అమెజాన్‌ తెచ్చిన తంటా..ఆడపిల్లలకు ‘అలెక్సా’పేరు పెట్టటం మానేసారు

అమెజాన్‌ తెచ్చిన తంటా..ఆడపిల్లలకు ‘అలెక్సా’పేరు పెట్టటం మానేసారు

girls naming alexa come down america : ‘‘అలెక్సా..ప్లే మ్యూజిక్..అంటేచక్కటి సంగీతాన్ని వినిపిస్తుంది. కోరుకున్న పాటలు కావాలని చెబితే చాలు ఆ పాటల్ని వినిపిస్తుంది. ప్రముఖ సంస్థ అమెజాన్‌ తెచ్చిన ఒక పాపులర్‌ వర్చువల్‌ అసిస్టెంట్‌ లేదా డిజిటల్‌ పనిమనిషి ‘అలెక్సా’’. అలెక్సా ఎంత పాపులర్ అయిపోయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. చాలామంది జీవితాల్లో అలెక్సా భాగంగా మారిపోయింది. సాధారణంగా పలు కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చినప్పుడు వాటికి రకరకాల కొత్త పేర్లు పెడుతుంటాయి. వాటిలో చాలా వరకూ పాపులర్ అయిపోతుంటాయి. అలా అమెజాన్ ప్రవేశ పెట్టిన అలెక్సా కూడా చాలా పాపులర్ అయిపోయింది.

2014లో అమెజాన్‌ సంస్థ మార్కెట్లోకి తన వర్చువల్‌ అసిస్టెంట్‌ను తెచ్చినప్పుడు దానికి అప్పటికే అమెరికాలో ప్రాచుర్యంలో ఉన్న ఒక పేరును పెట్టింది..అదే‘ అలెక్సా’. పాపులర్‌ పేరు అని ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే..అమెరికాలో చాలామంది తమ ఆడపిల్లలకు ఎక్కువగా పెట్టే పేర్లలో అలెక్సా కూడా ఒకటి. కానీ ఇప్పుడు అమెజాన్ వర్చువల్‌ అసిస్టెంట్‌ ‘అలెక్సా’ పెద్ద తంటానే తెచ్చింది. అలెక్సా వర్చువల్‌ అసిస్టెంట్‌ పాపులర్ అయ్యాక అలెక్సా అనే పేరును ఆడపిల్లలకు పెట్టటం మానివేసిన పరిస్థితి నెలకొంది అమెరికాలో.

యూఎస్‌ సోషల్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకారం 2015లో అమెరికాలో పుట్టిన పిల్లల్లో 6,052 మందికి అలెక్సా అనే పేరు పెడితే.. 2019 సరికి అ పేరు పెట్టేవారి సంఖ్య 1995కి తగ్గిపోయిందట. 2015లో ఆడపిల్లలకు పెట్టే పాపులర్‌ పేర్లలో అలెక్సా 32వ స్థానంలో ఉండగా.. నాలుగేళ్లలో అది 139వ స్థానానికి పడిపోయింది.

దీనికి కారణమేంటంటే..తమ పిల్లలకు అలెక్సా అనే పేరు పెడితే.. జీవితాంతం ఆ పేరు ఒక డిజిటల్‌ పనిమనిషి పేరుతో ముడిపడి ఉన్నట్లే కదా అని యోచిస్తున్నారట చాలామంది..అందుకే అలెక్సా ప్రాచుర్యంలోకి వచ్చాక ఆడపిల్లలకు ‘అలెక్సా’అని పేరు పెట్టటం మానివేస్తున్నారట…!! చూశారా? అమెజాన్ ‘అలెక్సా’ ఎంత పనిచేసిందో..!! ఏకంగా ఆడపిల్లలకు పెట్టే పేర్లమీద పెద్ద ప్రభావాన్నే చూపిందన్నమాట..