Donald Trump : అమెరికన్లకు ఆయుధం తప్పనిసరి..గన్ కంట్రోల్ కు కఠిన చట్టాలు అవసరం లేదు

అమెరికాలో గన్ కల్చర్ పై మాజీ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు ఆయుధం తప్పనిసరి అని గన్ కంట్రోల్ కు కఠిన చట్టాలు అవసరం లేదు అని అన్నారు.

Donald Trump : అమెరికన్లకు ఆయుధం తప్పనిసరి..గన్ కంట్రోల్ కు కఠిన చట్టాలు అవసరం లేదు

Donald Trump Key Comments On Gun Culture

Donald Trump Key Comments on Gun Culture : టెక్సాస్ స్కూళ్లో పారిన చిన్నారుల నెత్తుటేరులు చూసి ప్రపంచమంతా నివ్వెరపోయింది. తుపాకి సంస్కృతికి దూరం జరగకపోతే..పెను ముప్పు తప్పదని ప్రపంచమంతా హెచ్చరిస్తోంది. ఇప్పటికైనా ముందు జాగ్రత్తతో వ్యవహరించి ఇష్టానుసారం ఆయుధాల అమ్మకంపై నిషేధం విధించాలని సూచిస్తోంది. కానీ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఏమంటున్నారో తెలుసా..? దేశ ప్రజల చేతుల్లో ఇప్పుడున్న ఆయుధాలు సరిపోవట. మరిన్ని ఆయుధాలు అందించాలట. అమెరికన్లకు ఆయుధం తప్పనిసరి అని పేర్కొన్న ట్రంప్..గన్ కంట్రోల్ కు కఠిన చట్టాలు అవసరం లేదని అన్నారు. యుక్రెయిన్ యుద్ధంలో కల్పించుకోవడం మానేసి దేశ భద్రతపై దృష్టిపెట్టాలంటూ బైడన్‌కు ఉచిత సలహాలిచ్చారు ట్రంప్.

అమెరికాల్ గన్ కల్చర్ ఎంత ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తోందో వరుస ఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. ఈ తుపాకి సంస్కృతికి హత్యలు, ఆత్మహత్యల రూపంలో రోజుకు 53 మంది బలైపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. 50 ఏళ్ల క్రితమే దేశ ప్రజల భద్రతకు తుపాకి పెనుముప్పుగా మారిందని గుర్తించినప్పటికీ ఆ సంస్కృతిని అంతంచేయడంలో అక్కడి ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతూనే ఉన్నాయి. అధికారంలో డెమోక్రట్లున్నా, రిపబ్లికన్లున్నా..ప్రభుత్వంపై ఆయుధాల లాబీదే పై చేయి అవుతోంది. తుపాకి స్టేటస్ సింబల్‌, భద్రతా చిహ్నం అన్న భావన అమెరికన్ల నరనరానా జీర్ణించుకోపోయేలా చేసిన ఆయుధాల లాబీ..ఏళ్లు గడిచే కొద్దీ అమ్మకాలు పెంచుకుంటూ పోతోంది.

దీంతో జాతీయ రైఫిల్ అసోసియేషన్ చెప్పినట్టాల్లా ప్రభుత్వాలు ఆడాల్సి వస్తోంది. టెక్సాస్‌లో చిందిన చిన్నారుల రక్తం సాక్షిగా గన్‌ కల్చర్‌కు తిలోదకాలు వదులుదామని బైడన్ ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ హూస్టన్‌లో జాతీయ రైఫిలో అసోసియేషన్ వార్షికోత్సవానికి హాజరైన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం కొత్త వాదన తెరపైకి తెచ్చారు. కాల్పుల ఘటనలు చూసి నిరాయుధీకరణ కావాలని భావించకూడదని, మరిన్ని ఆయుధాలతో భద్రత పెంచుకోవాలని ప్రభుత్వానికి, ప్రజలకు ఓ ఉచిత సలహా ఇచ్చారు ట్రంప్.

ట్రంప్ ప్రసంగమంతా తుపాకి సంస్కృతికి మద్దతిస్తూనే సాగింది. యుక్రెయిన్ యుద్ధంలో కల్పించుకుంటూ ఆ దేశానికి అమెరికా చేస్తున్న భారీ సాయాన్నీ ట్రంప్ ప్రశ్నించారు. స్కూళ్లకు భద్రత కల్పించడంలో విఫలమైన బైడన్ ప్రభుత్వం 400 కోట్ల డాలర్ల యుద్ధ సాయం యుక్రెయిన్‌కు ఎలా చేస్తుందని ట్రంప్ నిలదీశారు. యుక్రెయిన్‌కు చేసే సాయాన్ని పిల్లల భద్రత పెంచేందుకు కేటాయించవచ్చు కాదా అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాక్, ఆఫ్ఘానిస్తాన్‌లో లక్షల కోట్లు ఖర్చుపెట్టామని, కానీ సాధించింది ఏమీ లేదని ట్రంప్ విమర్శించారు. ప్రపంచ సంక్షమం గురించి ఆలోచించే ముందు దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరారు. దేశంలో పిల్లల రక్షణ కోసం పటిష్టమైన భద్రత ఉండే స్కూళ్లు నిర్మించాలన్నారు. హింసకు పాల్పడే వారిని నిందించకుండా రక్తపాతానికి నేషనల్ రైఫిల్ అసోసియేషన్‌పై ఆరోపణలు చేయడం తగదన్నారు.