మాస్కులు తప్పనిసరి చేస్తే, కరోనా మరణాలు 40శాతం వరకు తగ్గించొచ్చు

10TV Telugu News

మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తే కరోనా మరణాలను తగ్గించొచ్చని, 40శాతం వరకు మరణాలు తగ్గిపోతాయని అధ్యయనంలో తేలింది. అమెరికాలో ఇటీవల ఓ అధ్యయనం చేశారు. మాస్కులు మేండటరీ చేయక ముందు, చేశాక పరిస్థితుల్లో మార్పులను గమనించారు. అమెరికాలో బహిరంగ ప్రదేశాల్లో పని చేసే వారికి మాస్కులు ధరించడం తప్పని సరి చేస్తూ ప్రభుత్వాలు ఏప్రిల్ 1న ఆదేశాలు ఇచ్చాయి. ఇది బాగానే పని చేసింది. అమెరికాలో కరోనా మరణాల శాతం తగ్గింది. జూన్ 1 నాటికి 40శాతం వరకు మరణాలు తగ్గిపోయినట్టు స్టడీలో గుర్తించారు. మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ ఇచ్చిన ఆదేశాలు చాలా ప్రభావవంతమైన పాలసీగా అధ్యయనకర్తలు అభివర్ణించారు. మరణాలు తగ్గించడంలో కీలకంగా మారిందన్నారు.అలాగే స్టే అట్ హోమ్ ఆదేశాలు కూడా బాగానే ప్రభావం చూపాయి. కొత్త కరోనా కేసుల సంఖ్య తగ్గింది. ఒక వేళ ఈ ఆదేశాలు కానీ ఇవ్వకపోయి ఉంటే, అమెరికాలో 80శాతం అధిక కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యి ఉండేవని నిపుణులు అభిప్రాయపడ్డారు. మెజార్టీ రాష్ట్రాల్లో స్టే ఎట్ హోమ్ ఆదేశాలు జారీ చేశారు.ఎంఐటీకి చెందిన బృందం ఈ రీసెర్చ్ చేసింది. మాస్క్ తప్పనిసరి చేస్తూ రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలు సత్ఫలితాలు ఇచ్చాయని గుర్తించారు. మాస్కులు ధరించడం మస్ట్ అనే ఆదేశాలు ఇవ్వడానికి ముందు, ఇచ్చిన తర్వాత.. ఎన్ని కరోనా కేసులు, మరణాలు నమోదయ్యాయి అనే దానిపై స్టడీ చేయగా, విస్తుపోయే విషయం వెలుగు చూసింది. మాస్క్ మస్ట్ ఆదేశాల తర్వాతే పరిస్థితిలో మార్పు వచ్చిందని, కొత్త కొవిడ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గిందని అధ్యయనకర్తలు గుర్తించారు.మాస్క్ మస్ట్ చేయడంతో పాటు ప్రజలు గుమిగూడి ఉండటంపైనా ఆంక్షలు విధించారు. ప్రజల కదలికలను నియంత్రించారు. ఈ చర్యలు కూడా కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో ఉపయోగపడ్డాయి. అదే సమయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు గణనీయంగా పెంచడం కూడా మేలు చేసింది. మొత్తంగా అన్ని ఆదేశాల్లో ముఖ్యమైనది మాస్క్ తప్పనిసరి చేయడమే. దాని వల్ల కరోనా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. మాస్కులు మస్ట్ చేయడం కారణంగా 40శాతం, స్టే ఎట్ హోమ్ ఆదేశాల ద్వారా 80శాతం వరకు మరణాల సంఖ్య తగ్గినట్టు చెప్పారు.కాగా, జూన్ 1 నుంచి అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో కొత్త పాలసీలు తీసుకొచ్చారు. దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆంక్షల్లో సడలింపు ఇచ్చారు. మొత్తంగా దీనిపై ఇంకా స్టడీ జరుగుతోందని, త్వరలోనే మరిన్ని విషయాలను వెలుగులోకి తెస్తామని అధ్యయనకర్తలు తెలిపారు. ఎంఐటీ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ సెంటర్ ప్రొఫెసర్ విక్టర్ నేతృత్వంలో ఈ అధ్యయనం జరుగుతోంది. కొవిడ్ ఎకనామిక్స్ పేపర్ సిరీస్ లో భాగంగా MedRxiv ప్రీపింట్ సర్వర్ లో ఈ అధ్యయనం పబ్లిష్ చేశారు.