Srilanka Emergency : శ్రీలంకలో ముదురుతోన్న సంక్షోభం.. అధ్యక్షుడి ఆఫర్ తిరస్కరించిన ప్రతిపక్షాలు..!

Srilanka Emergency : శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ ఉన్నప్పటికీ.. నిరసన ప్రదర్శనలు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Srilanka Emergency : శ్రీలంకలో ముదురుతోన్న సంక్షోభం.. అధ్యక్షుడి ఆఫర్ తిరస్కరించిన ప్రతిపక్షాలు..!

Srilanka Emergency Sri Lanka Opposition Rejects Proposed Unity Government

Srilanka Emergency : శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ ఉన్నప్పటికీ.. నిరసన ప్రదర్శనలు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితి
ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు నిరసనకారులు. ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం అధ్యక్ష ఎన్నికల్లో అత్యధిక మెజార్టీని సొంతం చేసుకున్న గొటబాయ ప్రభుత్వం ఆర్థిక విధానాలే ఈ దుస్థితి రావడానికి కారణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదిరేకొద్దీ కీలక అధికారులు, మంత్రులు పదవుల నుంచి వైదొలగుతున్నారు.

తాజాగా శ్రీలంక కేంద్ర బ్యాంక్‌ గవర్నర్‌ అజిత్‌ నివార్డ్‌ కూడా తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు కేబినెట్ మొత్తం రాజీనామా చేయడంతో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీలంక ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించింది. కేబినెట్‌లో చేరి పదవులు చేపట్టాలని అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రతిపక్ష పార్టీలకు ఆఫరిచ్చారు. దేశ ప్రజల ప్రయోజనాల కోసం, భావి తరాల అభ్యున్నతి కోసం ప్రభుత్వంతో కలిసేందుకు ముందుకు రావాలని, కేబినెట్‌లో చేరి మంత్రి పదవులు స్వీకరించాలని కోరారు. అయితే ఆయన ప్రతిపాదనను విపక్షాలు తిరస్కరించాయి.

దేశంలో తలెత్తిన ఈ జాతీయ సంక్షోభానికి పరిష్కారాలను కనుగొనేందుకు మంత్రిత్వ శాఖలను భర్తీచేసేందుకు పార్లమెంటులో అన్ని రాజకీయ పార్టీలను కలిసి రావాలని గొటబాయ రాజపక్స ఆహ్వానించారు. కానీ, అతిపెద్ద ప్రతిపక్ష రాజకీయ పార్టీ, యునైటెడ్ పీపుల్స్ ఫోర్స్ లేదా SJB, ఐక్య ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే తిరస్కరించింది. ఈ దేశ ప్రజలు గోటబయ రాజపక్స కుటుంబ రాజకీయ వారసత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఈ సమయంలో మేము ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వెళ్లలేము. అవినీతిపరులతో కలిసి పనిచేయలేమని SJB ఉన్నతాధికారి రంజ్త్ మద్దుమ బనాదర స్పష్టంచేశారు. 225 మంది సభ్యుల పార్లమెంటులో SJBకి 54 మంది శాసనసభ్యులు ఉన్నారు. అధ్యక్షుడు రాజపక్స అభ్యర్థనను ప్రతిపక్షాలు సైతం తిరస్కరించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.

మరోవైపు.. రాజీనామా చేసిన వారిలో ప్రధాని కుమారుడు, క్రీడా మంత్రి నమల్ రాజపక్సేతో పాటు మరో ఇద్దరు సోదరులు, ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సే, నీటిపారుదల శాఖ మంత్రి చమల్ రాజపక్సే ఉన్నారు. ఆర్థిక అవకతవకల ఆరోపణలతో సెంట్రల్ బ్యాంక్ ఉన్నతాధికారి సోమవారం రాజీనామా చేయాల్సి వచ్చింది. అధికార కూటమిలోని దాదాపు 150 మంది సభ్యులలో 14 మందిని కలిగిన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ మంగళవారం నుంచి స్వతంత్రంగా వ్యవహరించనుంది. ఇదిలా ఉండగా, దేశంలో అనేక నెలలుగా శ్రీలంక వాసులు ఇంధనం, వంటగ్యాస్, ఆహారపదార్థాలు, ఔషధాలను కొనుగోలు చేయడానికి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నిత్యావసర వస్తువులన్నీ ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇంధన కొరత కారణంగా రోజుకు కొన్ని గంటలపాటు విద్యుత్ కోతలను విధిస్తున్నారు.
 
Read Also : Srilanka Crisis: మా దేశాన్ని ఆదుకోండి మహాప్రభో: ప్రధాని మోదీకి శ్రీలంక ప్రతిపక్ష నేత అభ్యర్థన