Netflix’s Private Jet: : అటెండెర్ ఉద్యోగానికి రూ. 3 కోట్ల జీతం..! సంచలనంగా మారిన భారీ ప్యాకేజ్..!!
అటెండెంట్ ఉద్యోగానికి 3 కోట్ల రూపాయల జీతం ఇస్తామంటూ ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్.

Netflix’s Private Jet: ఏడాదికి కోటి రూపాయల జీతం అంటే అదో పెద్ద సంచలనం. బాగా చదువుకుని విశేష ప్రతిభ చూపేవారికే కోటి ఆఫర్ వస్తుంటుంది. సాఫ్ట్‌వేర్ రంగంలో టాప్ మోస్ట్ ప్యాకేజ్‌లో పనిచేసేవారికి కోటి కామన్ ఫిగర్. కానీ ఫ్లైట్ అటెండెంట్ ఉద్యోగానికే మూడు కోట్ల జీతం ఆఫర్ చేసి పెను సంచలనానికి తెరతీసింది నెట్‌ఫ్లిక్స్.
ఆన్‌లైన్ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తన ప్రైవేట్ జెట్ ఫ్లయిట్‌లో అటెండెంట్ ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఏడాదికి 3 లక్షల 85 వేల డాలర్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు 3 కోట్ల రూపాయల జీతం ఇస్తామంటూ ప్రకటించడం జాబ్ మార్కెట్‌ను షేక్ చేసింది. సాధారణ ఉద్యోగానికి భారీ ప్యాకేజ్ ప్రకటించడం చర్చనీయాంశమైంది.
స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగల నేర్పు, విచక్షణ, ప్రయాణికులకు సేవలో అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థుల కోసం వెతుకుతున్నట్లు తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది నెట్‌ఫ్లిక్స్. అమెరికాలోని శాన్‌జోస్ కేంద్రంగా పనిచేయాల్సివుంటుందని చెప్పిన నెట్‌ఫ్లిక్స్ ఉద్యోగానికి పెట్టిన కండీషన్స్ కూడా సాధారణంగానే ఉన్నాయి. మిగతా కంపెనీలు కోరినట్లే.. విదేశీ ప్రయాణానికి సిద్ధంగా ఉండాలని.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పనిచేయటానికి సిద్ధంగా ఉండాలని కామన్ పాయింట్లనే నోటిఫికేషన్‌లో పేర్కొంది నెట్‌ఫ్లిక్స్.
ఫ్లైట్ అటెండెంట్ పోస్టుకు మూడు కోట్ల రూపాయల జీతం ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఆ పోస్టుకు ఎవ్వరూ అంత పెద్ద మొత్తంలో జీతం ఇచ్చిన దాఖలాలు లేవు. ఫ్లైట్ అటెండెంట్ అంటే విమానయాన రంగంలో సాధారణ ఉద్యోగమే.. ఆ ఉద్యోగానికి అంత ఎక్కువ మొత్తం జీతం ఆఫర్ చేయటం వెనుక నెట్‌ఫ్లిక్స్ ఆంతర్యమేమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.ఏడాదికి మూడు కోట్లంటే నెలకు పాతిక లక్షలు. మన దేశంలో ఏ ఉద్యోగికి కూడా ఇంత మొత్తంలో నెల జీతం లేదంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.