Kinzhal Hypersonic Missiles : యుక్రెయిన్‌పై రష్యా కొత్త అస్త్రం.. హైపర్ సోనిక్ మిస్సైళ్ల ప్రయోగం

ఇటీవలే అభివృద్ధి చేసిన 'కింజాల్' హైపర్ సోనిక్ క్షిపణులను తొలిసారిగా యుక్రెయిన్ పై ఉపయోగించింది రష్యా.(Kinzhal Hypersonic Missiles)

Kinzhal Hypersonic Missiles : యుక్రెయిన్‌పై రష్యా కొత్త అస్త్రం.. హైపర్ సోనిక్ మిస్సైళ్ల ప్రయోగం

Hypersonic Missiles

Kinzhal Hypersonic Missiles : యుక్రెయిన్ పై ముప్పేట దాడులు ప్రారంభించిన రష్యా.. తాజాగా మరో కీలక అస్త్రాన్ని ప్రయోగించింది. ఇటీవలే అభివృద్ధి చేసిన ‘కింజాల్’ హైపర్ సోనిక్ క్షిపణులను పశ్చిమ యుక్రెయిన్ లోని ఓ ఆయుధాగారాన్ని ధ్వంసం చేసేందుకు తొలిసారిగా ఉపయోగించింది. యుద్ధ రంగంలో రష్యా ‘కింజాల్’ హైపర్ సోనిక్ క్షిపణులను గతంలో ఎన్నడూ, ఎక్కడా ప్రయోగించ లేదు. ఈ మేరకు రష్యా అధికారిక మీడియా సంస్థ ‘ఆర్ఐఏ నొవోస్తి’ తెలిపింది.

ఇవనో-ఫ్రాంకివ్ స్క్ ప్రాంతంలోని డెలియాటిన్ గ్రామంలో ఓ ఆయుధాగారంలో యుక్రెయిన్ క్షిపణులను, గగనతల ఆయుధ వ్యవస్థల పేలుడు పదార్థాలను దాచి ఉందన్న సమాచారంతో రష్యా తాజా దాడులు చేపట్టింది. ఈ దాడుల్లోనే ‘కింజాల్’ హైపర్ సోనిక్ ఏరో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.

‘కింజాల్’ అంటే రష్యన్ భాషలో ‘చురకత్తి’ అని అర్థం. దీన్ని గగనతలం నుంచి భూతల లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు. వీటిని రష్యా తన మిగ్-31కే, టీయూ-22ఎం3, సుఖోయ్-57 యుద్ధ విమానాలకు అమర్చింది.

Russia-Ukraine War : యుద్ధం ఆపాలంటూ పుతిన్‌కు హాలీవుడ్ టెర్మినేటర్ స్టార్ విజ్ఞప్తి!

‘హైపర్‌సోనిక్ ఏరోబాలిస్టిక్ క్షిపణులతో కూడిన కింజాల్ ఏవియేషన్ క్షిపణి వ్యవస్థ.. ఇవనో- ఫ్రాంకివ్ స్క్ ప్రాంతంలోని డెలియాటిన్‌లో ఉక్రెయిన్‌ క్షిపణులు, విమానయాన మందుగుండు సామగ్రిని కలిగున్న పెద్ద భూగర్భ గిడ్డంగిని ధ్వంసం చేసింది’ అని రష్యా రక్షణ శాఖ తెలిపింది. యుక్రెయిన్‌పై దాడుల్లో కింజాల్ హైపర్‌సోనిక్ ఆయుధాలను రష్యా ఉపయోగించడం ఇదే మొదటిసారని స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. మరోవైపు.. తీరప్రాంత క్షిపణి వ్యవస్థను ఉపయోగించి ఒడెస్సా సమీపంలోని ఉక్రెయిన్‌ సైనిక రేడియో వ్యవస్థ, నిఘా కేంద్రాలను నాశనం చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్‌లో భారీగా పౌర మరణాలు నమోదవుతున్నాయి. పెద్దలతోపాటు చిన్నారులూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఉక్రెయిన్‌లో 112 మంది పిల్లలు మృతి చెందినట్లు స్థానిక ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయం తాజాగా వెల్లడించింది. మరో 140 మంది గాయపడినట్లు తెలిపింది.

