Sweden PM Quits : బాధ్యతలు చేపట్టిన 7 గంటల్లోనే స్వీడన్ తొలి మహిళా ప్రధాని రాజీనామా

స్వీడన్​ తొలి మహిళా ప్రధానిగా బుధవారం పగ్గాలు చేపట్టిన మగ్దలీనా అండర్సన్(54).. గంటల వ్యవధిలోనే రాజీనామా చేశారు​. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ఆమోదం లభించకపోవడంతోపాటు,

Sweden PM Quits : బాధ్యతలు చేపట్టిన 7 గంటల్లోనే స్వీడన్ తొలి మహిళా ప్రధాని రాజీనామా

Sweden (1)

Sweden PM Quits : స్వీడన్​ తొలి మహిళా ప్రధానిగా బుధవారం పగ్గాలు చేపట్టిన మగ్దలీనా అండర్సన్(54).. గంటల వ్యవధిలోనే రాజీనామా చేశారు​. పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ఆమోదం లభించకపోవడంతోపాటు, రెండు పార్టీలతో కూడిన మైనారిటీ ప్రభుత్వం నుంచి ఓ సంకీర్ణ భాగస్వామి వైదొలగడంతో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ప్రధాని పదవిలో ఆమె సుమారు 7 గంటలపాటు మాత్రమే ఉన్నారు.

ఈ సందర్భంగా మగ్దలీనా అండర్సన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… ఇది గౌరవానికి సంబంధించిన విషయమని చెప్పారు. ఉనికి ప్రశ్నార్థకమయ్యే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించాలని తాను కోరుకోవడం లేదన్నారు.

కాగా, గత ఏడేళ్లుగా స్వీడన్ ప్రధానిగా ఉన్న స్టెఫాన్ లోఫ్‌వెన్..ఈ నెల 10న అధికారికంగా ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కొత్తగా నిర్మించిన అపార్ట్‌మెంట్లకు అద్దె నియంత్రణలను తగ్గించే ప్రణాళిక విషయంలో ప్రభుత్వానికి, దానికి మద్దతు ఇస్తున్న లెఫ్ట్ పార్టీకి మధ్య విభేదాలు వెలగుచూశాయి. దీంతో లెఫ్ట్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. ప్రధానిగా స్టీఫెన్ లోఫ్‌వెన్ పదవికి అనర్హుడుగా ప్రకటించాలని లెఫ్ట్ పార్టీ డిమాండ్ చేసింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న స్వీడన్ డెమోక్రాట్స్(ఎస్.డి) పార్టీ పార్లమెంటులో ప్రధానిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ‌పెట్టారు. జూన్-21,2021న స్వీడన్ పార్లమెంట్ లో స్టీఫెన్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మొత్తం 349 సీట్లు ఉన్న స్వీడ‌న్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 181 మంది చట్టసభ్యులు ఓటేశారు. ఫలితంగా 2014 నుంచి స్వీడన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న స్టీఫెన్ లోఫ్‌వెన్ తన పదవికి రాజీనామా చేశారు.

పార్టీ నేత, ప్రధాన మంత్రి పదవులను వదులుకున్న స్టెఫాన్ లోఫ్‌వెన్ స్థానంలో.. దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న మగ్దలినా అండర్సన్‌ ను ఎంపిక చేశారు. బుధవారం స్వీడన్ పార్లమెంట్ లో ప్రధాన మంత్రి పదవి ఎంపికకి జరిగిన ఓటింగ్‌లో మగ్దలీనా ఆండర్సన్‌ ఓడిపోయినప్పటికీ స్వీడిష్ రాజ్యాంగం ప్రకారం ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారు. స్వీడన్ పార్లమెంటులో 349 మంది సభ్యులు ఉన్నారు. బుధవారం జరిగిన ఓటింగ్ లో మగ్దలీనా ఆండర్సన్‌ కు అనుకూలంగా 117 ఓట్లు లభించాయి. ఆమెకు వ్యతిరేకంగా 174 మంది ఓటు వేశారు. 57 మంది ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఒకరు గైర్హాజరయ్యారు.

అయితే స్వీడిష్ రాజ్యాంగం ప్రకారం కనీసం 175 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఉంటేనే ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగవలసి ఉంటుంది. మగ్దలీనాకు వ్యతిరేకంగా 174 మంది మాత్రమే ఓటు వేసినందువల్ల ఆమెను ప్రధాన మంత్రి పదవిలో నియమించేందుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. అంటే ఒక్క ఓటు తేడాతో ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే ప్రధాని పగ్గాలు చేపట్టిన తొలిరోజే రాజీనామా కూడా చేసి రికార్డు సృష్టించారు మగల్దీనా అండర్సన్. కాగా, 2022 లో స్వీడన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.

ALSO READ CBI ready to arrest punch prabhakar : పంచ్ ప్రభాకర్ కు ‘పంచ్’..అరెస్ట్ కు రంగం సిద్ధం