మరోసారి చైనా వైరాలజిస్ట్ సంచలన ఆరోపణలు…వూహాన్‌ కరోనాను WHO కవర్ చేసేందుకు ప్రయత్నించింది

  • Published By: venkaiahnaidu ,Published On : September 23, 2020 / 05:08 PM IST
మరోసారి చైనా వైరాలజిస్ట్ సంచలన ఆరోపణలు…వూహాన్‌ కరోనాను WHO కవర్ చేసేందుకు ప్రయత్నించింది

చైనాలోని వూహాన్‌ ల్యాబ్ ‌లోనే కరోనా వైరస్‌ తయారయ్యిందంటూ ఇటీవల సంచలన ప్రకటన చేసిన చైనా వైరాలజిస్ట్‌ లి మెంగ్‌ యాన్‌ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి చైనా ప్రభుత్వానికి తెలుసన్న యాన్‌.. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని కవర్‌ చేయడానికి తెగ ప్రయత్నించిందని ఆరోపించారు.


ఓ ఇంటర్వ్యూలో యాన్‌ మాట్లాడుతూ.. ఈ వైరస్‌ను వూహాన్‌ ల్యాబ్‌లో సృష్టించారు. దీని వ్యాప్తి గురించి చైనాకు ముందే తెలుసు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాపై నింద పడకుండా కవర్‌ చేయడానికి తెగ ప్రయత్నించింది. ఈ విషయాన్ని నిరూపించడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. చైనా ప్రభుత్వం దీన్ని ఎందుకు సృష్టించిందో.. ఎందుకు బయటకు వదిలిందో ప్రజలకు తెలపాలనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న ఆధారాలు ఎవరైనా అర్థం చేసుకోగలరు. వైరస్‌ జన్యుశ్రేణి మానవవేలిముద్రలాగా ఉంటుందని యాన్‌ తెలిపారు.


వూహాన్‌లో కొత్తగా న్యూమోనియా ప్రబలడంపై విచారించాల్సిందిగా తనని ప్రభుత్వం కోరిందనీ, ఆ విచారణలో భాగంగా ఈ వైరస్‌ను దాచిపెట్టడానికి జరిగిన ప్రయత్నాలు తన దృష్టికి వచ్చినట్లు ఆమె వెల్లడించారు. తాను ఈ విషయాలను వెల్లడించడంతో చైనా ప్రభుత్వం సోషల్‌ మీడియా ద్వారా తనను బెదిరించాలని చూస్తోందన్నారు. తన కుటుంబాన్ని భయపెట్టడమేకాక.. తన మీద సైబర్‌ దాడులు చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు.



లి మెంగ్‌ యాన్‌…. హాంకాంగ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌లో వైరాలజీ, ఇమ్యునాలజీలో శాస్త్రవేత్త. డిసెంబర్‌– జనవరిలో తొలిసారి, జనవరి మధ్యలో మరోమారు డాక్టర్‌ లీ మెంగ్‌ చైనాలో న్యూమోనియాపై రెండు పరిశోధనలు చేశారు. తరువాత యాన్‌ హాంకాంగ్‌ నుంచి అమెరికా పారిపోయారు. .