Zelensky Christmas message : ‘స్వేచ్ఛ కోసం చాలా కష్టపడాలి’ యుక్రెయిన్ ప్రజలకు జెలన్‍స్కీ క్రిస్మస్ సందేశం

Zelensky Christmas message : ‘స్వేచ్ఛ కోసం చాలా కష్టపడాలి’ యుక్రెయిన్ ప్రజలకు జెలన్‍స్కీ క్రిస్మస్ సందేశం

‘స్వేచ్ఛ కోసం చాలా కష్టపడాలి’ యుక్రెయిన్ ప్రజలకు జోలన్‍స్కీ క్రిస్మస్ సందేశం

Zelensky Christmas message :  10 నెలలుగా యుక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగిస్తునే ఉంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ఏమాత్రం తగ్గటంలేదు. ఆత్మవిశ్వాసం కోల్పోవటంలేదు. తన దేశ ప్రజలకు సందేశాలు ఇస్తూ ధైర్యంగా ఉండాలని చెబుతునే ఉన్నారు. ‘‘స్వేచ్ఛ కోసం చాలా వెచ్చించాల్సి ఉంటుంది.. కానీ బానిసత్వం అంతకన్నా ఎక్కువే తీసుకుంటుంది..యుక్రెయిన్ యుద్ధం 10 నెలలు అయిన సందర్భంలో..జెలన్‌స్కీ ఆ దేశ ప్రజలకు ఇచ్చిన ‘క్రిస్మస్ సందేశం’ ఇచ్చిన కొన్ని మాటలివి. ఇప్పటిదాకా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నామని…ఈ శీతాకాలాన్ని కూడా అలానే భరిస్తామని జెలన్‌స్కీ చెప్పారు. పరోక్షంగా పోరాటం కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఓ పక్క యుక్రెయిన్ శిథిలమైపోతున్నా ప్రజలు ప్రాణాలు దక్కించుకోవటానికి దేశం వదిలిపోతున్నా జోలన్ స్కీ మాత్రం ఆత్మవిశ్వాసాన్ని వదలటంలేదు.

అత్యంత శక్తివంతమైన రష్యాతో పోరాడతున్న జెలన్‌స్కీ పోరాట స్ఫూర్తి గొప్పదే. యుద్ధం మొదలుకాగానే పాశ్చాత్యదేశాలకు పారిపోకుండా…రణరంగంలో నిలబడి పోరాడడం అంటే మాటలు కాదు. అది నేతలవల్లా కాదు. కానీ జెలన్‌స్కీ అటువంటి నేతే. పోరాటానికి ఎదురొడ్డి నిలబడటమే కాదు ఆత్మవిశ్వాసంతో తన ప్రజలకు ఈనాటి అదే స్థాయిలో సందేశాలను ఇస్తున్నారు. అటువంటి జెలెన్ స్కీ నిజంగా చరిత్రకెక్కే నాయకుడని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. కానీ 10 నెలల యుద్ధంతో, అంతులేని పోరాటంతో యుక్రెయిన్ ఏం పొందగలిగిందనేదానికి మాత్రం సరైన సమాధానం లభించదు.

ఓ రకంగా ఇప్పుడు యుక్రెయిన్ శిథిలావస్థలో ఉంది. ఆ దేశ పునర్‌నిర్మాణానికి 60 నుంచి 70 లక్షల కోట్లు కావాలన్న అంచనాలు వెలువడుతున్నాయంటే…యుక్రెయిన్ ఏ స్థాయిలో దెబ్బతిందో….పునాది నుంచి ఆ దేశాన్ని ఎలా పునర్‌నిర్మించాలో అర్ధం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఇంకా యుద్ధం కొనసాగించడమంటే..ప్రజల్ని మరిన్ని కష్టాల్లోకి నెట్టడమే. అయినా సరే…జెలన్‌స్కీ యుద్ధం కొనసాగింపునే కోరుకుంటున్నారు. ప్రపంచంపై పెను ప్రభావం చూపుతున్న యుద్ధాన్ని ముగించాలన్న ఆలోచన రష్యా చేస్తున్నా..యుక్రెయిన్ అందుకు సిద్ధంగా లేదు. పుతిన్ స్వయంగా యుద్ధ విరమణ ప్రకటన చేసిన తర్వాత కూడా…జెలన్‌స్కీ పోరాటం కొనసాగిస్తామని చెప్పడమే దీనికి నిదర్శనం.

