Srinivasa Kalyanam : అమెరికాలో వైభవంగా ప్రారంభమైన శ్రీనివాస కళ్యాణాలు

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే   ఏరియాలో టీటీడీ ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీతో కలిసి ఆదివారం తెల్లవారుజామున ( భారత కాలమానం ప్రకారం) శ్రీనివాస కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.

Srinivasa Kalyanam : అమెరికాలో వైభవంగా ప్రారంభమైన శ్రీనివాస కళ్యాణాలు

Srinivasa Klayanam

Srinivasa Kalyanam :  అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే   ఏరియాలో టీటీడీ ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీతో కలిసి ఆదివారం తెల్లవారుజామున ( భారత కాలమానం ప్రకారం) శ్రీనివాస కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. స్వామివారి కళ్యాణోత్సవ క్రతువు ఇలా సాగింది.

పుణ్యాహవాచనం:  కల్యాణోత్సవం ప్రారంభానికి ముందు అన్ని వస్తువులను, ప్రాంగణాలను శుభ్రపరచడానికి నిర్వహించే పవిత్ర కర్మ.

విశ్వక్సేన ఆరాధన: విశ్వక్సేనుడు శ్రీ వేంకటేశ్వర స్వామి సర్వసైన్యాధిపతి. స్వామివారి కళ్యాణోత్సవం, ఇతర ఉత్సవాలు, ఊరేగింపు ముందు ఏర్పాట్లు ఆయన పర్యవేక్షిస్తారు.

శుద్ధి: కలశంలోని శుద్ధి చేసిన నీటిని హోమకుండం, మంటపంలోని అన్ని వస్తువులపై చల్లుతారు.

అంకురార్పణ: అంకురార్పణ ఏదైనా పుణ్య కార్యానికి ముందు నిర్వహించే వైదిక క్రతువు. ఈ క్రతువులో అష్ట దిక్పాలకులను ఆవాహన చేసి పూజించారు.

ప్రతిష్టా బంధన: కల్యాణం లో ఇది మరొక ప్రధాన భాగం. అర్చకులు పవిత్రమైన కంకణాలను (పవిత్ర దారాలు) స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల చేతులకు కడతారు.

అగ్ని ప్రతిష్ట: పవిత్రమైన అగ్నిని వెలిగించి ప్రాయశ్చిత్త హోమం నిర్వహించారు.

వస్త్ర సమర్పణ: అగ్నిప్రతిష్ఠానంతరం దేవతలకు కొత్త పట్టువస్త్రాలను సమర్పించారు.

Srinivasa Kalyanam

Srinivasa Kalyanam

మహా సంకల్పం: తాళ్లపాక వంశస్థులు (గత 600 సంవత్సరాల నుండి వేంకటేశ్వరుని సేవలో తమ జీవితాలను అంకితం చేసిన కుటుంబం) అమ్మవారి తరపున కన్యాదానం చేసే ఆచారం ఇది. ఇందుకోసం మహా సంకల్పం జరిగింది.

కన్యాదానం: కళ్యాణంలో, కన్యాదానానికి ప్రముఖ స్థానం ఉంది. ఇక్కడ భగవంతుడు మరియు అతని భార్యల గోత్ర ప్రవరాలను పూజారులు పఠించారు.

మహోత్సవం: వేంకటేశ్వరుడు తన ప్రియమైన భార్యలకు పవిత్ర మంగళ సూత్రాలను కట్టిన మాంగల్య ధారణతో దైవిక వివాహ వేడుక ఘనంగా ముగిసింది.

వారణమాయిరం: ఇది సాధారణంగా దక్షిణ భారత హిందూ వివాహాల సమయంలో నిర్వహించబడే ప్రముఖమైన, వినోదాత్మకమైన క్రతువు. ఇందులో స్వామివారు అతని దేవేరులు ఒకరికొకరుఎదురుగా పూల బంతులు మరియు కొబ్బరికాయలతో ఆడుకున్నారు. (ఇక్కడ దేవతల తరపున పూజారులు మరియు తాళ్లపాక వంశస్థులు ఈ ఆచారాన్ని నిర్వహించారు). అనంతరం దేవతామూర్తులకు పూలమాలలు మార్చుకున్నారు.

హారతి: శ్రీదేవి కుడి వైపున, భూదేవి ఎడమ వైపున కూర్చున్నారు. చివరగా కర్పూర హారతి, నక్షత్ర హారతి, మహా హారతి తో కళ్యాణోత్సవం ముగిసింది.

శ్రీవారు అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తిపరవశంతో పులకించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ప్రవాసాంధ్రుల సమితి చైర్మన్ శ్రీ మేడపాటి వెంకట్, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస రెడ్డి, అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి శ్రీ రత్నాకర్, నాటా అధ్యక్షుడు శ్రీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.