Taliban-U.S.A : అప్ఘానిస్తాన్ కు అమెరికా సాయం

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న అప్ఘానిస్తాన్‌కు మానవతా సాయం అందజేస్తామని అమెరికా హామీ ఇచ్చిందని తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం ఆదివారం తెలిపింది.

Taliban-U.S.A : అప్ఘానిస్తాన్ కు అమెరికా సాయం

Afghanistan (5) (1)

Taliban-U.S.A  ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న అప్ఘానిస్తాన్‌కు మానవతా సాయం అందజేస్తామని అమెరికా హామీ ఇచ్చిందని తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం ఆదివారం తెలిపింది. అయితే తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించేందుకు మాత్రం అమెరికా నిరాకరించినట్లు తాలిబన్ ప్రభుత్వం తెలిపింది. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడానికి, సాయానికి ఎటువంటి సంబంధం లేదని తాలిబన్ రాజకీయ ప్రతినిధి సుహేల్ షాహీన్ తెలిపారు.

ఈ ఏడాది ఆగస్టులో అప్ఘానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలిగిన తర్వాత తొలిసారిగా ఖతార్ రాజధాని దోహా వేదికగా రెండు రోజుల పాటు(అక్టోబర్-9,10)అగ్రరాజ్య ప్రతినిధులు-తాలిబన్ ప్రతినిధి బృందం మధ్య చర్చలు జరిగాయి. అమెరికాతో చర్చలు అర్ధవంతంగా జరిగినట్లు తాలిబన్ అధికార ప్రతినిధి తెలిపారు. ఇతర దేశాలపై దాడులు చేయడానికి అప్ఘాన్ భూభాగాన్ని ఉగ్రవాదులు ఉపయోగించుకోకుండా చూడడానికి తాలిబాన్లు కట్టుబడి ఉన్నారని అప్ఘాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి చర్చల సందర్భంగా అమెరికాకు హామీ ఇచ్చారని తాలిబాన్ రాజకీయ ప్రతినిధి తెలిపారు.

ఇక, ఐఎస్ ఉగ్రవాదులను తుదముట్టించడానికి అమెరికా సహాయం తీసుకునే ప్రసక్తేలేదని శనివారం తాలిబన్ తేల్చి చెప్పింది. ఐసిస్..తాలిబన్ శత్రువని.. వారిని ఎదుర్కొనే సత్తా తమకుందని సుహేల్ షాహీన్ తెలిపారు. అమెరికాతో చర్చల అనంతరం అప్ఘాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ మాట్లాడుతూ.. అప్ఘాన్‌లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే ఏ ఒక్కరికీ మంచిది కాదని స్పష్టంగా చెప్పామని తెలిపారు. అప్ఘానిస్తాన్‌తో మంచి సంబంధాలు అందరికీ మంచిందని హెచ్చరించారు.

మరోవైపు, తాలిబన్ తో జరిపిన చర్చలపై స్పందించిన అమెరికా.. ఇవి ఏ విధంగానూ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తింపునకు ముందుమాట కాదని స్పష్టం చేసింది. అప్ఘాన్లకు మానవతా సహాయం అందిస్తామని, ఇతర మానవతా సంస్థలకు సాయం అందించేందుకు సౌకర్యాలు కల్పిస్తామని అమెరికా ప్రతినిధులు పేర్కొన్నారు. ఏదైనా సహాయం అప్ఘాన్ ప్రజలకు అందజేస్తామని, తాలిబాన్ ప్రభుత్వానికి కాదని అమెరికా వివరణ ఇచ్చింది.

ALSO READ  మోదీకి ఫోన్ చేసిన బ్రిటన్ ప్రధాని..వ్యాక్సిన్ సర్టిఫికెట్ పై చర్చ