Russia-Ukraine war: ఘర్షణలు సృష్టించి లబ్ధిపొందాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి: పుతిన్
నిజానికి ఎవరు..ఎవరిపై..ఏ ఉద్దేశంతో చేసినా..యుద్ధంతో సాధించేదేమీఉండదు. అసలు యుద్ధమనేదే చెడ్డమాట. అందులో మంచి అనేదానికి తావులేదు. రణరంగంలో పోయిన ప్రాణాలకు విలువ కట్టేది ఎవరు..? రోడ్డున పడ్డ అమరవీరుల కుటుంబాలకు బాధ్యత ఎవరిది..? ఇది పరిహారం చెల్లించలేని ప్రశ్న. యుద్ధం మిగిల్చిన విషాదాన్ని జీవితమంతా అనుభవించాల్సిందే. యుక్రెయిన్ ప్రజలదీ ఇదే పరిస్థితి. 10 నెలల క్రితం వరకూ ప్రపంచ పర్యాటకానికి చిరునామాగా ఉన్న యుక్రెయిన్…ఇప్పుడు ప్రత్యక్ష నరకానికి ఉదాహరణగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా శిథిలాలే.. విధ్వంసం…విధ్వంసం..విధ్వంసం. ఎటు చూసినా కూలిన భవనాలు, తగలబడిపోయిన నివాసాలు. కనుచూపుమేరలో ఉన్నవన్నీ శిథిలాలే. కీవ్ కావొచ్చు…ఖర్కైవ్ కావొచ్చు. మరియపోల్ కావొచ్చు..పేర్లలో మాత్రమే నగరాలకు తేడా. వినాశనంలో ఒకటే రూపు. అంతటా విషాదం. కరెంటు లేకపోతే…క్షణం గడవని….గడ్డకట్టే ఉష్ణోగ్రతల్లో రోజులు, వారాలు తరబడి అంధకారంలో మొగ్గుతున్నారు యుక్రెయిన్ ప్రజలు. రష్యా మిస్సైల్, డ్రోన్ల దాడులతో యుక్రెయిన్‌లో పెను విధ్వంసం జరుగుతోంది. యుక్రెయిన్ నగరాలు, చారిత్రక భవనాలే కాదు…దేశంలో మౌలిక సదుపాయాలన్నీ ధ్వంసమయ్యాయి. కరెంటు, నీళ్లు, డ్రైనేజ్ ఇలా అన్ని వ్యవస్థలూ సర్వనాశనమయ్యాయి. పారిశ్రామిక ప్రాంతాలన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. భౌతిక నష్టం కన్నా…ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టం లెక్కకు అందనిది.

యుద్ధం పది నెలలుగా సాగుతోంది. జెలన్‌స్కీ తాజా ప్రకటనతో ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో..ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటిదాకా జరిగిన నష్టమే..అంచనాలకు అందడం లేదు. ముందు ముందు ఇంకెంత విధ్వంసం జరుగుతుందో చెప్పలేం. ఇప్పటికిప్పుడు యుద్ధం ముగిసినా….ఆ నెత్తుటి గాయాల నుంచి కోలుకోవడం ఇప్పట్లో యుక్రెయిన్‌కు సాధ్యం కాదు. యుక్రెయిన్‌ పునర్ నిర్మాణం అసలు జరుగుతుందా…? పూర్వవైభవం సాధిస్తుందా అంటే చెప్పలేమనే సమాధానమే వస్తుంది.యుక్రెయిన్ పునర్ నిర్మాణానికి నెలకు 9వేల నుంచి 10వేల కోట్లు కావాలి. అన్ని నిధులు ఎక్కడి నుంచి వస్తాయి..??

