Taliban : ఉగ్రవాదులను పెళ్లి చేసుకోవాలని..ఆఫ్ఘాన్ మహిళలపై ఒత్తిడి

ఆఫ్ఘానిస్తాన్ నుంచి నాటో, అమెరికా ద‌ళాల ఉపసంహరణతో అక్క‌డ మ‌రోసారి తాలిబ‌న్లు రాజ్య‌మేల‌డానికి సిద్ధ‌మ‌వుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాలిబన్ గెరిల్లా ఆర్మీ దేశంలోని ప్ర‌ధాన న‌గరాల‌ను ఆక్ర‌మిస్తూ వస్తోంది.

Taliban : ఉగ్రవాదులను పెళ్లి చేసుకోవాలని..ఆఫ్ఘాన్ మహిళలపై ఒత్తిడి

Taliban (1)

Taliban ఆఫ్ఘానిస్తాన్ నుంచి నాటో, అమెరికా ద‌ళాల ఉపసంహరణతో అక్క‌డ మ‌రోసారి తాలిబ‌న్లు రాజ్య‌మేల‌డానికి సిద్ధ‌మ‌వుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాలిబన్ గెరిల్లా ఆర్మీ దేశంలోని ప్ర‌ధాన న‌గరాల‌ను ఆక్ర‌మిస్తూ వస్తోంది. ఆఫ్ఘానిస్తాన్ లో రెండో అతిపెద్ద నగరమైన కాందహార్‌ తో సహా దేశంలోని మూడింట రెండొంతుల భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు తాలిబన్లు. వాళ్ల‌ను ఎదుర్కోవ‌డం ఆప్ఘాన్ ప్రభుత్వ సాయుధ బ‌ల‌గాల వ‌ల్ల కావ‌డం లేదు.

అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రాబల్యం పెంచుకుంటున్న తాలిబన్ల అరాచకాలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. సాధారణ ప్రజలపై దాడులకు పాల్పడటంతోపాటు అవివాహిత మహిళలను ఉగ్రవాదులకు ‘భార్యలు’గా మారాలని నిర్బంధిస్తున్నారని అమెరికన్ మీడియా తెలిపింది. తాలిబన్ల దురాగతాలను తట్టుకోలేని చాలా మంది ఆఫ్ఘాన్ లు రాజధాని కాబూల్‌‌కు తరలివస్తున్నట్లు తెలిపింది. తాలిబన్లు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లోనివారు, కాబూల్‌కు తరలిపోతున్నవారు చెప్పిన వివరాల ప్రకారం.. తాలిబన్లు సామాన్య ప్రజలపై విచక్షణ లేకుండా దాడులు చేయడంతోపాటు అవివాహిత మహిళలను తమ భార్యలుగా మారాలని బలవంతపెడుతున్నారని తెలుస్తోంది. ఇక, తాలిబన్లు తమకు లొంగిపోయిన ఆఫ్ఘాన్ ప్రభుత్వ దళాల సైనికులను హింసించి, చంపుతున్నారని అమెరికన్ మీడియా పేర్కొంది.

తాము విజయం సాధిస్తామని, ప్రభుత్వాధికారులు, సైన్యం, ప్రజలు భయపడవలసిన అవసరం లేదని తాలిబన్లు బహిరంగంగా ప్రకటించారని, అయితే ప్రస్తుత పరిణామాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని అమెరికన్ మీడియా తెలిపింది. కాబూల్‌లోని అమెరికన్ ఎంబసీ గురువారం చేసిన ఓ ట్వీట్‌లో తాలిబన్లను తప్పుబట్టింది. లొంగిపోయిన ఆఫ్ఘాన్ ఆర్మీ సైనికులను తాలిబన్లు ఉరి తీసి చంపుతున్నారని..ఈ పరిణామాలు చాలా ఆందోళనకరమని, యుద్ధ నేరాల పరిధిలోకి వస్తాయని ఆ ట్వీట్ లో అమెరికన్ ఎంబసీ పేర్కొంది.

మరోవైపు, తాలిబన్లు వేగంగా దూసుకొస్తూ దేశంలోని ఒక్కొక్క ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుంటున్న క్రమంలో అక్కడి ప్ర‌భుత్వం పవర్ షేరింగ్ ఆఫ‌ర్‌తో ముందుకొచ్చింది. దేశంలో కొనసాగుతున్న హింసను ఆపివేస్తే అధికారాన్ని పంచుకునేందుకు అంగీకరిస్తామని ఖతార్ లోని ఆఫ్ఘాన్ ప్రభుత్వ రాయబారులు తాలిబన్లకు ఆఫర్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రపోజల్ ను మధ్యవర్తిగా ఖతార్ కి ఆఫ్ఘాన్ ప్రభుత్వం సమర్పించింది. అయితే ఇప్పటికే ఆఫ్ఘానిస్తాన్ లోని మూడింట రెండొంతుల భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకున్న తాలిబన్లు..ఇప్పుడు రాజ‌ధాని కాబూల్ ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన క్రమంలో ప్ర‌భుత్వం ఇలా స్నేహ హ‌స్తాన్ని చాచింది.