Uttar Pradesh Violence: అలాంటి వారిని బీజేపీ నుంచి తొల‌గిస్తే స‌రిపోదు: మాయావ‌తి

Uttar Pradesh Violence: అలాంటి వారిని బీజేపీ నుంచి తొల‌గిస్తే స‌రిపోదు: మాయావ‌తి

Mayavati

Uttar Pradesh Violence: బీజేపీ ప్ర‌ద‌ర్శిస్తోన్న‌ తీరుపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ మాజీ ముఖ్య‌మంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల‌ మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బీజేపీ నాయ‌కురాలు నురూప్ శర్మ‌తో పాటు న‌వీన్ కుమార్‌ జిందాల్‌పై ఆ పార్టీ స‌స్పెన్ష‌న్ వేటు వేసిన విష‌యం తెలిసిందే. మతానికి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం స‌రికాద‌ని బీజేపీ ఈ సంద‌ర్భంగా పేర్కొంది. దీనిపై మాయావ‌తి ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు. మ‌తాల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసే వారిపై చ‌ట్ట‌బ‌ద్ధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

Delhi: ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

”ఏ మతంపై అయినా స‌రే అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాదు. ఈ విష‌యంలో బీజేపీ అధిష్ఠానం త‌మ పార్టీని అదుపులో పెట్టుకోవాలి. మ‌తాల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వారిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డం, తొల‌గించ‌డం వంటి చ‌ర్య‌లు ప‌నిచేయ‌వు. అటువంటి వారిపై క‌ఠిన చ‌ట్టాల కింద కేసులు పెట్టి జైలుకి పంపాలి” అని మాయావ‌తి ట్వీట్ చేశారు. దేశంలో ఉండే వారు అన్ని మ‌తాల‌నూ గౌర‌వించాల్సిన అవ‌స‌రం ఉందని ఆమె చెప్పారు.

COVID-19: దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

కాగా, మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ నాయ‌కురాలు నురూప్ శర్మ ఓ టీవీ డిబేట్‌లో అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌గా, న‌వీన్ కుమార్‌ జిందాల్ సామాజిక మాధ్య‌మాల్లో అభ్యంత‌రక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దీంతో యూపీలోని కాన్పూర్‌లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. దీంతో బీజేపీ ఈ ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌స్తావించ‌కుండా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. త‌మ పార్టీ అన్ని మ‌తాల‌నూ గౌర‌విస్తుంద‌ని పేర్కొంది. మ‌తాల‌పై ఎవ‌రైనా అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే త‌మ పార్టీ ఖండిస్తుంద‌ని చెప్పింది. అనంత‌రం పార్టీ వైఖ‌రికి వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తించారంటూ నురూప్ శర్మ‌తో పాటు న‌వీన్ కుమార్‌ జిందాల్‌పై పార్టీ ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంది. మ‌రోవైపు, ఇప్ప‌టికే నురూప్ శ‌ర్మ‌పై ముంబైలో కేసు న‌మోదైంది.