CBSE Exams: 10,12 తరగతి పరీక్షలు రద్దు …అయితే

  • Published By: venkaiahnaidu ,Published On : June 25, 2020 / 09:45 AM IST
CBSE Exams: 10,12 తరగతి పరీక్షలు రద్దు …అయితే

దేశంలో కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE 10, 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు గురువారం(జూన్-25,2020)సుప్రీం కోర్టుకు తెలిపింది. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా సీబీఎస్ఈ. కొన్ని  సబ్జెక్టులకు నిర్వహించాల్సిన 10,12వ  తరగతి  పరీక్షలు ఇంతకుముందు వాయిదా పడిన విషయం తెలిసిందే.

జూలై 1 నుంచి జూలై 15 వరకు పరీక్షలు నిర్వహించేందుకు గత నెలలో షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది సీబీఎస్ఈ. అయితే, కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భద్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షల్ని రద్దు చేయాలని, పరీక్షలు మిగిలిన సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా మార్కులు వేయాలంటూ సుప్రీం కోర్టులో విద్యార్థుల తల్లిదండ్రులు పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్  పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. పరీక్షల నిర్వహణపై నిర్ణయాన్ని తెలపాలంటూ సీబీఎస్ఈని సుప్రీం కోర్టు కోరింది. ఈ పిటిషన్‌పై మంగళవారం కూడా విచారణ జరిగింది. గురువారం లోగా నిర్ణయాన్ని ప్రకటిస్తామని సుప్రీం కోర్టుకు తెలిపింది సీబీఎస్ఈ. 10వ, 12వ తరగతుల పరీక్షల్ని రద్దు చేస్తున్నట్టు ఇవాళ సుప్రీం కోర్టుకు సీబీఎస్ఈ తెలిపింది. 

జూలై 1 నుండి జూలై 15 వరకు జరగాల్సిన పరీక్షలు రద్దయ్యాయని, పరిస్థితులు  అనుకూలంగా ఉన్నప్పుడు బోర్డు పరీక్షలు నిర్వహిస్తామని  CBSE సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే   విద్యార్థులకు తరువాత పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఇస్తుందా లేదా ఇంటర్నల్ అసెస్ మెంట్  మార్కుల ఆధారంగా ఫలితాన్ని ప్రకటిస్తారా  అని సుప్రీంకోర్టు సిబిఎస్‌ఈని అడిగింది.  

తరువాత 12 వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఇవ్వబడుతుందని సిబిఎస్‌ఈ  బదులిచ్చింది. ఈశాన్య ఢిల్లీ విద్యార్థులకు మాత్రమే జరగాల్సిన 10 వ తరగతి పరీక్షలు రద్దు చేయబడ్డాయని బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది.

Read: మొదటి విడతలో 5 రాష్ట్రాలకే కరోనా మెడిసిన్ “కోవిఫర్”