Sudan : సూడాన్‌లో కటిక చీకట్లోనూ విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసిన భారత్ పైలట్లు

సూడాన్ లో చిక్కుకున్న మరో 121 మందిని వెనక్కి తీసుకురావటానికి వెళ్లిన భారత వైమానిక దళం పెద్ద సాహసమే చేశారు. అర్థరాత్రి చిమ్మచీకటి అలముకున్న రాత్రివేళ లైట్లు కూడా లేని రన్‌వేపై విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసి ప్రశంసలు అందుకున్నారు.

Sudan :  సూడాన్‌లో కటిక చీకట్లోనూ విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసిన భారత్ పైలట్లు

Sudan

Sudan : అంతర్యుద్ధంతో అట్టుడికిపోతున్న సూడాన్ లో పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్మీ, పారా మిలటరీ దళాల మధ్య పోరు రోజురోజుకు భీకరంగా మారుతున్న పరిస్థితుల్లో భారత్ తో సహా అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా దేశాలు తమ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకొస్తున్నాయి. దీంట్లో భాగంగా భారత్ ‘ఆపరేషన్ కావేరి’ద్వారా సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకొస్తోంది. ఇప్పటికే మొదటివిడతలో పలువురు భారత్ చేరుకున్నారు. ఈ క్రమంలో గురువారం (ఏప్రిల్ 28,2023)సూడాన్ కు చేరుకున్న భారత విమానం చిమ్మ చీకట్లో కూడా సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.భారత్ పైలట్లు చేసిన ఈ ధైర్యసాహసాలకు ప్రశంసలు అందుకున్నారు.

సూడాన్ లో చిక్కుకున్న మరో 121 మందిని వెనక్కి తీసుకురావటానికి వెళ్లిన భారత వైమానిక దళం పెద్ద సాహసమే చేశారు. అర్థరాత్రి చిమ్మచీకటి అలముకున్న రాత్రివేళ లైట్లు కూడా లేని రన్‌వేపై విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసి ప్రశంసలు అందుకున్నారు. సూడాన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం పోర్ట్ ఆఫ్ సూడాన్‌కు భారత ప్రభుత్వం నౌకను పంపింది. ఈ ప్రాంతం సూడాన్ లో అత్యంత హింసాకాండకు కేంద్రంగా ఉన్న ఖర్టూమ్ కు ఉత్తరాన 40కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే అక్కడికి చేరుకునే మార్గంలేని 121 మంది వాడి సయ్యిద్నాలో చిక్కుకుపోయారు. దీంతో వారి కోసం భారత వాయుసేనకు చెందిన సి-130జే హెర్య్కులస్ రవాణా విమానం వాడి సయ్యద్నా ఎయిర్ బేస్‌ కు చేరుకుంది.

అప్పటికే రాత్రి అయిపోయింది. దీంతో అక్కడ ల్యాండ్ కావడానికి వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదు. నేవిగేషన్ లేదు. కనీసం ల్యాండింగ్ లైట్లు కూడా లేవు. కానీ అక్కడి వరకు వెళ్లాక భారతీయులు తీసుకురాకుండా వెనక్కి వెళ్లటమేంటీ? వెనుకడుగు వేసే ప్రసక్తేలేదనుకున్న పైలట్లు పెద్ద సాహసమే చేశారు. నైట్ విజన్ గాగుల్స్‌ (NVGs)ను ఉపయోగించి విమానాన్ని సేఫ్ గా ఎయిర్‌స్ట్రిప్‌పై ల్యాండ్ చేశారు.

అంతకుముందు సిబ్బంది తమ ఎలక్ట్రో-ఆప్టికల్/ఇన్‌ఫ్రా-రెడ్ సెన్సార్లను ఉపయోగించి ఆ చిన్న రన్‌వేపై ఎలాంటి ఆటంకాలు లేవని నిర్ధారించుకున్న తరువాత సాహసం చేసి నైట్ విజన్ గాగుల్స్‌ సాయంతో విమానాన్ని చక్కగా ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయ్యాక ముందుజాగ్రత్త చర్యగా ఇంజిన్లను ఆఫ్ చేయకుండా రన్నింగ్‌లోనే ఉంచారు.

విమానం ల్యాండయ్యాక వాయుసేన ప్రత్యేక దళానికి చెందిన 8 మంది గరుడ కమాండోల రక్షణలో భారతీయులు విమానంలోకి ఎక్కారు. తరువాత ఎలా అయితే ల్యాండ్ చేశారో నైట్ విజన్ గాగుల్స్ సహాయంతోనే టేకాఫ్ తీసుకున్నారు. ఆ తరువాత అత్యంత జాగ్రత్తగా గాల్లోకి విమానాన్ని పోనిచ్చారు పైలట్లు. అలా భారత పైలట్లు చేసిన సాహసం ప్రశంసలు అందుకుంటోంది. తోటీ భారతీయుల్ని స్వదేశం తీసుకురావాలనే వారి తపనే వారితో సాహసం చేయించిందని ఇది భారతీయ పైలట్ల అంకితభావానికి నిదర్శమంటున్నారు. కాగా ఆపరేషన్ కావేరిలో భాగంగా ఇప్పటి వరకు 1,360 మందిని స్వదేశానికి సురక్షితంగా తరలించారు.