తొందరపడి లాక్ డౌన్ ఎత్తేయవద్దు…ప్రపంచదేశాలకు WHO హెచ్చరిక

  • Published By: venkaiahnaidu ,Published On : May 7, 2020 / 07:10 AM IST
తొందరపడి లాక్ డౌన్ ఎత్తేయవద్దు…ప్రపంచదేశాలకు WHO హెచ్చరిక

కోవిడ్-19 వ్యాప్తిని కట్టడిచేసేందుకు విధించిన లాక్ డౌన్ ను..ప్రపంచంలోని పలుదేశాలు నెమ్మదిగా ఎత్తివేయడం పట్ల డబ్యూహెచ్ వో(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ఆందోళన వ్యక్తం చేసింది. లాక్‌ డౌన్ ను ఎత్తివేయవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)  హెచ్చరించింది. కొన్ని దేశాలు లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేస్తున్నందున కరోనా ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని WHO సూచించింది. ప్రపంచ దేశాల్లో లాక్ డౌన్ ను త్వరగా ఎత్తివేస్తే కరోనా వైరస్ వ్యాప్తిచెందవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎపిడెమియాలజిస్ట్ మారియా వాన్ కెర్దోవ్ హెచ్చరించారు.

కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు అన్ని దేశాలు లాక్ డౌన్ విధించాయి. దాదాపు 2 నెలల నుంచి లాక్ డౌన్ కొనసాగుతోంది. కానీ ఆర్ధిక వ్యవస్థ కుదేలవడం, ప్రజలకు ఇబ్బంది కలగుతోందన్న కారణంగా ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ క్రమక్రమంగా ఎత్తేసేందుకు అన్ని దేశాలు వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు కరోనా వైరస్ ఇప్పటికీ లొంగి రాలేదు. ప్రపంచ దేశాల్లో వైరస్ మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO… అన్ని  ప్రపంచ  దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ ను ఎత్తేయడంలో  ప్రపంచ దేశాలు తొందరపడవద్దని WHO తెలిపింది. అలా చేస్తే.. కరోనా వైరస్ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 

బుధవారం జెనీవా నుంచి వీడియో ద్వారా WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ గెబ్రేసస్ మాట్లాడారు. లాక్ డౌన్ ఎత్తేయాలనుకునే ప్రపంచ దేశాలు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని తనిఖీ చేయడానికి తగిన ట్రాకింగ్ వ్యవస్థలు, నిర్బంధ నిబంధనలను దేశాలు ఏర్పాటు చేసుకోవాలని టెడ్రోస్ సూచించారు. వైరస్ వ్యాప్తి తగ్గితే ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ను దశలవారీగా సడలించుకోవాలని లేదంటే తిరిగి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని టెడ్రోస్ హెచ్చరించారు. జర్మనీ, స్పెయిన్, ఇటలీ దేశాలు లాక్ డౌన్ ను సడలించడం ప్రారంభించాయని, అమెరికాలో కూడా లాక్ డౌన్ ఎత్తివేసేందుకు ట్రంప్ సుముఖత వ్యక్తం చేశారు.

ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ను ఎప్పుడు, ఎలా ముగించాలో ప్రభుత్వాలు నిర్ణయించాలని, మహమ్మారి తగ్గిన తర్వాతే ఆంక్షలు సడలించాలని WHO అధికారి మైక్ ర్యాన్ సూచించారు. సరిగ్గా నెలరోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా 13,46,800 కరోనా కేసులుండగా, మే 6వ సాయంత్రం నాటికి కరోనా రోగుల సంఖ్య 37.8 లక్షలకు పెరిగింది. కరోనా వల్ల 2.61 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 

కాగా, వరల్డ్ మీటర్ వెబ్ సైట్ తెలిపిన కోవిడ్-19 డేటా ప్రకారం…. ఇవాళ ఉదయం 11:30గంటలకు 37లక్షల 80వేల 620కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా నమోదవగా,2లక్షల 61వేల 700మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు భారత్ లో కూడా చాప కింద నీరులా కోవిడ్-19 విస్తరిస్తోంది. భారత్ లో 53వేలకు చేరువలో కరోనా కేసులు ఉండగా,దాదాపు 1800మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 35,902 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Also Read | లాక్ డౌన్ మహిమ : బీహార్ గ్రామస్థులకు ఎవరెస్ట్ శిఖరం కనిపిస్తోంది