నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్

నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్

Donald-Trump

Donald Trump Nobel Prize : ఈసారి నోబెల్‌ శాంతి బహుమతి రేస్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉండడం ఆసక్తి రేపుతోంది. ఆయనతోపాటు మరికొంత మంది పోటీలో ఉన్నారు. దీంతో నోబెల్‌ ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ట్రంప్‌తోపాటు…. రష్యా అసమ్మతి నేత అలెక్సీ నవాల్నీ, పర్యావరణ మార్పులపై పోరాటం చేస్తున్న గ్రెటా థన్‌బర్గ్‌ కూడా ఈ బహుమతి కోసం నామినేట్‌ అయ్యారు.

అంతేకాదు..వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ డబ్ల్యూహెచ్‌వో, ప్రపంచం మొత్తానికి కరోనా వ్యాక్సిన్ అందజేయాలనే ఉద్దేశ్యంతో ఈ సంస్థ ప్రారంభించిన కోవ్యాక్స్ ప్రోగ్రామ్‌ కూడా నోబెల్ శాంతి బహుమతి నామినీల జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ అయిన వారిలో.. ఒక్క ట్రంప్‌ తప్ప.. మిగిలిన వాళ్లందరినీ నార్వేకు చెందిన చట్టసభల ప్రతినిధులు నామినేట్‌ చేశారు. నిజానికి నోబెల్‌ బహుతుల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా పార్లమెంట్ల సభ్యులు, సాధారణ ప్రజలు, మాజీ విజేతలు… అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉంటుంది.

ఈ నామినేషన్ల గడువు ఆదివారంతో ముగిసింది. అయితే నోబెల్‌ కమిటీ మాత్రం నామినీల పేర్లను అధికారికంగా బయటపెట్టలేదు. 50ఏళ్లుగా ఈ కమిటీ నామినీల పేర్లను, రేస్‌లో ఉండి అవార్డు రాని వాళ్ల పేర్లను బయటపెట్టడం లేదు. కానీ నామినేటర్లు మాత్రం తమ నామినీల పేర్లను వెల్లడించవచ్చు. నోబెల్‌ బహుమతులను ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రకటిస్తారు.