ట్రంప్ దగ్గుతూనే ఉన్నాడు….అయినా ర్యాలీల్లో పాల్గొంటాడంట

  • Published By: venkaiahnaidu ,Published On : October 9, 2020 / 04:23 PM IST
ట్రంప్ దగ్గుతూనే ఉన్నాడు….అయినా ర్యాలీల్లో పాల్గొంటాడంట

coughing trump ready to hold rallies: క‌రోనా వైర‌స్ ను జయించిన అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ త్వ‌ర‌లోనే మ‌ళ్లీ ప్ర‌జాజీవితంలోకి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ట్రంప్‌ అన్నారు. శనివారం ఫ్లోరిడాలో క్యాంపెయిన్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ట్రంప్ తెలిపారు. అదేవిధంగా,ఆదివారం పెన్సిల్వేనియాలో మరో ర్యాలీలో పాల్గొనాలనుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు.


ప్రస్తుతం తన ఆరోగ్యం ‘చాలా బాగుంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తనకు అందించిన ఔషధాల్లో రీజెనరాన్‌ యాంటీబాడీ డ్రగ్‌ బాగా పనిచేసిందని ట్రంప్‌ అన్నారు. దాని వల్లే కోలుకున్నానని వ్యాఖ్యానించారు. స్వర్గం నుంచి వచ్చిన బహుమతిగా ఆయన దాన్ని అభివర్ణించారు.


కాగా, ట్రంప్‌ కు అందించాల్సిన కరోనా చికిత్స పూర్తయినట్లు వైట్ హౌస్ డాక్టర్‌ సియాన్‌ కాన్లే వెల్లడించారు. నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో గడిపిన అధ్యక్షుడు సోమవారం శ్వేతసౌధం చేరుకున్నారు. అప్పటి నుంచి ట్రంప్‌నకు అక్కడే చికిత్స కొనసాగించింది వైద్య బృందం. తాజాగా కరోనా చికిత్స పూర్తయినట్లు చెప్పిన డాక్టర్లు.. ఆయన ప్రజల ముందుకు రావడం సురక్షితమేనని స్పష్టం చేశారు. వారం రోజులుగా ట్రంప్​లో ఎటువంటి వ్యాధి లక్షణాలు లేవని వెల్లడించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.



వైట్ హౌస్ చేరుకున్న నాటి నుంచి ట్రంప్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ,ఆయనలో వ్యాధి లక్షణాలు కనిపించలేదని చికిత్సకు బాగా స్పందించారని వైట్ హౌస్ డాక్టర్ సియాన్‌‌ కాన్లే తెలిపారు. ఇచ్చిన మందుల వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా లేవని తెలిపారు. మరోవైపు,ట్రంప్ ఇంకా దగ్గుతో కొంచెం బాధపడుతున్నట్లు కొన్ని మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.