రోడ్లు మొదలుకుని,ఫుట్‌పాత్‌లు,ప్రభుత్వ భవనాల దాకా అన్నీ తిరిగి నిర్మించాల్సిందే. కరెంటు వంటి మౌలిక సదుపాయాలకు లక్షల కోట్లు వెచ్చించాల్సి ఉంది. యుక్రెయిన్ ఇప్పుడు అన్నివిధాలా చితికిపోయి ఉంది. దాదాపు నాలుగున్న కోట్లు ఉండే యుక్రెయిన్ జనాభాలో 80లక్షలమంది వలసవెళ్లిపోయారు. మిగిలిన వాళ్లు అన్నివిధాలా నష్టపోయారు. ఆత్మస్థైర్యం కోల్పోయారు. పాశ్చాత్యదేశాలు అందిస్తున్న ఆయుధ,ఆర్థికసాయంతో యుక్రెయిన్‌ యుద్ధమైతే చేయగలుగుతోంది కానీ….పునర్‌నిర్మాణం ప్రారంభించలేకపోతోంది. మనో స్థైర్యం ప్రదర్శించలేకపోతోంది. యుద్ధం ముగిసి రష్యా వెనుతిరిగినా యుక్రెయిన్ కోలుకోలేకపోవడానికి కారణం…ప్రజల దీనస్థితి. చాలామంది ఉద్యోగాలే కాదు..నిలువనీడ కోల్పోయారు. వ్యాపారాలు నడవడం లేదు. పర్యాటకరంగంలో ఉపాధి లేదు. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు ఊహించని రీతిలో పడిపోయాయి. ఇలాంటి స్థితిలో యుక్రేనియన్లు పన్నులెలా కడతారు…ప్రభుత్వం నిధులు ఎలా సమకూర్చుకుంటుంది. అందుకే…యుద్ధంలో గెలిచినా..ఓడినా….యుక్రేనియన్లకు మిగిలేది బూడిద కుప్పలే.

Russia-Ukraine war : యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగిస్తామంటున్న పుతిన్..! షరతులు వర్తిస్తాయంటున్న యుక్రెయిన్..!!

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌ కోసం చేపట్టినట్టుగా యుక్రెయిన్ మిత్రదేశాలు…భారీగా నిధులు కేటాయించాలి. వేల కోట్ల నుంచి, లక్షలకోట్లకు సాయాన్ని పెంచుకుంటూ పోవాలి. యుక్రెయిన్‌కు అన్నివిధాలా అండగా ఉంటున్న అమెరికా, పాశ్చాత్యదేశాలు ఇందుకు బాధ్యత తీసుకోవాలి. అయితే..అమెరికాతో పాటు అనేక యూరప్ దేశాల ఆర్థిక స్థితి గందరగోళంగా ఉంది. అమెరికా అయితే ఆర్థిక సంక్షోభం అంచున నిల్చుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో లక్షల కోట్ల సాయం యుక్రెయిన్‌కు అగ్రరాజ్యం చేస్తుందా లేదా అనేదానిపై సందేహాలున్నాయి. యుక్రెయిన్ సాయం పేరుతో భారీగా అవినీతి జరిగే ప్రమాదముందనీ ఇప్పటికే రిపబ్లికన్లు విమర్శలు మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల్లో యుద్ధం ముగిసి పునర్‌నిర్మాణం మొదలుపెడితేనే….యుక్రెయిన్ ఎప్పుడు కోలుకుంటుందో చెప్పగలం. వచ్చే 20ఏళ్లు యుక్రెయిన్‌కు అత్యంత గడ్డుకాలంగానే భావించాలి.

