గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి, మరో బాంబు పేల్చిన శాస్త్రవేత్తలు

  • Published By: naveen ,Published On : July 6, 2020 / 10:19 AM IST
గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి, మరో బాంబు పేల్చిన శాస్త్రవేత్తలు

చైనాలోని వుహాన్ లో 2019 డిసెంబర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా మానవాళి మొత్తాన్ని భయపెడుతున్న ముప్పు కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య కోటి దాటగా.. మృతుల సంఖ్య లక్షల్లో ఉంది. అనధికారికంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య, మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. రోజురోజుకి కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

గాలి ద్వారా కరోనా వ్యాప్తి:
కాగా, కరోనా వైరస్ గురించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో వణుకు పుట్టించే కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కరోనా వైరస్‌ ప్రధానంగా… వ్యాధితో బాధపడే వ్యక్తి దగ్గడం, తుమ్మడం లేదా మాట్లాడినప్పుడు వెలువడే పెద్ద పెద్ద తుంపర్ల నుంచి మాత్రమే వేరొకరికి వ్యాప్తి చెందుతుందని ఇప్పటివరకు డబ్ల్యూహెచ్‌వో చెబుతూ వచ్చింది. కానీ, కరోనా వైరస్ గాలిలో కూడా ఉంటుందని, గాలి ద్వారా కూడా సంక్రమిస్తుందని శాస్త్రవేత్తలు మరో బాంబు పేల్చారు.

గాలి ద్వారా కరోనా సంక్రమణ, WHOకి 32 దేశాలకు చెందిన 239 శాస్త్రవేత్తల లేఖ:
గాలిలోని సూక్ష్మ వైరస్ రేణువుల(smaller particles) ద్వారా కూడా కరోనా వైరస్‌ సంక్రమిస్తుందని(infect) శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. దీనికి తమ దగ్గర ఆధారాలున్నాయని చెబుతూ వందలాది మంది శాస్త్రవేత్తల బృందం డబ్ల్యూహెచ్ఓకి బహిరంగ లేఖ రాసింది. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున సూచనలు, సిఫార్సులను సవరించాలని కోరుతూ శాస్త్రవేత్తలు లేఖ రాశారని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. గాలి ద్వారా కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందనేందుకు ఆధారాలున్నాయని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు డబ్ల్యూహెచ్‌ఓకు లేఖ రాశారు. ఈ అంశాన్ని వచ్చే వారం సైంటిఫిక్‌ జర్నల్‌లో పరిశోధకులు ప్రచురించనున్నారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తి దగ్గినా లేదా తుమ్మినా వెలువడే తుంపర్లలోని వైరస్ కణాల పరిమాణం తక్కువగా ఉన్నా, అవి గాలి ద్వారా వ్యాప్తి చెందుతూ ప్రజలకు ఈ వ్యాధి సంక్రమిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

ప్రజల్లో మరింత పెరిగిన భయాందోళనలు:
అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటోంది. ముఖ్యంగా గాలి ద్వారా వైరస్ సంక్రమిస్తుందనే విషయమై గత రెండు నెలలుగా అనేకసార్లు పరిగణించాం, కానీ దీనికి కచ్చితమైన లేదా స్పష్టమైన ఆధారాలు దొరకలేదని డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ విభాగం అధిపతి డాక్టర్ బెనీడెట్టా అలెగ్రాంజీ అన్నారు. ఇప్పటికే కరోనా వ్యాప్తికి సంబంధించి ప్రజల్లో అనేక సందేహాలు, అనుమానాలు, భయాలు ఉన్నాయి. కరోనా గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా లేదా అనేది వాటిలో ప్రధానమైన సందేహం. గాలి ద్వారా కరోనా వ్యాపించదని అనేకమంది నిపుణులు చెబుతున్నప్పటికీ, మెడ్‌ ఆర్‌ఎక్స్‌ఐవీ అనే సంస్థ వెల్లడించిన పరిశోధనలో ఇది సాధ్యమే అని తేలింది. ఇది అత్యంత అరుదుగా మాత్రమే జరిగే అవకాశం ఉందంది.

ఇకపై ఇండోర్ ప్రదేశాల్లోనూ మాస్కులు, భౌతిక దూరం మస్ట్:
బార్లు, రెస్టారెంట్లు, ఆఫీసులు, మార్కెట్లు, కేసినోలు(పేకాట క్లబ్ లు).. ఇలాంటి చోట్ల కరోనా బారిన పడే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అనేది నిజమే అయితే కనుక, మరింత జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లోనే కాదు వెంటిలేషన్ తక్కువగా ఉండే ఇండోర్ ప్రదేశాల్లోనూ మాస్కులు కచ్చితంగా ధరించాల్సిందే అంటున్నారు. అంతేకాదు భౌతిక దూరం కూడా కచ్చితంగా పాటించాల్సిందే అన్నారు. కరోనా రోగులకు చికిత్స, సేవలు అందించే వైద్యులు, సిబ్బంది ఎన్-95 మాస్కులు ధరించాలి. ఆ మాస్క్ అయితే ప్రతి చిన్న వైరస్ కణాన్ని ఫిల్టర్ చేయగలుగుతుంది. తద్వారా కరోనా సోకకుండా కాపాడుతుంది.

ఎన్ 95 మాస్కులు, అల్ట్రావైలట్ లైట్లు అవసరం:
గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అనేది నిజమే అయితే.. అప్పుడు స్కూళ్లు, నర్సింగ్ హోమ్స్, ఇళ్లు, వ్యాపార సముదాయాలు వంటి ప్రాంతాల్లో ఫ్రెష్ ఎయిర్ వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. లోపలి గాలి బటయకు వెళ్లేలా జాగ్రత్త పడాలి. అంతేకాదు శక్తివంతమైన ఫిల్లర్లు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇండోర్ ప్రదేశాల్లో గాలిలో ఉన్న చిన్న చిన్న తుంపర్లలో ఉండే వైరల్ పార్టికల్స్ ను చంపేలా అల్ట్రావైలట్ లైట్స్ ను ఏర్పాటు చేసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Must Read >>వరుసగా నాల్గవ రోజు 20వేలకు పైగా కరోనా కేసులు.. రాష్ట్రాలవారీగా లెక్కలు ఇవే!