ఒబెసిటీతో బాధపడే వారికి గుడ్ న్యూస్, అద్భుతమైన మెడిసిన్ వచ్చేసింది

ఒబెసిటీతో బాధపడే వారికి గుడ్ న్యూస్, అద్భుతమైన మెడిసిన్ వచ్చేసింది

Obesity Appetite drug semaglutide: ఒబెసిటీ(ఊబకాయం). ప్రపంచంలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువుతో అనారోగ్యం బారిన పడుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. బరువు తగ్గేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అయినా వెయిట్ అదుపులోకి రావడం లేదు. దీంతో ఊబకాయులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇలాంటి వారికి ఓ గుడ్ న్యూస్ వినిపించారు లండన్ శాస్త్రవేత్తలు. ఊబకాయంతో బాధపడే వారి ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మెడిసిన్ ను వారు గుర్తించారు. దాన్ని పేరు సెమాగ్లుటైడ్‌ (semaglutide).

ఎలా పని చేస్తుందంటే:
సెమాగ్లుటైడ్‌ అనే ఈ ఔషధం.. మెదడులో ఆకలికి సంబంధించిన వ్యవస్థను హైజాక్‌ చేస్తుంది. తద్వారా ఆకలి తగ్గి, శరీరంలో చాలా పరిమితంగా కేలరీలు వచ్చి చేరుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణంగా ఆహారం తిన్న తర్వాత GLP1 అనే హార్మోన్ విడుదల అవుతుంది. బరువు పెరగడానికే అదే కారణం. ఆ హార్మోన్ ను సెమాగ్లుటైడ్ అదుపు చేస్తుంది.

ఊబకాయం ఉన్నవారి ఆరోగ్యాన్ని కాపాడే ఈ కీలక ఔషధాన్ని శాస్త్రవేత్తలు ప్రయోగాల ద్వారా గుర్తించారు. భారీ స్థాయి అంతర్జాతీయ ప్రయోగాల్లో దీని సామర్థ్యం రుజువైంది. కొవిడ్‌-19 వంటి వ్యాధుల ప్రభావాన్ని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. యూనివర్సిటీ కాలేజీ లండన్‌ (యూసీఎల్‌) శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలను నిర్వహించారు. ఇందులో 16 దేశాలకు చెందిన దాదాపు 2వేల మంది పాల్గొన్నారు.

ప్రయోగాల్లో భాగంగా ఈ కొత్త మెడిసిన్ తీసుకున్న వారిలో మూడో వంతు మంది తమ శరీరంలో దాదాపు ఐదో వంతు బరువును తగ్గించుకోగలిగారు. మూడొంతుల మందిలో 10 శాతం మేర బరువు తగ్గిందని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ రాచెల్ బాటర్హామ్ చెప్పారు. ఈ స్థాయిలో బరువును తగ్గించే సామర్థ్యం ఏ ఔషధానికీ లేదన్నారు. ఇది చాలా విప్లవాత్మకమైందని చెప్పారు. ప్రయోగంలో పాల్గొన్నవారికి సరాసరిన 15నెలల వ్యవధిలో 15.3 కిలోల మేర బరువు తగ్గిందని తెలిపారు. దీనివల్ల వారికి గుండె జబ్బు, మధుమేహానికి సంబంధించిన ముప్పు అంశాలైన రక్తంలోని కొవ్వు, బ్లడ్‌ షుగర్, రక్త పోటు వంటివి తగ్గాయని వివరించారు.

ప్రయోగంలో పాల్గొన్న వారు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే ఈ మెడిసిన్ అద్భుతం అంటున్నారు. కెంట్ కి చెందిన జాన్ ఏకంగా 28 కిలోల బరువు తగ్గారు. ఈ డ్రగ్ నా జీవితాన్నే మార్చేసిందని జాన్ అంటున్నారు. అంతేకాదు ఆహారం తీసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేసిందని సంతోషంగా చెప్పారు. న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసన్ లో శాస్త్రవేత్తలు తమ అధ్యయనాన్ని పబ్లిష్ చేశారు. యావరేజ్ గా 15 కిలోల వరకు బరువు తగ్గారు. 32శాతం మంది తమ బాడీ వెయిట్ లో ఐదో వంతు బరువు తగ్గారని అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు.

అధిక బరువుని, అధిక బరువు కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో ఈ మెడిసిన్ ఓ గేమ్ చేంజర్ అవుతుందని ప్రొఫెసర్ రాచెల్ చెప్పారు. గత 20ఏళ్లుగా ఒబెసిటీ పై రీసెర్చ్ చేస్తున్నా. బ్యారియాట్రిక్ సర్జరీ మినహా ఇప్పటివరకు ఒబెసిటీని నయం చేసే ప్రభావవంతమైన ట్రీట్ మెంట్ ని కనుక్కోలేకపోయాము. బరువు తగ్గడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, తీవ్రమైన కోవిడ్ -19 ప్రమాదం తగ్గుతుందని ఆమె అన్నారు.

కాగా, సెమాగ్లుటైడ్.. డ్రగ్స్ రెగ్యులేటర్లకు సమర్పించబడుతోంది కాబట్టి మామూలుగా సూచించబడదు. తొలుత ఈ మెడిసిన్ స్పెషలిస్ట్ వెయిట్ లాస్ క్లినిక్‌ల ద్వారా ఉపయోగించబడుతుందని, ఆ తర్వాతే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా..మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని, ఆ తర్వాతే సెమాగ్లుటైడ్ గురించి ఓ స్పష్టత వస్తుందని సైంటిస్టులు చెప్పారు.