NATO Refuse : యుక్రెయిన్‌ ఎయిర్‌స్పేస్‌ను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న జెలెన్‌స్కీ.. నో చెప్పిన నాటో

అసలు నో ఫ్లై జోన్ గురించి ఎందుకింత చర్చ జరుగుతోంది? జెలెన్‌స్కీ పదే పదే విజ్ఞప్తి చేసినా... డిమాండ్ చేసినా.. నో ఫ్లైజోన్‌కు నాటో ఎందుకు నో చెబుతోంది.

NATO Refuse : యుక్రెయిన్‌ ఎయిర్‌స్పేస్‌ను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలన్న జెలెన్‌స్కీ.. నో చెప్పిన నాటో

Airspace

Ukrainian airspace : యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలు పెట్టి 11 రోజులు గడుస్తుంటే.. గత రెండు మూడు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న మాట ఒక్కటే… అదే నో ఫ్లై జోన్..! అమెరికా నుంచి యూరోపియన్ యూనియన్ వరకు.. యుక్రెయిన్ అధ్యక్షుడు ఎవరితో మాట్లాడినా.. ఎవరికి కాల్ చేసినా… నో ఫ్లై జోన్ గురించే మాట్లాడుతున్నారు..! కేవలం మాట్లాడటమే కాదు.. నో ఫ్లైజోన్ కోసం ఆయన డిమాండ్ కూడా చేస్తున్నారు. అసలు నో ఫ్లై జోన్ గురించి ఎందుకింత చర్చ జరుగుతోంది? జెలెన్‌స్కీ పదే పదే విజ్ఞప్తి చేసినా… డిమాండ్ చేసినా.. నో ఫ్లైజోన్‌కు నాటో ఎందుకు నో చెబుతోంది.

జెలెన్‌స్కీ విజ్ఞప్తిని నాటో అంగీకరిస్తే దాని వెనుక తీవ్రంగా కసరత్తు చేయాల్సి ఉంటుంది. యుక్రెయిన్‌ సరిహద్దుల్లో వందల సంఖ్యలో ఫైటర్ జెట్లను మోహరించాలి ఉంటుంది. యుక్రెయిన్‌ గగనతంలో నిరంతరం నిఘా ఉంచడానికి అవాక్స్‌ విమానాలను మోహరించాలి. అంతేగాకుండా అత్యాధునిక రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆకాశంలోనే ఫైటర్‌ జెట్లకు ఇంధనం నింపే వ్యవస్థ.. విమానాల నిర్వహణకు వసతులు.. వేల సంఖ్యలో సిబ్బందిని ఏర్పాటు చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా నాటో జెట్లకు ఇబ్బందులు లేకుండా ముందుజాగ్రత్తగా రష్యా ఎయిర్‌ డిఫెన్స్‌ను నాశనం చేయాల్సి ఉంటుంది.

Russian Attack : రష్యా దాడితో పారిపోయిన యుక్రెయిన్‌ సైనికులు

మరి నాటోకు అంత సీన్‌ ఉందా అంటే ముమ్మాటికి ఉందనే చెప్పాలి. అమెరికా, బ్రిటన్‌, యూరప్‌ దేశాల ఎయిర్‌ఫోర్స్‌ వద్ద రష్యా కంటే మెరుగైన యుద్ధ విమానాలు ఉన్నాయి. ఫిఫ్త్‌ జనరేషన్ ఫైటర్‌ జెట్లు అమెరికా వద్ద కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.. ఒక్కసారి యుద్ధంలోకి దిగితే ప్రత్యర్థికి చుక్కలు చూపించే ఎఫ్‌ -22 రాప్టార్లు అమెరికా సొంతం. అయినా కానీ నాటో నో చెబుతుంది.
నో ఫ్లై జోన్‌పై నాటో నో అనడానికి అనేక కారణాలున్నాయి. నిజానికి జెలెన్‌స్కీ చేసిన విజ్ఞప్తి అమలు చేయడం అంటే.. నేరుగా యుద్ధంలోకి దిగడమే. యుక్రెయిన్‌ గగన తలాన్ని నో ఫ్లైయింగ్ జోన్‌గా నాటో ప్రకటిస్తే.. అటు వైపు వచ్చిన ఏ యుద్ధ విమానాన్నైనా కూల్చేసే బాధ్యతను నాటో చేపట్టినట్టే అవుతుంది.

ప్రస్తుతం యుక్రెయిన్‌ ఎయిర్ స్పేస్‌లో వీర విహారం చేస్తున్నాయి రష్యా యుద్ధవిమానాలు. ఈ సమయంలో నాటో యుక్రెయిన్‌ ఎయిర్‌స్పేస్‌ను నో ఫ్లైజోన్‌గా ప్రకటిస్తే రష్యా యుద్ధ విమానాలను.. నాటో బలగాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే.. నేరుగా రష్యాతో తలపడాల్సి ఉంటుంది. అది ముమ్మాటికి కోరి కొరివితో తలగొక్కున్నట్టే అంటోంది అమెరికా. పైగా యుద్ధం తొలిరోజే పుతిన్.. అగ్రరాజ్యాలకు వార్నింగ్ ఇచ్చారు. యుక్రెయిన్ విషయంలో తలదూర్చితే చరిత్రలో ఎప్పుడూ చవిచూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అందుకే.. రష్యాతో నేరుగా తలపడడానికి నాటో దేశాలు సిద్ధంగా లేవు.

Ukraine Indian Help : యుద్ధం ఆగడానికి భారత్ సాయం కోరిన యుక్రెయిన్.. పుతిన్‌తో మాట్లాడాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి

అంతేగాకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇప్పటికే పూర్తిస్థాయి హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు న్యూక్లియర్‌ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించారు. దీంతో ఇప్పటికే వ్యూహాత్మక ప్రాంతాల్లో రష్యా అటాక్‌ న్యూక్లియర్‌ సబ్‌ మెరైన్లు.. ఖండాతర క్షిపణులను ప్రయోగించే మొబైల్‌ లాంచర్లు చేరుకున్నాయి. ఇలాంటి సమయంలో నాటో ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా.. తీవ్రమైన పర్యవసనాలు ఎదుర్కోంటాయని పుతిన్‌ చెప్పకనే చెపుతున్నారు. దీంతో నాటో దేశాల పరిస్థితి ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి అన్నట్టుగా తయారైంది. ఓ అడుగు ముందుకేసి సొంత దేశాల మీదకు తెచ్చుకునే కంటే మౌనంగా ఉండి యుక్రెయిన్‌కు చేతనైనంత సాయం చేయాలని డిసైడయ్యారు.