Ukraine : యుక్రెయిన్‌‌కు కష్టాలు.. నిన్న యుద్ధం, నేడు సైబర్ దాడులు

రక్షణ, విదేశాంగ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలతో పాటు యుక్రెయిన్‌లోని రెండు అతిపెద్ద బ్యాంకులతో సహా మొత్తం 10 వెబ్‌సైట్‌లు పనిచేయడం మానేశాయి. అయితే.. దీని వెనుక రష్యా హస్తం ఉండవచ్చని..

Ukraine : యుక్రెయిన్‌‌కు కష్టాలు.. నిన్న యుద్ధం, నేడు సైబర్ దాడులు

Ukraine

Ukraine Hit By Cyber Attack : యుక్రెయిన్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు రష్యా దాడి చేస్తుందని టెన్షన్ పడిన యుక్రెయిన్‌…ఇప్పుడు సైబర్ దాడులతో కలవరపడుతోంది. ప్రస్తుతానికి రష్యా దాడి లేకపోయినప్పటికీ సైబర్ దాడుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. ఆ దేశాన్ని లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్లు.. ఆ దేశ ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రధాన బ్యాంకుల వెబ్‌సైట్లపై సైబర్‌ అటాక్ చేశారు. రక్షణ, విదేశాంగ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలతో పాటు యుక్రెయిన్‌లోని రెండు అతిపెద్ద బ్యాంకులతో సహా మొత్తం 10 వెబ్‌సైట్‌లు పనిచేయడం మానేశాయి. అయితే.. దీని వెనుక రష్యా హస్తం ఉండవచ్చని యుక్రెయిన్ అనుమానిస్తోంది. ఓషాద్‌ బ్యాంక్‌, ప్రైవేట్ 24 బ్యాంకుపై దాడులు జరిగినట్టు తేల్చారు. రక్షణ శాఖ వెబ్‌సైట్‌ ఎర్రర్ మేసేజ్‌ చూపిస్తూ పనిచేయలేదు. అలాగే కొన్ని ప్రభుత్వ వైబ్‌సైట్లపై దాడి జరిగింది. యుద్ధంతో ఎదుర్కోలేక ఇలాంటి చీప్ ట్రిక్స్‌తో యుక్రెయిన్‌ను దెబ్బతీయాలని చూస్తోందని ఆ దేశ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో కూడా యుక్రెయిన్‌ వెబ్‌సైట్లపై రష్యాన్ హ్యాకర్లు దాడి చేశారని గుర్తించారు. ఇప్పుడు కూడా వారే చేశారని ఆరోపిస్తున్నారు.

Read More : Russia-Ukraine : ఉక్రెయిన్ – రష్యా ఉద్రిక్తతలు… అప్రమత్తమైన భారత్

మరోవైపు… యుక్రెయిన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో తాము యుద్ధం కోరుకోవడం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు. కానీ, యుక్రెయిన్‌పై దాడి చేసేందుకు అవకాశం ఉందనే సంకేతాన్ని ఇచ్చారు. సైనిక విన్యాసాల వ‌ల్లే యుక్రెయిన్‌పై ఏ క్షణమైనా దాడికి దిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఊహాగానాలు వ్యాపించాయి. అయితే ప‌శ్చిమ దేశాల దౌత్యంతో రష్యా వెన‌క్కి త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పుతిన్ యుక్రెయిన్‌తో వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు చర్చలకు సిద్ధమని ప్రకటించారు. యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని, యుక్రెయిన్ సరిహద్దు నుంచి కొన్ని రష్యా బలగాలు తరలిపోయాయన్న నివేదికలను ఇంకా ధృవీకరించలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. రష్యా మరింత కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. చర్చలకు దిగేందుకు తాము సిద్ధమేనని రష్యా అధ్యక్షుడు స్పష్టం చేశారు. క్షిపణులు, సైన్యాల మోహరింపును పరస్పరం తగ్గించుకుంటామని చెప్పారు. అమెరికా, నాటోతో మాట్లాడతామని స్పష్టం చేశారు.