Iran’s New President Raisi : ఇరాన్ అధ్యక్షుడిగా రైసీ విజయంపై ప్రపంచదేశాల స్పందన ఇదీ

ఇరాన్‌ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఇబ్రహీం రైసీ..తాజాగా జరిగిన 13వ ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Iran’s New President Raisi : ఇరాన్ అధ్యక్షుడిగా రైసీ విజయంపై ప్రపంచదేశాల స్పందన ఇదీ

Edrahim Raisi

Iran’s New President Raisi ఇరాన్‌ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఇబ్రహీం రైసీ..తాజాగా జరిగిన 13వ ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రైసీకి గట్టి పోటీ ఇవ్వగలరని భావించిన అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ నేతృత్వంలోని ప్యానెల్‌ తిరస్కరించడంతో రైసీ సునాయాసంగా గెలిచారనే వాదనలు వినిపిస్తున్నాయి. శుక్రవారం జరిగిన ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 5.9 కోట్ల మంది ఓటర్లకుగాను 2.8 కోట్ల మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1979 ఇస్లామిక్ విప్లవం తరువాత ఇరాన్‌లో తక్కువ శాతం ఓట్లు పోల్ అవ్వడం ఇదే తొలిసారి.

తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 48.8శాతం ఓటింగ్ నమోదవగా..పోలైన ఓట్లలో 61.95శాతం ఓట్లు సాధించి రైసీ విజయకేతనం ఎగురవవేశారు. ఇరాన్‌లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత రెండో శక్తిమంతమైన నాయకుడు అధ్యక్షుడే. దేశీయ విధానాలతోపాటు విదేశీ వ్యహరాలనూ అధ్యక్షుడు ప్రభావితం చేయగలడు. అయితే, దేశానికి సంబంధించి ఎలాంటి వ్యవహారాల్లో అయినా, తుది నిర్ణయం మాత్రం ఖమేనీదే.

తన పట్ల నమ్మకం ఉంచి విజయాన్ని అందించిన ఇరానీ ప్రజలకు రైసీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో ఇరాన్ అధ్యక్షుడిగా రైసీ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, 60 ఏళ్ల ఇబ్రహీం రైసీ తన కెరియర్‌ మొత్తం దాదాపుగా ప్రాసిక్యూటర్‌గానే పనిచేశారు. 2017లో జరిగిన ఎన్నికల్లో కూడా రైసీ పోటీ చేశారు. కానీ రౌహాని చేతిలో ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2019లో అత్యున్నత న్యాయస్థాన అధిపతిగా రైసీ నియమితులైన విషయం తెలిసిందే.

రైసీ విజయంపై ప్రపంచదేశాల స్పందన

భారత్ : ఇబ్రహీం రైసీకి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరాన్-భారత్ ల మధ్య సంబంధాల బలోపేతం కోసం రైసీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు.
అమెరికా : ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు జరిగిన తీరుని బైడెన్ ప్రభుత్వం తప్పుబట్టింది. ఇరానియన్లు స్వేచ్చ మరియు న్యాయబద్దమైన ఎన్నికల ప్రక్రియలో పాల్గొనలేకపోయారని అమెరికా పేర్కొంది. 2015 న్యూక్లియర్ ఒప్పందంలో చేరాలని కోరుతూ ఇరాన్ తో అమెరికా పరోక్ష చర్చలు జరపడం కొనసాగిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఇక,బాధ్యతలు చేపట్టక ముందే అమెరికా ఆంక్షలను ఎదుర్కొన్న తొలి ఇరాన్ అధ్యక్షుడిగా రైసీ రికార్డు సృష్టించారు. 198ంల్లో జరిగిన రాజకీయ ఖైదీల సామూహిక హత్యల్లో రైసీ ప్రమేయం ఉందని అమెరికా ఆయనపై ఆంక్షలు విధించింది.
రష్యా : ఇబ్రహీం రైసీకి పుతిన్ అభినందనలు తెలిపారు ద్వైపాక్షిక సహకారంతో ఇరు దేశాల సంబంధాలు మరింత మెరుగవుతాయని ఆశిస్తున్నట్లు పుతిన్ పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ : రైసీ ఎన్నికను ఇజ్రాయెల్ ఖండించింది. ఇరాన్ లో ఇప్పటివరకు అధ్యక్షులైన వారిలో రైసీనే అత్యంత అతివాద అధ్యక్షుడని ఇజ్రాయెల్ పేర్కొంది. రైసీని ఓ కసాయి వ్యక్తిగా అభివర్ణించింది. చట్టవిరుద్ధంగా 30వేల మందికిపైగా మరణవిక్షలు విధించడంలో రైసీ పాత్ర ఇందని.. అంతర్జాతీయ సమాజం బహిరంగంగానే ఈ విషయం చెప్పిందని ఇజ్రాయెల్ తన ప్రకటనలో పేర్కొంది. రైసీ ఎన్నిక అంతర్జాతీయ సమాజానికి ఆందోళనకరమేనని తెలిపింది.
పాకిస్తాన్ : ఇబ్రహీం రైసీకి ఇమ్రాన్ ఖాన్ అభినందనలు తెలిపారు. రైసీతో కలిసి పనిచేయడానికి పాకిస్తాన్ ఎదురుచూస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఇరాన్-పాకిస్తాన్ మధ్య ప్రాంతీయ శాంతి,పురోగతి,శ్రేయస్సు వంటి విషయాల్లో ఇరు దేశాల స్నేహసంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
సిరియా : సిరియా-ఇరాన్ దేశాల మధ్య సంబంధాల బలోపేతం కోసం ఇబ్రహీం రైసీతో కలిసి పనిచేయడానికి ఆశక్తిగా ఎదురుచూస్తున్నట్లు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తెలిపారు.
ఇరాక్ : ఇరాక్-ఇరాన్ దేశాల మధ్య మరియు ప్రజల మధ్య ఉన్న బలమైన సంబంధాలను మరితం బలోపేతం అవుతాయని ఎదురుచూస్తున్నట్లు ఇరాక్ అధ్యక్షుడు బర్హమ్ సలీహ్ తెలిపారు. ఇరాక్ ప్రధానమంత్రి ముస్తఫా అల్ ఖదిమీ..రైసీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక మరియు భద్రత వ్యవహారాల్లో ఇరు దేశాల మధ్య సహకారం మరింత మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు ముస్తఫా తెలిపారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,హమాస్,ఖతార్,యెమెన్,టర్కీ,కువైట్ సహా మరికొన్ని దేశాలు రైసీకి అభినందలు తెలిపాయి. రైసీ హయాంలో సంబంధాల బలోపేతం కూడా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాయి.