CM KCR: ధాన్యం కొనేదిలేదని కేంద్రం స్పష్టంగా చెప్పేసింది -సీఎం కేసీఆర్

ధాన్యం సేకరణ చేయబోమని కేంద్రం చెప్పిందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు.

CM KCR: ధాన్యం కొనేదిలేదని కేంద్రం స్పష్టంగా చెప్పేసింది -సీఎం కేసీఆర్

Cm Kcr

CM KCR: ధాన్యం సేకరణ చేయబోమని కేంద్రం చెప్పిందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. అందుకే యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారంటూ కేసీఆర్ స్పష్టం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు కేసీఆర్. ఏ రాష్ట్రంలో లేనివిధంగా 24గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు.

ఇప్పటివరకు ధాన్యం సంపూర్ణంగా కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు కేసీఆర్. మిషన్‌ కాకతీయతో చెరువులను అద్భుతంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాకముందు రైతుల ఆత్మహత్యలు విపరీతంగా ఉండేవని, వీటన్నింటికి ప్రత్యామ్నాయంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని, ఎనిమిదేళ్లలో ఎంతో అభివృద్ధి చేసుకున్నట్లు చెప్పారు.

రైతు బంధు, రైతు భీమా ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణనే అని, కల్తీ విత్తనాల అమ్మే వారిపై పీడీ యాక్టు తీసుకొచ్చిన రాష్ట్రం తెలంగాణయేనన్నారు. ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకునే బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపై పెట్టిందని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించిందని, కొనమని స్పష్టంగా చెప్పిందని అన్నారు సీఎం కేసీఆర్‌.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రోజుకో మాట చెబుతోందని, ధాన్యం విదేశాలకు ఎగుమతి చేసే అధికారం రాష్ట్రాలకు లేదన్నారు కేసీఆర్. ధాన్యం సేకరణ, నిల్వ, ఎగుమతి వంటి అంశాలు కేంద్రం పరిధిలో ఉంటాయని అన్నారు. రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే పంటలు మార్చి వెయ్యాలని రైతులను కోరినట్లు చెప్పారు కేసీఆర్.