ChinnaJeeyar : ప్రధాని మోదీకి చిన్నజీయర్‌ ఆహ్వానం..ఫిబ్రవరి 5న రామానుజ విగ్రహ ఆవిష్కరణ

గడిచిన ఐదు రోజులుగా ఢిల్లీలో పర్యటించిన త్రిదండి చిన్న జీయర్‌ స్వామి దేశ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించారు.

ChinnaJeeyar : ప్రధాని మోదీకి చిన్నజీయర్‌ ఆహ్వానం..ఫిబ్రవరి 5న రామానుజ విగ్రహ ఆవిష్కరణ

ChinanJeeyar Swamy

ChinnaJeeyar Swamy : భగవత్‌ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు అతిరథ మహారథులను ఆహ్వానిస్తున్నారు త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీ. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన సమతామూర్తి విగ్రహావిష్కరణకు హాజరుకావాలంటూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని కాసేపటి క్రితం స్వయంగా కలిసి ఆహ్వానపత్రికను అందించారు. సహస్రాబ్ది మహోత్సవాల విశిష్టతను మోదీకి వివరించారు స్వామీజీ. 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. చిన్నజీయర్‌ స్వామీజీతో పాటు.. మైహోం గ్రూప్‌ అధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు కూడా మోదీని కలిసి ప్రాజెక్టు విశేషాలను తెలియజేశారు.

ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్న చిన్నజీయర్ స్వామి

ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్న చిన్నజీయర్ స్వామి

సమతాస్ఫూర్తి కేంద్రం విశిష్టతను, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ప్రతిబింబంగా ఏర్పాటు చేయనున్న 216 అడుగుల రామానుజాచార్య పంచలో విగ్రహ విశిష్టతను, అక్కడ కొలువుదీరనున్న 108 దివ్యదేశాల వివరాలను ఆసక్తిగా తెలుసుకున్నారు ప్రధానమంత్రి. ప్రపంచ శాంతి కోసం చిన్న జీయర్ స్వామి చేస్తున్న ఈప్రయత్నాన్ని అభినందించిన ప్రధాని మోదీ.. 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్య విగ్రహ ఆవిష్కరణకు తప్పక వస్తానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 5, 2022 నాడు కార్యక్రమానికి హాజరై సమతామూర్తి విగ్రహావిష్కరణ చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రధాని మోదీ, చిన్నజీయర్ తో సమావేశంలో మైహోం గ్రూప్ సంస్థల చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు

ప్రధాని మోదీ, చిన్నజీయర్ తో సమావేశంలో మైహోం గ్రూప్ సంస్థల చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు

గడిచిన ఐదు రోజులుగా ఢిల్లీలో పర్యటించిన త్రిదండి చిన్న జీయర్‌ స్వామి దేశ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను మంగళ వారం కలిసిన చిన్నజీయర్‌ స్వామి.. సమతామూర్తి విగ్రహావిష్కరణకు ఆత్మీయంగా ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్‌ను స్వయంగా కలిసి ఆహ్వానపత్రం అందించారు. రామానుజాచార్య విగ్రహ విశేషాలను.. ఏర్పాటు చేయడానికి గల కారణాలను రాష్ట్రపతికి వివరించారు చిన్నజీయర్‌ స్వామీజీ. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తప్పక హాజరవుతానని హామీ ఇచ్చారు రామ్‌నాథ్‌ కోవింద్‌.

రాష్ట్రపతిని కలిసిన తర్వాత… నేరుగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దగ్గరకు వెళ్లి రామానుజ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి ఆహ్వానించారు చిన్నజీయర్ స్వామి. కుల,మత, వర్గ, ఆర్థిక కారణాలతో సమాజం విచ్ఛిన్నమవుతున్న సమయంలో అందర్నీ ఏకం చేసేందుకే సమతామూర్తిని ఏర్పాటు చేసినట్లు వెంకయ్యనాయుడికి వివరించారు చిన్నజీయర్‌ స్వామి. సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషిచేసిన భగవత్‌ రామానుజాచార్యులు సామాజిక సంస్కరణాభిలాషిగా చెరగని ముద్ర వేశారన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి.. భగవత్‌ రామానుజాచార్య సహస్రాబ్దీ వేడుకలకు రావాలని సాదరంగా ఆహ్వానించారు చిన్నజీయర్‌ స్వామి. రామానుజాచార్య జీవిత విశేషాలు.. ఆయన చేసిన మహత్కార్యాలను అమిత్‌ షాకు వివరించారు. ముచ్చింతల్‌లో చేపట్టిన రామానుజ ప్రాజెక్ట్‌ వివరాలను, కార్యక్రమ విశిష్టతను గంటపాటు అమిత్‌షాకు వివరించారు చినజీయర్‌స్వామి. దీన్నంతటినీ ఆసక్తిగా ఆలకించారు అమిత్‌ షా. విగ్రహావిష్కరణ మహోత్సవానికి తప్పకుండా వస్తానని చిన్నజీయర్‌ స్వామికి హామీ ఇచ్చారు అమిత్‌ షా.

