తున్నట్లు బలూచిస్థాన్‌ విదేశాంగ శాఖ తమ అధికారిక ఎక్స్‌ అకౌంట్‌లో ఓ పోస్ట్ చేయడం గమనార్హం. పాకిస్థాన్ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ అసీం మునీర్‌తో పాటు ఐఎస్‌ఐ కలిసి ఖాన్‌ను చంపేసినట్లు వార్తలు వస్తున్నాయని బలూచిస్థాన్‌ విదేశాంగ శాఖ తెలిపింది.

పలు మీడియా సంస్థలు సైతం ఈ ఖాన్‌ మృతికి సంబంధించిన వార్తలను ప్రచురించాయంటూ సోషల్ మీడియాలో పలువురు నేతలు పోస్ట్‌ చేస్తున్నారు. ఇమ్రాన్ అనారోగ్య కారణాతో మృతి చెందాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. అధికారికంగా మాత్రం ఎటువంటి ప్రకటనా రాలేదు.

2023 ఆగస్టు నుంచి జైలులోనే..
ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. ఆయనపై ఉన్న అనేక కేసుల్లో విచారణ జరుగుతోంది. ఆయన మృతి చెందాడని చాలా కాలంగా వదంతులు వస్తూనే ఉన్నాయి. ఖాన్ సెల్‌లో ఒంటరిగా ఉన్నాడని ఆయన పార్టీ తెలిపింది. పాక్‌లో ఆటవిక పాలన నడుస్తోందని, పాలించే మృగానికే హక్కులు ఉంటాయని, ఇంకెవరికీ హక్కులు ఉండట్లేదని ఇమ్రాన్ న్యాయవాది ఖాలిద్ యూసఫ్ చౌధరి అన్నారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ను కలుసుకునేందుకు ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిదికి కూడా అనుమతి ఇవ్వలేదు. అఫ్రిది వరుసగా ఏడు సార్లు ప్రయత్నించినా జైలు అధికారులు నిరాకరించారని, వారిని ఒక సైనిక అధికారి నియంత్రిస్తున్నాడని ఇమ్రాన్‌ ఖాన్ కొన్ని వారాల క్రితం ఆరోపించారు. జైలు అధికారులు ఒక సైనిక అధికారి నియంత్రణలో ఉన్నారని ఖాన్ అంటున్నారు.