Imran Khan Arrest: ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై స్పందించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తరువాత బుధవారం రాత్రి ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్, అతని మద్దతుదారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ క్షమించరాని నేరం చేశాడని అన్నారు.

Imran Khan Arrest: ఇమ్రాన్ ఖాన్ అరెస్టుపై స్పందించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్..

Pak PM Shehbaz Sharif

Imran Khan Arrest: పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాకిస్థాన్‌లో పరిస్థితి నిప్పుల కుంపటిలా తయారైంది. దేశంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే, ఇమ్రాన్ అరెస్టు తరువాత బుధవారం రాత్రి ప్రధాని షెహబాజ్ షరీఫ్ జాతినుద్దేశించి ప్రసంగించారు. పాకిస్థాన్ 75ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. రోగులను అంబులెన్స్‌లో నుంచి బయటకులాగి ఆందోళనకారులు దానికి నిప్పంటించారు.  75ఏళ్ల చరిత్రలో అసలైన శ్రతువు చేయలేని పనిని ఇమ్రాన్ మద్దతు దారులు చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనల్లో హింసాత్మక చర్యలకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, దేశ శత్రువులను, ఉగ్రవాదులను హెచ్చరిస్తున్నానని షెహబాజ్ షరీఫ్ అన్నారు.

అల్ – ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ కు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు ఉన్నాయని షెహబాజ్ అన్నారు. సాక్ష్యాధారాల ఆధారంగానే నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) విచారణ జరుపుతోందని చెప్పారు. దాదాపు ఐదువేల కోట్లు దాచబడ్డాయి. ఇంత డబ్బు చిక్కినప్పుడు చర్యలు తీసుకోకపోతే ఎలా అని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశ్నించారు. ఇమ్రాన్ ఖాన్ చట్టాన్ని దెబ్బతీశారు. ఇది క్షమించరాని నేరమని అన్నారు. పాకిస్థాన్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. కోర్టును, చట్టాన్ని ఎదుర్కొనేందుకు మేం ఎప్పుడూ నిరాకరించలేదని ప్రధాని అన్నారు.

ఇమ్రాన్ అరెస్టు ఎందుకంటే?

అల్ ఖాదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి 5వేల కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో మంగళవారం ఇమ్రాన్‌ను పారామిలిటరీ రేంజర్లు అరెస్టు చేశారు. ఇమ్రాన్ అరెస్టును హైకోర్టు సమర్ధించింది. అయితే, బుధవారం అతన్ని అవినీతి నిరోధక కోర్టులో హాజరుపర్చగా.. ఎనిమిది రోజులు ఎన్ఏబీ కస్టడీకి అప్పగించింది. ఇమ్రాన్ అరెస్టుకు వ్యతిరేకంగా పీటీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది.

ప్రధాని నివాసంపై దాడి..

ఇమ్రాన్ అరెస్టుతో పాక్‌ అట్టుడికిపోతోంది. ఆయన మద్దతుదారులు, అభిమానులు పాక్ షట్‌డౌన్‌కు పిలుపునిచ్చారు.  పీటీఐ పార్టీకి చెందిన 500 మందిపైగా కార్యకర్తలు ప్రధాని మోడల్ టౌన్ లాహోర్ నివాసానికి చేరుకొని అక్కడ పార్క్ చేసిన వాహనాలను తగులబెట్టారు. ఈ దాడి సమయంలో ప్రధాని ఇంటి వద్ద కేవలం గార్డులు మాత్రమే ఉన్నారని పోలీసు అధికారి తెలిపారు. అక్కడున్న పోలీసు పోస్టుకుకూడా ఇమ్రాన్ మద్దతుదారులు నిప్పు పెట్టారు.