కాగా.. రష్యా తన యుద్ధ వ్యూహాన్ని మార్చుకుందని.. దీంతో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని బ్రిటన్‌ రక్షణశాఖ తన తాజా ఇంటెలిజెన్స్‌ రిపోర్టులో హెచ్చరించింది. క్రెమ్లిన్ ఇప్పటివరకు తన అసలు లక్ష్యాలను సాధించడంలో విఫలమైందని ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘ఫలితంగా రష్యా తన యుద్ధ కార్యాచరణను మార్చుకోవాల్సి వచ్చింది. నిరంతర దాడులతో ప్రత్యర్థిని బలహీనపరిచే అట్రిషన్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. దీంతో ప్రాణనష్టం భారీగా పెరుగుతుంది. ఉక్రెయిన్‌ మౌలిక సదుపాయాలు నాశనం అవుతాయి. ఈ పరిణామాలు మానవతా సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తాయి’ అని తెలిపింది.

David Cameron: యుక్రెయిన్ల కోసం స్వయంగా ట్రక్ నడుపుకుంటూ వెళ్లిన యూకే మాజీ ప్రధాని

రష్యా దాడుల మొదలు యుక్రెయిన్‌ నుంచి 33 లక్షలకుపైగా ప్రజలు పొరుగు దేశాలకు తరలివెళ్లారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 65 లక్షల మంది నిరాశ్రయులైనట్లు యూఎన్‌హెచ్‌సీఆర్‌ అంచనా వేసింది.(Kinzhal Hypersonic Missiles)

రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. గత 24 రోజులుగా యుక్రెయిన్ పై రష్యా సేనల దాడులు కొనసాగుతున్నాయి. రష్యా బలగాలు.. బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. రష్యా దాడుల్లో ఇప్పటివరకు వందల సంఖ్యలో యుక్రెయిన్‌కు చెందిన సైనికులు చనిపోయారు. ఈ దాడుల్లో వందలాది మంది అమాయక పౌరులు, చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

ఇదిలా ఉంటే, యుక్రెయిన్ సైనికులు కూడా ధీటుగానే పోరాటం సాగిస్తున్నారు. దీంతో ఈ యుద్ధంలో రష్యాకు భారీగానే నష్టం జరుగుతోంది. ఇప్పటివరకు రష్యాకు ఎంత నష్టం కలిగించింది యుక్రెయిన్ డిఫెన్స్ తెలిపింది. ఇప్పటివరకు 14వేల 400 మంది రష్యా సైనికులు హతమైనట్లు యుక్రెయిన్ సైన్యం శనివారం ప్రకటించింది. దీంతోపాటు 466 ట్యాంకులు, 1470 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 95 విమానాలు, 115 హెలికాప్టర్లు, 17 యూఏవీలను నేలకూల్చినట్లు వెల్లడించింది. వీటికి అదనంగా మూడు నౌకలు, 44 విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను నాశనం చేసినట్లు చెప్పింది. సైనిక చర్య పేరుతో రష్యా చేస్తున్న యుద్ధంలో ఆ దేశ సైనిక ద‌ళానికి భారీగానే న‌ష్టం జ‌రుగుతోంది. ఎంతోమంది సైనికులు చనిపోయారు. ఎన్నో యుద్ధ వాహ‌నాలు ధ్వంసం అయ్యాయి. యుక్రెయిన్‌పై ర‌ష్యా దాడి ప్రారంభించి నేటితో 24 రోజులైంది. ఇంకా అనేక న‌గ‌రాల‌పై ర‌ష్యా సేన‌లు దాడుల‌తో హోరెత్తిస్తున్నాయి.