అమెరికాలో స్కూలుకు ముంబై మహిళ పేరు

అమెరికాలో స్కూలుకు ముంబై మహిళ పేరు

School In Texas To Be Named After Indian American

School in Texas to be named after Indian-American : అమెరికాలో భారతీయ సంతతికి చెందిన ఓ మహిళకు అరుదైన గౌరవం దక్కింది. టెక్సాస్ లోని ఓ స్కూలుకు ముంబై నుంచి వెళ్లి అమెరికాలోని భారత సంతతికి చెందిన మహిళ పేరు పెట్టనున్నారు. టెక్సాస్ లోని త్వరలో ఏర్పాటు చేయనున్న ప్రాథమిక పాఠశాల 53కు భారతీయ అమెరికన్ ఫిజియో థెరపిస్ట్, సామాజిక కార్యకర్త అయిన సోనాల్ భూచర్ పేరు పెట్టాలని ‘‘ద ఫోర్ట్ బెండ్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్’’ ( ఎఫ్‌బిఐఎస్‌డి) బోర్డ్ ఏక గ్రీవంగా తీర్మానించింది. రివర్స్టోన్ కమ్యూనిటీలో జనవరి 2023లో ఈ స్కూల్ ను ప్రారంభించినున్నారు.

కాగా..సోనాల్ భూచర్ ముంబైకు చెందిన బొంబాయి యూనివర్శిటీలో ఫిజియో థెరపీలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం 1984లో భర్త సుభోథ్ భూచర్ తో కలిసి అమెరికాలోని హ్యూస్టన్ కు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. సామాజిక కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్న సోనాల్ విద్యార్ధుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు.

ఆమెసేవలకు గుర్తుగా టెక్సాస్ లో ఏర్పాటు చేయనున్న స్కూలుకు సోనాల్ భూచర్ పేరు పెట్టాలని ఎఫ్‌బిఐఎస్‌డి నిర్ణయించింది. క్యాన్సర్ సంబంధిత సమస్యలతో బాధపడుతూ సోనాల్ తన 58వ ఏళ్ల వయస్సులో 2019లో ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆమె భౌతికంగా ఈ లోకంలో లేకపోయినా ఆమె చేసిన సేవలు మాత్రం గుర్తింపు పొందాయి. దీంట్లో భాగంగానే.. ఈ గౌరవాన్ని పొందారు.

సోనాల్ భూచర్ FBISD బోర్డులో పనిచేశారు. ఆ సమయంలో సోనాల్ స్టూడెంట్ లీడర్‌షిప్ ప్రోగ్రాం, లెజిస్లేటివ్ అడ్వకేసీ ప్రోగ్రామ్, ఫోర్ట్ బెండ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వార్షిక అంతర్జాతీయ ఉత్సవం, వాచ్-ఒక జీవనశైలి విద్య కార్యక్రమం, స్కాలర్‌షిప్ అవకాశాలతో సహా పలు కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. సమాజానికి ప్రతీ ఒక్కరూ సేవ చేయాలని ఆమెఎప్పుడూ చెబుతుండేవారని బోర్డు సభ్యులు గుర్తుచేసుకున్నారు.

ప్రస్తుతం ఈ ట్రస్టీలో సభ్యులుగా ఉన్న జిమ్ రైస్ మాట్లాడుతూ..రెండేళ్లపాటు నేను ఆమెతో కలిసి పనిచేశాననీ..ఆమె ఇచ్చిన స్పూర్తితో ఎన్నో నేర్చుకున్నానని ఇపుడు ఈ బోర్డులో సభ్యుడినయ్యానని తెలిపారు. ఆమె నాకు గురువు..ఆమెతో కలిసి పనిచేసే సమయంలో ఎన్నో నేర్చుకున్నానని తెలిపారు.