ఒకేరోజు స్టార్ క్రికెటర్ సహా ముగ్గురికి కరోనా, ఆందోళనలో అభిమానులు

కరోనా వైరస్ మహమ్మారి బంగ్లాదేశ్ క్రికెటర్లను వణికిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు.

  • Published By: naveen ,Published On : June 21, 2020 / 03:42 AM IST
ఒకేరోజు స్టార్ క్రికెటర్ సహా ముగ్గురికి కరోనా, ఆందోళనలో అభిమానులు

కరోనా వైరస్ మహమ్మారి బంగ్లాదేశ్ క్రికెటర్లను వణికిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు.

కరోనా వైరస్ మహమ్మారి బంగ్లాదేశ్ క్రికెటర్లను వణికిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఒకేరోజు ముగ్గురు క్రికెటర్లకు పాజిటివ్ నిర్ధారణ కావడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ముందుగా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్, సీనియర్ పేస్ బౌలర్ మష్రఫే మొర్తజా(36) కరోనా బారిన పడ్డాడు. కొన్నిరోజులుగా మొర్తజా అస్వస్థతతో బాధపడుతున్నాడు. అనుమానం వచ్చి కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకున్నాడు. రిపోర్టులో పాజిటివ్ అని రావడంతో తన నివాసంలోనే క్వారంటైన్ లో ఉంటున్నాడు. 

కోలుకోవాలని ప్రార్థనలు చేయండి:
తన సోదరుడు రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని, ఢాకాలోని తమ నివాసంలోనే ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాడని మొర్తజా తమ్ముడు మొర్సాలిన్ బిన్ మొర్తజా తెలిపాడు. శుక్రవారం(జూన్ 19,2020) కరోనా పరీక్షలు నిర్వహించగా శ‌నివారం(జూన్ 20,2020) పాజిటివ్ వచ్చిందన్నాడు. ”నేను కరోనా బారిన పడ్డాను. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయండి” అని మొర్తజా అభిమానులను కోరాడు. మొర్తజా బంగ్లా తరఫున 36 టెస్టులు, 220 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. కెప్టెన్ గా రాణించాడు. 2019లో కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. మొర్తజా పార్లమెంటు ఎంపీ(నరాలి) కూడా. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు తనవంతుగా సాయం చేస్తున్నాడు మొర్తజా. ప్రస్తుత సంక్షోభ సమయంలో తన నియోజకవర్గం నరాలీలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. కరోనా బారిన పడ్డ ప్రముఖ క్రికెటర్లలో మొర్తజా ఒకడు. ఇటీవలే పాకిస్తాన్ స్టార్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సైతం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

28ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నజ్ముల్ ఇస్లాంకు కోవిడ్:
మొర్తజాకు కరోనా సోకిందనే వార్త బంగ్లా క్రికెట్ అభిమానులను షాక్ కు గురి చేసింది. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే వారికి మరో షాకులు తగిలాయి. మరో ఇద్దరు బంగ్లా క్రికెటర్లు సైతం కరోనా బారిన పడ్డారు. క్రికెటర్ నజ్ముల్ ఇస్లాంకు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా తెలిపాడు. 28ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇస్లాం, తన స్వస్థలమైన నారాయణగంజ్ లో ఉంటున్నాడు. తాను ప్రాణాంతక వైరస్ బారిన పడ్డానని, ప్రస్తుతం తన ఇంట్లో ఉంటున్నట్లు తెలిపాడు. బంగ్లాదేశ్ లో కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో నారాయణగంజ్ ఒకటి. లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇస్లాం సాయం చేస్తున్నాడు. ఆహారం, ఇతర వస్తువులు పేదలకు పంచుతున్నాడు. ఈ క్రమంలో అతడు కరోనా బారిన పడటం అభిమానుల్లో ఆవేదన నింపింది.

నఫీస్ ఇక్బాల్ కు కూడా కరోనా:
బంగ్లా మాజీ క్రికెటర్ నఫీస్ ఇక్బాల్(34) సైతం కరోనా బారిన పడ్డాడు. బంగ్లా వన్డే జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ పెద్దన్నే నసీఫ్ ఇక్బాల్. ఈ విషయాన్ని స్వయంగా ఇక్బాల్ తెలిపాడు. ప్రస్తుతం చిట్టగాంగ్ లోని తన ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపాడు. రైట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ అయిన నఫీస్ ఇక్బాల్ 2003లో ఎంట్రీ ఇచ్చాడు. అయితే 2006లోనే అతడి క్రికెట్ కెరీర్ ముగిసింది. బంగ్లా జట్టు తరఫున 11 టెస్టులు(518 పరుగులు), 16 వన్డేలు(309 పరుగులు) ఆడాడు. మే నెలలో బంగ్లాదేశ్ డెవలప్ మెంట్ కోచ్, మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అష్కిర్ రెహ్మాన్ కూడా కరోనా బారిన పడ్డాడు. బంగ్లాదేశ్ లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య లక్ష దాటింది. 1400 మందికి పైగా కరోనాతో మరణించారు.

Read: స్పిన్నర్ రషీద్‌ను ఓదార్చిన సచిన్ టెండుల్కర్