Corona : మళ్లీ కరోనా కల్లోలం‌.. ఒక్కరోజే 924 మంది మరణం

కరోనా వైరస్‌ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కొన్ని రోజులుగా నిత్యం 900మంది కరోనాతో చనిపోతున్నారు. ఈ ఏడాది రోజువారీ కొవిడ్‌ మరణాల్లో ఇవే అత్యధికం.

Corona : మళ్లీ కరోనా కల్లోలం‌.. ఒక్కరోజే 924 మంది మరణం

Coronavirus Deaths

Corona : యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. వ్యాక్సిన్ కూడా వచ్చేసింది.. అన్ని దేశాలు క్రమంగా ఆంక్షలు సడలిస్తున్నాయి. ఇంకేం భయం లేదని జనాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంతలోనే కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. ఒక్కసారిగా రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇదీ రష్యాలో నెలకొన్న తాజా పరిస్థితి.

రష్యాలో కరోనా వైరస్‌ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కొన్ని రోజులుగా నిత్యం 900మంది కరోనాతో చనిపోతున్నారు. ఈ ఏడాది రోజువారీ కొవిడ్‌ మరణాల్లో ఇవే అత్యధికం. రష్యాలో గత రెండు రోజులుగా కొవిడ్‌ మరణాలు విపరీతంగా పెరిగాయి. బుధవారం ఒక్కరోజే 929 కరోనా మరణాలు నమోదు చేసుకోగా.. వరుసగా రెండోరోజు 924 మంది చనిపోయారు. వ్యాక్సిన్‌ పంపిణీ మందకొడిగా కొనసాగడం, చాలా ప్రాంతాల్లో కొవిడ్‌ ఆంక్షలు పాటించకపోవడంతోనే రష్యాలో వైరస్‌ విజృంభణ ఒక్కసారిగా పెరగడానికి కారణాలని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు.

Mukesh Ambani : ఇండియాకు 7-ఎలెవెన్ స్టోర్లు.. దేశంలో ఫస్ట్ స్టోర్ ఎక్కడంటే?

యూరప్‌లో అత్యధిక కరోనా మరణాలు రష్యాలోనే చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు అక్కడ 2లక్షల 13వేల మంది కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు. నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉండొచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇక రోజువారీ కొవిడ్‌ కేసుల సంఖ్య 27వేల కేసులు నమోదు చేసుకోగా.. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ మరణాల సంఖ్య అధికంగా ఉండడం ఆందోళన కలిగించే విషయమని ఆరోగ్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మందకొడిగా వ్యాక్సినేషన్..
సెప్టెంబర్‌ నెల నుంచి రష్యాలో కొవిడ్‌ కేసులు, మరణాల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. ఇందుకు వ్యాక్సిన్‌ పంపిణీ మందకొడిగా సాగడమే కారణమని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో తొలి వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసుకున్నట్లు ప్రకటించిన రష్యా.. పంపిణీలో మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే చాలా వెనుకబడిపోయింది. మొత్తం 14కోట్లు పైచిలుకు ఉన్న రష్యా జనాభాలో ఇప్పటివరకు కేవలం 33శాతం మందికి కనీసం ఒక్కడోసు మాత్రమే అందించారు. రష్యా మొత్తం జనాభాలో కేవలం 29శాతం మాత్రమే రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

Facebook: ఫేస్‌బుక్‌ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు..!

కొన్ని రోజులుగా వైరస్‌ తీవ్రత పెరగడంతో పలు ఆస్పత్రుల ముందు అంబులెన్సులు క్యూ కడుతున్న దృశ్యాలు రష్యన్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. చాలా ఆస్పత్రుల్లో 95శాతం బెడ్లు నిండిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా మరణాల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు స్థానికంగా ఆంక్షలు విధించే పనిలో పడ్డారు. థియేటర్లు, రెస్టారెంట్లతోపాటు మరికొన్ని ప్రాంతాలకు కేవలం వ్యాక్సిన్‌ తీసుకున్న వారినే అనుమతిస్తున్నారు. లేదా కొవిడ్‌ నెగటివ్‌ ఉన్న రిపోర్టుని తప్పనిసరి చేస్తున్నారు. రష్యా కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ లెక్కల ప్రకారం, ఇప్పటివరకు ఆ దేశంలో 77లక్షల కరోనా కేసులు నమోదవగా.. 2లక్షల 13వేల 549 మంది చనిపోయారు.