భారత్ ఉదార ఆర్థిక వ్యవస్థ…ఉగ్రవాదంతో 1ట్రిలియన్ డాలర్ల నష్టం

  • Published By: venkaiahnaidu ,Published On : November 15, 2019 / 01:42 AM IST
భారత్ ఉదార ఆర్థిక వ్యవస్థ…ఉగ్రవాదంతో 1ట్రిలియన్ డాలర్ల నష్టం

ప్రపంచంలోనే పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌..అత్యంత అనువైన దేశమని ప్రధాని మోడీ తెలిపారు. భారత్ అత్యంత ఉదార ఆర్థిక వ్యవస్థ అని, అపరిమితమైన అనుకూలతలు, అసంఖ్యాకమైన అవకాశాలున్నాయని అన్నారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని భారత్‌లోపెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన ‘బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా)’ కూటమిలోని వాణిజ్యవేత్తలకు పిలుపునిచ్చారు.

 బ్రెజిల్‌ రాజధాని బ్రెసీలియాలో గురువారం జరిగిన బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరం ముగింపు కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ… 2024 నాటికి భారత్‌ 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఇందులో భాగంగా ఇన్‌ఫ్రా రంగానికే 1.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు కావాలి. అందుకని భారత్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. అపరిమిత అవకాశాలు అందిపుచ్చుకోండని కార్పొరేట్లను ఆయన ఆహ్వానించారు.

ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం నెలకొన్నప్పటికీ బ్రిక్స్‌ దేశాలు ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధిలో 50% బ్రిక్స్‌ దేశాలదే. కొన్ని కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాయి. సాంకేతికత, సృజనాత్మకతలో కొత్త విజయాలు సాధించాయి. బ్రిక్స్‌ కూటమి ఏర్పాటై పదేళ్లయిన నేపథ్యంలో భవిష్యత్తు కోసం సరికొత్త ప్రణాళికలను రూపొందించుకోవాలని మోడీ సూచించారు. బ్రిక్స్‌ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెరిగేలా వ్యాపార నిబంధనలు సరళతరం కావాలన్నారు. సభ్య దేశాలు కలిసి పనిచేసేందుకు వీలున్న రంగాలు గుర్తించాలని, పరస్పరం సహకరించుకుని ఎదగాలని ప్రధాని సూచించారు. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని భారత్‌లో త్వరగా ప్రారంభించాలని కోరారు. 

ఉగ్రవాదం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 1ట్రిలియన్ డాలర్ల మేర నష్టం జరిగిందని మోడీ చెప్పారు. ఉగ్రవాదాన్ని అరికట్టే విషయంలో బ్రిక్స్‌ దేశాల మధ్య పెరిగిన సహకారం స్వాగతించదగినదని అన్నారు. బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. చెన్నైలో ఇటీవల జరిగిన తమ భేటీ అనంతరం ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో నూతన దిశ, నూతన శక్తి వచ్చి చేరాయని  మోడీ అన్నారు.