కరోనాపై ఇదే మా ఫ్లాన్..సుప్రీంకి కేంద్రం 200పేజీల అఫిడవిట్

కరోనాపై ఇదే మా ఫ్లాన్..సుప్రీంకి కేంద్రం 200పేజీల అఫిడవిట్

Covid 19

COVID-19 plan క‌రోనాపై జాతీయ ప్ర‌ణాళిక‌ను(national plan) మంగ‌ళ‌వారం సుప్రీం కోర్టుకు స‌మ‌ర్పించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 200 పేజీల అఫిడ‌విట్‌ను కోర్టుకి స‌మ‌ర్పించింది కేంద్రం. కరోనా సంక్షోభ స‌మయంలో అత్య‌వ‌స‌ర వ‌స్తువులు, సేవ‌ల పంపిణీకి సంబంధించి త‌న ప్ర‌ణాళిక‌లో వివ‌రించింది. అయితే ఇందులో రోజువారీ తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి వివ‌రాలు లేవు. ప్ర‌స్తుతం ఉన్న అసాధార‌ణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్ర‌భుత్వ చ‌ట్ట‌బ‌ద్ధ సంస్థ‌లు, ఇత‌రులు సంద‌ర్భాన్ని బట్టి నిర్ణ‌యాలు తీసుకునే విధంగా నిర్ణ‌యాధికారాన్ని వారికే అప్ప‌గించిన‌ట్లు అఫిడ‌విట్‌లో కేంద్రం స్ప‌ష్టం చేసింది.

దేశంలో ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తిని, పంపిణీని మెరుగుప‌ర‌చ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నార‌ని అఫిడ‌విట్‌లో కేంద్రం తెలిపింది. మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేయడానికి పారిశ్రామిక ఆక్సిజన్ ఉత్పత్తి కర్మాగారాలకు లైసెన్స్ ఇవ్వడం వంటి చర్యలు తీసుకుంటున్నామని, ఆక్సిజన్ ట్యాంకర్ల లభ్యత కూడా పెరుగుతోందని కేంద్రం కోర్టుకి తెలిపింది. అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్ అవసరాలు అంచనా కంటే చాలా వేగంగా పెరిగాయని కేంద్రం తన అఫిడవిట్ లో తెలిపింది.

కాగా, దేశంలో క‌రోనా సంక్షోభాన్ని సుమోటాగా స్వీక‌రించిన అత్యున్నత న్యాయ‌స్థానం.. దీనిపై జాతీయ ప్రణాళిక స‌మ‌ర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించిన విష‌యం తెలిసిందే. ఆక్సిజ‌న్‌తోపాటు ఇత‌ర అత్య‌వ‌స‌ర మందులు, వ్యాక్సిన్‌ల పంపిణీకి సంబంధించి ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టారో చెప్పాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్రం సుప్రీంకొోర్టుకి 200పేజీల అఫిడవిట్ సమర్పించింది.