లీటర్ రూ.140: పాల కంటే పెట్రోలే చీప్

లీటర్ రూ.140: పాల కంటే పెట్రోలే చీప్

పండగలొస్తే ట్రాన్స్‌పోర్ట్ చార్జీలు పెరగడం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేక రోజుల్లో ధరలు పెరగడం కొత్తేమీ కాదు. పాకిస్తాన్‌లో ఇలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. లీటర్ పాల ధర రూ.140గా అమ్మడంతో తప్పని పరిస్థితుల్లో కొనుక్కొని పండుగజరపుకున్నారు. మొహర్రం పండుగ సందర్భంగా పాక్‌లోని ప్రధాన నగరాలైన కరాచీ, సింధ్ ప్రాంతాల్లో పాలు, జ్యూస్, కూలింగ్ వాటర్ పాయింట్లు పెరిగిపోయాయి. 

పండగ రోజున కీర్, షర్భత్ వంటివి తయారుచేసుకునేందుకు పాలు తప్పనిసరి. ఈ క్రమంలో డిమాండ్‌ను అవకాశంగా వాడుకున్న డీలర్లు రేట్లను భారీగా పెంచేశారు. 9, 10 తేదీలలో వ్యాపారులు తమకు నచ్చిన ధరలకు పాలను విక్రయించారట. అయితే ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రూ.94గా నిర్దేశించగా డీలర్లు షాపులకు రూ.110గా విక్రయిస్తే అది కాస్తా వినియోగదారుడి వద్దకు వెళ్లేసరికి రూ.140గా మారింది.  

ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 113(పాకిస్తాన్ రూపాయిలలో)గా ఉంటే, డీజిల్ ధర లీటరుకు రూ. 91గా మాత్రమే ఉండటం గమనార్హం. ఈ పాల కొరత కారణంగా ఎన్ని చర్చలు జరిగినా ధర పెంపుపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో పండుగకు దొరికిన కాస్ట్లీ పాలతోనే సంబరాలు చేసుకున్నారు.