BJP-Chevella: తెలంగాణలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి.. ఈ రెండు ఉచితంగా ఇచ్చేస్తాం: బండి సంజయ్

BJP-Chevella: తెలంగాణలో అధికారంలోకి రాగానే మొదట ఏం చేస్తామో చెప్పారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.

BJP-Chevella: తెలంగాణలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి.. ఈ రెండు ఉచితంగా ఇచ్చేస్తాం: బండి సంజయ్

Bandi Sanjay Kumar

BJP-Chevella: తెలంగాణలో అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చారు. చేవెళ్లలో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహిస్తోంది. ఈ సభకు కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి సహా రాష్ట్ర బీజేపీ నేతలు హాజరయ్యారు.

ఈ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణను అభివృద్ధి చేయడానికే అమిత్ షా రాష్ట్రానికి వచ్చారని చెప్పారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని… ఫస్ట్ తారీఖే జీతాలిస్తామని చెప్పారు.

తనను ఇటీవల అరెస్టు చేసి పోలీసులు 8 గంటల పాటు రోడ్లపై తిప్పారని బండి సంజయ్ చెప్పారు. ‘‘ కేసీఆర్ నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 8 గంటలు రోడ్లపై తిప్పారు. అప్పుడు కార్యకర్తలకు నేనొక్కటే చెప్పిన…. మీరేం భయపడకండి… ఢిల్లీ నుండి ఫోన్ చేసింది. పులి వస్తోంది. వేట మొదలైంది. వెంటాడటం ప్రారంభించింది. ఆ పులి కార్యకర్తలను కాపాడే పులి. ఆ పులే చేవెళ్ల గడ్డకు వచ్చింది. ఆ పులికి అందరూ లేచి స్వాగతం పలికండి’’ అని అన్నారు. అమిత్ షాను పులిగా అభివర్ణించారు.

తాను జైళ్లకు, పోలీసు కేసులకు భయపడబోనని చెప్పారు. తెలంగాణలోని నియంతృత్వ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతులను కూడా ఆదుకుంటామని తెలిపారు. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిందని పోలీసులు కంగారు పడ్డారని చెప్పారు. బీజేపీ కార్యకర్తలకు అమిత్ షానే కాపాడతారని అన్నారు. ఆ పులే ఇవాళ ఇక్కడకు వచ్చిందని వ్యాఖ్యానించారు.

ఇవాళ చేవెళ్లకు అమిత్ షా తెలంగాణను అభివృద్ధి చేయడానికే వచ్చారని బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని చెప్పారు. అప్పటి వరకు తాము పోరాడుతూనే ఉంటామని తెలిపారు.

“తెలంగాణను అభివృద్ధి చేసేందుకు మోదీ ప్రభుత్వం ఇక్కడికి వస్తుంటే కేసీఆర్ సర్కారు అడుగడుగునా అడ్డుకుంటోంది. ఒక్కసారి తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. మీ అందరూ ఆశీస్సులివ్వాలని కోరుతున్నా. లాఠీ దెబ్బలకు, కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ఇంతపెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ రెండు చేతులెత్తి జోడిస్తున్నా” అని బండి సంజయ్ అన్నారు.

Margani Bharat Ram : అక్కడ.. జగన్ ఎవరిని నిలబెట్టినా గెలిపించే బాధ్యత నాదే- ఎంపీ భరత్