Asaram Bapu : జోథ్‌పూర్ ఎయిమ్స్‌లో చేరిన ఆశారాం బాపు

మైనర్ బాలికపై లైంగికదాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు.

Asaram Bapu : జోథ్‌పూర్ ఎయిమ్స్‌లో చేరిన ఆశారాం బాపు

Asaram Bapu

Asaram Bapu : మైనర్ బాలికపై లైంగికదాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ(80) తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు.  జైలు అధికారులు ఆయన్ను శనివారం జోథ్ పూర్ లోని ఎయిమ్స్ కు తరలించారు. కాలేయం, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆశారాం బాపూ‌ని ఆస్పత్రిలోని ఐసీయూ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాలేయం, మూత్రాశయ వ్యాధులతోపాటు ఆశారాం బాపూ గత 5 రోజులగా జ్వరంతో బాధపడుతున్నారు.  దీంతో జైలు అధికారులు ఎయిమ్స్ కు తరలించగా 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచాలని డాక్టర్లు తెలిపారు.  అనారోగ్యంతో బాధపడుతున్న ఆశారాం బాపూని జైలు అధికారులు నెలకు ఒకటి రెండు సార్లు ఆస్పత్రికి తీసుకు వచ్చి పరీక్షలు చేయించి తీసుకు వెళ్తుంటారు.

Also Read : AP Covid Cases update : ఏపీలో కొత్తగా 215 కోవిడ్ కేసులు నమోదు

ఆశారాంను ఆస్పత్రికి తీసుకువస్తున్నారనే సమాచారం బయటకు రావటంతో పెద్దసంఖ్యలో ఆయన అనుచరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా పంపించాల్సి వచ్చింది.  2013లో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఆశారాం బాపూని 2014లో అరెస్ట్ చేశారు. అప్పటినుంచి ఆయన జోధ్ పూర్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

ఈ ఏడాది మే 5న ఆయనకు కోవిడ్ సోకటంతో జోథ్‌పూర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఉత్తరాఖండ్‌కి తీసుకువెళ్లి ఆయుర్వేద చికిత్స అందించాలని ఆయన పెట్టుకున్న పిటీషన్‌ను సుప్రీంకోర్టు  కొట్టి వేసింది.