Pegasus Project : కలవరపెడుతున్న పెగాసస్ స్పైవేర్, ప్రముఖుల ఫోన్లు హ్యాక్ ?

దేశంలో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. పెగాసస్‌ స్పైవేర్‌ అంశం మరోసారి దేశాన్ని కుదిపేస్తోంది. దాదాపు రెండేళ్ల క్రితం భారత్‌లోని పాత్రికేయులు, మేథావులు, హక్కుల నేతల ఫోన్లు హ్యాక్‌ అయ్యాయంటూ కథనాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే పెగాసస్‌ స్పైవేర్‌ వార్తల్లోకి వచ్చింది.

Pegasus Project : కలవరపెడుతున్న పెగాసస్ స్పైవేర్, ప్రముఖుల ఫోన్లు హ్యాక్ ?

Phone

Pegasus Spyware : దేశంలో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. పెగాసస్‌ స్పైవేర్‌ అంశం మరోసారి దేశాన్ని కుదిపేస్తోంది. దాదాపు రెండేళ్ల క్రితం భారత్‌లోని పాత్రికేయులు, మేథావులు, హక్కుల నేతల ఫోన్లు హ్యాక్‌ అయ్యాయంటూ కథనాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే పెగాసస్‌ స్పైవేర్‌ వార్తల్లోకి వచ్చింది. 40 మందికి పైగా భారతీయ పాత్రికేయులు, విపక్షాలకు చెందిన ముగ్గురు అతి పెద్ద నేతలు, రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక వ్యక్తి, ప్రస్తుత కేంద్ర కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులు, వివిధ భద్రతా సంస్థలకు చెందిన మాజీ, ప్రస్తుత అధిపతులు, పలువురు వ్యాపారవేత్తలు.. ఇలా మొత్తం 300 మంది పెగాసస్‌ నిఘా జాబితాలో ఉన్నారంటూ ద వైర్‌ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. జాబితాలో ఉన్న ఒక నంబరు సుప్రీంకోర్టు సిటింగ్‌ జడ్జి పేరుతో నమోదై ఉందని తెలిపింది.

ఫోరెన్సిక్ పరీక్షలు : –
జాబితాలోని పది మంది పాత్రికేయుల ఫోన్లకు ఫోరెన్సిక్‌ పరీక్షలు చేయించగా.. కొన్ని ఫోన్లు పెగాసస్‌ స్పైవేర్‌తో హ్యాక్‌ అయ్యాయని, కొన్నింటిపై హ్యాకింగ్‌కు ప్రయత్నించిన ఆనవాళ్లు ఆ కథనంలో వెల్లడించింది. ఫ్రాన్స్‌కు చెందిన ఫర్‌బిడెన్‌ స్టోరీస్‌ అనే స్వచ్ఛంద మీడియా సంస్థ, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఈ జాబితాను సంపాదించి.. ద వైర్‌ సహా ప్రపంచవ్యాప్తంగా 15 వార్తా సంస్థలకు ఇచ్చినట్టు వివరించింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు.. 2018-19 సంవత్సరాల మధ్య వీరిని లక్ష్యంగా చేసుకున్నారని ద వైర్‌ కథనం పేర్కొంది. భారతదేశంతో పాటు అజర్‌బైజాన్‌, బహ్రెయిన్‌, హంగేరి, మెక్సికో, మొరాకో, సౌదీ అరేబియా తదితర దేశాలకు చెందిన ప్రముఖుల పేర్లు తాజా డేటాబేస్‌లో ఉన్నాయి.

ఎంపీ సుబ్రమణ్య స్వామి ట్వీట్ : –
ఈ వార్త గురించి తొలుత బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆదివారం ట్వీట్‌ చేశారు. కేంద్ర మంత్రుల ఫోన్లు, ఆరెస్సెస్‌ నేతలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఫోన్లూ పెగాసస్‌ నిఘా నీడలో ఉన్నాయన్నారు. దీనిపై వాషింగ్టన్‌ పోస్ట్‌, గార్డియన్‌ తదితర పత్రికలు కథనాలను ప్రచురిస్తాయనే వదంతులు వినిపిస్తున్నాయని, దీన్ని ధ్రువీకరించుకున్నాక జాబితాను ప్రచురిస్తానని తెలిపారు. సాయంత్రానికి వాషింగ్టన్‌ పోస్ట్‌ ప్రచురించిన ఒక కథనం లింకును ట్యాగ్‌ చేశారు సుబ్రమణ్యస్వామి. అయితే, ఆ కథనం మూడు రోజుల నాటిది. ఇజ్రాయెల్‌కు చెందిన కాండిరు అనే సంస్థ పశ్చిమాసియా, ఆసియా దేశాల్లోని ప్రభుత్వాలకు నిఘా సాఫ్ట్‌వేర్‌ను విక్రయించిందనేది ఆ కథనం సారాంశం.

ప్రభుత్వ పాత్ర ఉందా ? : –
వాస్తవానికి ఈ స్పైవేర్‌ ప్రభుత్వాల వద్దే అందుబాటులో ఉంటుంది. నిఘా కార్యకలాపాల కోసం దాన్ని ప్రభుత్వ సంస్థలకు ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ విక్రయిస్తుంటుంది. దీంతో తాజా హ్యాకింగ్‌ వ్యవహారంలో ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇందులో తమ జోక్యం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. దేశ పౌరులందరి గోప్యత హక్కును పరిరక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. హ్యాకింగ్‌ ఆరోపణలను తోసిపుచ్చింది.

ఫోన్ లను నియంత్రిస్తారు : –
పెగాసస్‌ స్పైవేర్‌ చొరబడితే మన ఫోన్‌ మనది కానే కాదు. ఫోన్‌ మన చేతిలోనే ఉన్నా హ్యాకర్లు దాన్ని పూర్తిగా నియంత్రించగలరు. ఫోన్‌లోని కెమెరాను యాక్టివేట్‌ చేసి, ఫొటోలు తీసుకోగలరు. మైక్రోఫోన్‌ను ఆన్‌ చేసి మన మాటలు వినొచ్చు. 2019లో ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ ఎన్‌ఎస్‌వో.. ఈ స్పైవేర్‌ను సౌదీఅరేబియా కోసం తయారు చేసినట్లు అనుమానించారు. దాంతో పాటు 20 దేశాలకు చెందిన 1,400 మందిని టార్గెట్‌ చేశారు.

కోర్టులో దావా : –
ఈ పెగాసస్ టూల్ లేటెస్ట్ వెర్షన్‌లో యూజర్ అసలు ఎలాంటి లింక్‌పైన క్లిక్ చేయకపోయినా సరే, కేవలం ఒక మిస్డ్ వీడియో కాల్ ఇచ్చి కూడా అతడి ఫోన్‌ను హ్యాక్ చేయొచ్చని వాట్సాప్ ఆరోపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మే నెల మధ్యలో 20 దేశాల్లో దాదాపు 1400 మందిపై పెగాసస్ ద్వారా నిఘా పెట్టారని వాట్సాప్ చెబుతోంది. ఈ విషయంలో ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌పై వాట్సాప్‌ శాన్‌ఫ్రాన్సిస్కో కోర్టులో దావా కూడా వేసింది.