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు చిన్నజీయర్ స్వామి. భగవాన్‌‌ రామానుజుల విగ్రహావిష్కరణ మహోత్సవ విశేషాలను విని ఆనందం వ్యక్తం చేశారు రాజ్‌నాథ్‌ సింగ్‌. సమతామూర్తి విశిష్టతను, ప్రాజెక్టు పూర్తి వివరాలను అరగంటకుపైగా రాజ్‌నాథ్‌కు వివరించారు మైహోం గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వర్‌రావు. ఈ కార్యక్రమానికి హాజరవుతానని హామీ ఇచ్చారు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.

బుధవారం కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి భగవత్‌ రామానుజాచార్య సమతామూర్తి ఆవిష్కరణ ఆహ్వాన పత్రాన్ని అందించారు చిన్నజీయర్ స్వామి. ఢిల్లీలో నితిన్‌ గడ్కరీని కలుసుకున్న చిన్నజీయర్‌ స్వామి.. సమతా మూర్తి విశిష్టతను వివరించారు.

అటు కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌ రెడ్డిని కూడా దివ్యసాకేతానికి ఆహ్వానించారు చిన్నజీయర్ స్వామి. రామానుజ విగ్రహ ఆవిష్కరణ ఆహ్వాన పత్రాన్ని స్వయంగా అందించారు. సమతామూర్తి విగ్రహ ఏర్పాటు ద్వారా… వారి బోధనలు, సందేశం ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంటుందన్నారు చిన్నజీయర్ స్వామీజీ.

కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విన్‌ చూబెకు కూడా ఆహ్వాన పత్రికలు అందించారు చిన్నజీయర్ స్వామి. ఆశ్రమంలో నిర్మిస్తున్న సమతామూర్తి ప్రాధాన్యతను తెలియజేశారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజేను కూడా విగ్రహావిష్కరణ మహోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు చిన్నజీయర్‌ స్వామి.

సమతామూర్తి విగ్రహావిష్కరణకు హాజరుకావాలంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను శుక్రవారం స్వయంగా కలిసి ఆహ్వానపత్రికను అందించారు చిన్నజీయర్‌ స్వామీజి. సహస్రాబ్ది మహోత్సవాల విశిష్టతను చీఫ్‌ జస్టిస్‌కు వివరించారు స్వామీజీ. 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.

కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భూపేంద్రయాదవ్‌కూ సమతామూర్తి ఆవిష్కరణ మహోత్సవ ఆహ్వాన పత్రికను అందించారు త్రిదండి చిన్న జీయర్‌ స్వామీజి. శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి స్వయంగా ఆహ్వాన పత్రిక అందజేశారు. చిన్నజీయర్‌ స్వామీజీతో పాటు మైహోంగ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, మై హోం గ్రూప్ డైరెక్టర్లు జూపల్లి రంజిత్‌రావు, జూపల్లి రామూరావు భూపేంద్రయాదవ్‌ను కలిశారు. సమతామూర్తి ప్రాజెక్టు విశేషాలను స్వామీజీ కేంద్రమంత్రికి వివరించారు.

ఈ అద్వితీయ ఘట్టానికి విచ్చేయాలని RSS చీఫ్‌ మోహన్‌భగవత్‌ను కలిసి ఆహ్వానించారు చినజీయర్‌ స్వామి. జీయర్‌ స్వామి చేపట్టిన ఈ మహాయజ్ఞాన్ని అభినందించారు మోహన్‌భగవత్‌. భగవత్‌ రామానుజుల ప్రాజెక్ట్‌ విశేషాలను ఆసక్తిగా ఆలకించారు.

విశ్వ హిందూ పరిషత్‌ ఉపాధ్యక్షులు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ని కూడా శ్రీరామానుజాచార్య పంచలోహ విగ్రహావిష్కరణకు ఆహ్వానించారు త్రిదండి చిన్నజీయర్‌ స్వామి. ఢిల్లీలో చంపత్‌రాయ్‌ని స్వయంగా కలిసి స్వామీజీ.. ఆహ్వాన పత్రికను అందించారు. సమతామూర్తి లోకార్పణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. శ్రీ రామానుజాచార్య ప్రాజెక్టు గురించి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్న చంపత్‌రాయ్‌.. తప్పనిసరిగా వస్తానని మాట ఇచ్చారు.