వామ్మో ధరలు : ఒక్క గుడ్డు రూ. 30, కిలో చక్కెర రూ. 104

వామ్మో ధరలు : ఒక్క గుడ్డు రూ. 30, కిలో చక్కెర రూ. 104

inflation wreaks havoc on pakistan rate : ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. అన్ని రకాల ఆహార పదార్థాల ధరలు భారీగా పెరుగుతుండడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఓ గుడ్డు ధర రూ. 30, కిలో చక్కర ఏకంగా రూ. 104 పలుకుతుండడంతో ధరలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేజీ గోధుమలు రూ. 60, అల్లం రూ. 1000 పలుకుతోంది. పాక్ దేశంలో ద్రవ్యోల్బణం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత ఏడాది డిసెంబర్ నుంచి పాక్‌లో పరిస్థితి మరింత దిగజారడం మొదలైందని నిపుణులు వెల్లడిస్తున్నారు. కొత్త పాకిస్తాన్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్ పాలన దారుణమైన పరిస్థితిలో ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కూరగాయాలు, పప్పు ధాన్యాలు, గుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. కొన్ని రోజుల క్రితం చక్కెర ధరలు తగ్గించామని ఇమ్రాన్ పేర్కొన్నారు. కానీ..ద్రవ్యోల్బణం అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. దేశంలో చాలా ప్రాంతాల్లో చలి అధికమౌతుండడంతో గుడ్లను కొంటున్నారని, డజన్ గుడ్ల ధర రూ. 350 (భారత్‌లో రూ. 160) ఉందని పాక్ ప్రముఖ న్యూస్ పేపర్ ది డాన్ కథనం పేర్కొంది. శరీరంలో వేడి పెంచుకోవడానికి గుడ్లు తింటున్నారని, దీంతో డిమాండ్ పెరిగిందని వెల్లడించింది. కానీ..ఉత్పత్తి ఆ స్థాయిలో లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేసింది. జనాభాలో 25 శాతం కంటే ఎక్కువ మంది దారిద్రరేఖకు దిగువన ఉన్నారు. గత సంవత్సరం డిసెంబర్‌లో పరిస్థితి మరింత దిగజారిందని, 40 కిలోల గోధుమలు రూ. 2000 ఉంటే..2020, అక్టోబర్‌లో 40 కిలోల గోధుమలు రూ. 2400కి చేరింది.