అటు రష్యాకూ యుద్ధం తీవ్ర నష్టం మిగిల్చింది. యుక్రెయిన్‌కు అయితే ఆయుధ, ఆర్థికసాయం అందుతోంది కానీ రష్యా సొంతంగానే పోరాడుతోంది. ఊహించినదానికన్నా ఎక్కువరోజులు యుద్ధం జరగడంతో…రష్యా ఆర్థికవ్యవస్థపైనా భారం పడింది. ఈ కారణమో లేక…యుద్ధం లేకుండా యుక్రెయిన్‌ను నియంత్రించగలమన్న నమ్మకం కుదిరిందో కానీ పుతిన్ హఠాత్తుగా యుద్ధం ముగింపు గురించి మాట్లాడారు. డాన్‌బాస్ పూర్తిస్థాయి ఆక్రమణ లక్ష్యాన్ని చేరుకుని యుద్ధాన్ని మగిస్తామని తెలిపారు. .పోరాటాన్ని వీలయినంత తొందరగా ముగించాలన్నదే తమ లక్ష్యమని పుతిన్ స్వయంగా ప్రకటించారు. వీలయినంత వేగంగా, మెరుగ్గా… యుద్ధం మొత్తాన్ని ముగించాలని తాము కోరుకుంటున్నామని పుతిన్ తెలిపారు.

2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై స్పెషల్ మిలటరీ ఆపరేషన్ చేపడుతున్నట్టు రష్యా ప్రకటించింది. అంతకు రెండు రోజుల ముందు తూర్పు యుక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల స్వతంత్రను గుర్తిస్తున్నట్టు ప్రకటించింది. మూడు నెలల క్రితం డాన్‌బాస్‌లోని డొంటెస్క్, లుహెన్స్క్‌లను రష్యా ఆక్రమించుకుని..తమ దేశంలో కలిపేసుకుంది. డాన్‌బాస్‌లోని మిగిలిన ప్రాంతంపై ఇప్పుడు దృష్టిపెట్టింది. డొంటెస్క్‌ ప్రాంతంలోని బఖ్‌మట్‌ నగరంలో ఇప్పుడు యుద్ధం తీవ్రస్థాయిలో సాగుతోంది. రష్యా నుంచి యుక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకున్న ఖర్కైవ్‌లోనూ దాడులు తీవ్రమయ్యాయి. పుతిన్ వ్యాఖ్యల తర్వాత 2023 ఫిబ్రవరి చివరివారం కంటే ముందే యుద్ధం ముగుస్తుందన్న అభిప్రాయం కలిగింది. కానీ అమెరికాలో పర్యటించి వచ్చిన జెలన్‌స్కీ వ్యాఖ్యలు గమనిస్తే మాత్రం..యుక్రెయిన్ పూర్తిగా ధ్వంసమయినా సరే…యుద్ధాన్ని విరమించడానికి ఆయన సిద్ధంగా లేరన్న భావన కలుగుతుంది. పునర్‌నిర్మాణానికి కాకుండా యుద్ధానికే పాశ్చాత్యదేశాల సాయం తీసుకుంటున్నారు జెలన్‌స్కీ. అమెరికా, యూరప్ ఆదేశాలను తుచతప్పకుండా పాటిస్తున్నారు. ఇది యుక్రెయిన్‌ను మరింతగా నష్టపరిచి..యుక్రేనియన్లకు నిలువనీడ లేకుండా చేస్తుందన్న ఆలోచన జెలన్‌స్కీ కలగడం లేదు. అదేదో తెలుగు సినిమాలో చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో జెలన్‌స్కీ తెలుసుకోలేకపోతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తన ఇగో కోసమో లేదా రష్యాను ఓడించాడనే పేరు కోసమో గానీ జెలెన్ స్కీ సొంత ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజలే లేకుండా పోయాక ఇక దేశం ఎక్కడిది?అనే చిన్న విషయాన్ని జెలెన్ స్కీ మర్చిపోయారా? అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఈ యుద్ధనాకి చరమగీతం పాడేది ఎప్పుడో..ఇంకా కొనసాగే ఈ యుద్ధంలో ‘గెలుపు’అనే మాటకు అర్థం ఉంటుందా?…ప్రాణాలు పోయాక ఇక ఎవరిమీద గెలిచినట్లు? ఎందుకు గెలిచినట్లు? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ ప్రశ్నలకు బదులేది? అంటే మల్లీ ప్రశ్నే తలెత్తుతుంది…???