Gujarat HC : పెళ్లికాకుండా తల్లి అయితే బిడ్డ తండ్రి ఎవరో చెప్పాలా? గుజరాత్ హైకోర్టు

వివాహం కాకుండా పుట్టిన బిడ్డల గురించి వారు ఎవరికి పుట్టారు?వారి తండ్రి ఎవరు?అని ప్రశ్నిస్తే బిడ్డకు తండ్రి ఎవరో తల్లి చెప్పాల్సిందేనా? అని గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యానించింది.

Gujarat HC : పెళ్లికాకుండా తల్లి అయితే బిడ్డ తండ్రి ఎవరో చెప్పాలా? గుజరాత్ హైకోర్టు

Cannot Ask A Woman Who Her Child’s Father (1)

cannot ask a woman who her child’s father : పెళ్లికాకుండా బిడ్డకు జన్మనిస్తే ఆమెను, పుట్టిన బిడ్డను కూడా ఈ సమాజం చులకనగానే చూస్తుంది. ఇది అనాది నుంచే కాదు పురాణకాలం నుంచి వస్తోంది. లోక నిందలకు భయపడే కర్ణుడిని కుంతీదేవి పెట్టెలో పెట్టి నీటిలో వదిలేసింది. ఆ తరువాత కర్ణుడు పెరిగి పెద్దవాడైనా..వీరాధి వీరుడని నిరూపించబడినా కర్ణుడు నా బిడ్డనేనని అంగీకరించే ధైర్యం చేయలేకపోయింది కుంతీదేవి.

ఇదిలా ఉంటే..అలా వివాహం కాకుండా పుట్టిన బిడ్డల గురించి వారు ఎవరికి పుట్టారు?వారి తండ్రి ఎవరు?అని ప్రశ్నిస్తే బిడ్డకు తండ్రి ఎవరో తల్లి చెప్పాల్సిందేనా? ఆ వ్యక్తి పేరు చెప్పటానికి ఆమె ఇష్టపడకపోయినా..లేక చెప్పాలని ఒత్తిడికి చేసినా అది తప్పు అవుతుందా? అలా ఆమెను బిడ్డ తండ్రి ఎవరో చెప్పాలని ఒత్తిడికి గురిచేయవచ్చా? బలవంతంగానైనా పేరు చెప్పించాల్సిందేననే న్యాయ నిబంధనలు ఉన్నాయా? అత్యాచారానికి గురైనట్లు కూడా ఫిర్యాదు చేయని పరిస్థితుల్లో సమాధానం తెలిసినా ఆమె పేరు చెప్పకపోతే..ఆమెపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవచ్చా?’’అంటూ గుజరాత్‌ హైకోర్టు పలు ధర్మ సంకటమైన ప్రశ్నలను లేవనెత్తింది ఓ కేసు విచారణ విషయంలో.

ఓ బాలిపై అత్యాచారం కేసులో ఓ యువకుడికి 10 ఏళ్లు శిక్షను విధించడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ సందర్భంగా గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పరేశ్‌ ఉపాధ్యాయి పలు సందేహాలను వ్యక్తం చేశారు. వివాహం కాకుండానే..తన ఇష్టప్రకారమే ఓ యువకుడితో సహజీవనం చేసి బిడ్డను కనటానికి గర్భందాల్చిన మహిళపై ఏ న్యాయ నిబంధనలు ఉల్లంఘనకు గురయ్యాయని చర్యలు తీసుకోగలమని హైకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా ప్రశ్నించింది. ఇటువంటి పరిస్థితుల్లో సదరు మహిళ ఎవరితో కలిసి జీవిస్తున్నారనే విషయం పెద్ద విషయం కాదని వ్యాఖ్యానించారు.

ఈ కేసు వివరాల్లోకి వెళితే..గుజరాత్‌లోని జునాగఢ్‌కు చెందిన ఓ బాలిక తనకు నచ్చిన ఓ వ్యక్తితో సహజీవనం చేసింది. ఈక్రమంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. మైనర్‌గా ఉండగానే అంటే 16 ఏళ్లకే సహజీవనంలో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత మరో రెండేళ్లలోపు రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో 2021 మార్చి 24కు ఆమెకు 18 ఏళ్లు పూర్తి అయ్యాయి. మేజర్ అయ్యింది. దీంతో మార్చి 25న సహజీవనం చేసిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని అనుకుంది.

ఇంతలో కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ వల్ల వివాహం చేసుకోవటం వాయిదాపడింది. అలా 2021జనవరిలో వివాహ బంధంతో ఇరువురూ ఒక్కటయ్యారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ..ఆమెకు రెండో బిడ్డ పుట్టిన తర్వాత బాలిక తండ్రి ‘‘నా కూతురు మైనర్ ఆమెపై సదరు వ్యక్తి (బాలిక సహజీవనం చేసిన వ్యక్తి) అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును కోర్టులో ప్రవేశపెట్టారు.ఈ కేసును విచారించిన దిగువ కోర్టు ఆగస్టు 19న తీర్పునిస్తూ..నిందితుడికి ఐపీసీ సెక్షన్‌ 376(అత్యాచారం), పోక్సో చట్టం ప్రకారం 10ఏళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో నిందితుడు హైకోర్టులో దిగువకోర్టు తీర్పుని సవాల్‌ చేశాడు.

ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు పలు ధర్మసందేహాలు వ్యక్తంచేసింది. నగరాల్లో పెళ్లికాకుండానే బిడ్డల్ని కంటే ‘ఆధునికం’ అని సమర్థిస్తారు.అదే గ్రామాల్లో తప్పుగా చూస్తారు. కొన్ని గిరిజన తెగల్లో బిడ్డను కనటానికి మహిళకు వివాహ బంధం తప్పనిసరికాదు.18ఏళ్ల నిండకుండానే తల్లికావడం తప్పుగా చూడరు.ప్రసవం కోసం వచ్చిన మహిళను ఆస్పత్రిలో వైద్యులు ఆ బిడ్డ తండ్రి ఎవరని అడిగితే..‘నాకు తెలియదు. చెప్పడం ఇష్టంలేదు. తెలిసినా చెప్పడానికి ఇష్టం లేదని..ఆసక్తిలేదు’ అని ఆమె అంటే ఎదురయ్యే పరిస్థితి ఏమిటి? ఇటువంటి కేసుల్లో ఏ చట్టం ఉల్లంఘనకు గురయ్యిందని భావించగలం’ అని జస్టిస్‌ పరేశ్‌ ఉపాధ్యాయ్‌ సందేహం వెలిబుచ్చారు. అనంతరం ఈ కేసును వాయిదా వేశారు.