Ganesh : హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనంపై గందరగోళం

హైదరాబాద్ లో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం ఎక్కడా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నిమజ్జనానికి మరో ఐదు రోజుల సమయం ఉండటంతో ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపు తట్టేందుకు రెడీ అవుతోంది.

Ganesh : హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనంపై గందరగోళం

Telangana (4)

Confusion over Ganesh immersion : హైదరాబాద్ లో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం ఎక్కడా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. హుస్సేన్‌ సాగర్‌లో విగ్రహాల నిజమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వం.. అస్సలు కుదురదు.. సాగర్‌లో పీఓపీ విగ్రహాల నిమజ్జనానికి అంగీకరించేది లేదని హైకోర్టు… దీంతో ఖైరతాబాద్ బడా గణపతి సహా, నగరంలో ఉన్న వేలాది విగ్రహాల నిమజ్జనం ఎక్కడా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. మరోవైపు నిమజ్జనానికి మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రభుత్వం ఇప్పుడు సుప్రీం కోర్టు తలుపు తట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది..

హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ఆఫ్‌ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దన్న తీర్పును అమలు చేయాల్సిందేనని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. గతవారం ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాలంటూ జీహెచ్‌ఎంసీ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపిన ధర్మాసనం.. నిమజ్జనంపై తీర్పును సవరించలేమని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇటు హైకోర్టు ఆదేశాలు, అటు ప్రభుత్వం నుంచి స్పష్టత లేక భక్తులు అయోమయంలో పడ్డారు.

Ganesh Nimajjanam: హుస్సేన్ సాగర్ గణేశ్ నిమజ్జన అనుమతి పిటిషన్ కొట్టిపారేసిన హైకోర్టు

ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన బడా గణపతి నిమజ్జనం హుస్సేన్‌ సాగర్‌లో జరగడం ఆనవాయితీగా వస్తోంది.. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఆ భారీ గణనాథుడిని ఎక్కడ నిమజ్జనం చేస్తారు? అక్కడి వరకు ఆ విగ్రహాన్ని ఎలా తరలిస్తారు? అన్నది సస్పెన్స్‌గా మారింది.. అదే సమయంలో భాగ్యనగరంలో భారీ సంఖ్యలో మండపాలు ఏర్పాటు చేశారని, వాటిలో నెలకొల్పిన వేలాది విగ్రహాల నిమజ్జనానికి తగినన్ని నీటి కుంటలు అందుబాటులో లేవని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

ఈ ఒక్కసారికి ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనానికి అనుమతించాలని.. లేకపోతే నిమజ్జనం పూర్తి కావడానికి ఆరు రోజుల సమయం పడుతుందని తెలిపింది. అయితే సాగర్‌లో రబ్బర్‌ డ్యామ్ ఏర్పాటు చేసి నిమజ్జనం చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది.. అయితే రబ్బరు డ్యామ్‌ నిర్మాణం ఇప్పటికిప్పుడు కష్టమని.. పెద్ద విగ్రహాలు నీటి కుంటల్లో నిమజ్జనం చేయలేమని.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేశామని వివరించింది.

Ganesh Immersion : హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో తెలంగాణ ప్రభుత్వం

ప్రభుత్వ విజ్ఞప్తిపై స్పందించిన ధర్మాసనం.. పరిస్థితులన్నీ సర్కార్ సృష్టించుకున్నవేనని వ్యాఖ్యానించింది. సమస్యను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులదేకానీ.. కోర్టులది కాదని స్పష్టం చేసింది. నీటి కుంటల్లో నిమజ్జనం వీలు కాదని గతంలోనే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది. హైకోర్టు తీర్పు ఇచ్చాక ఇప్పుడు గుర్తించారా? అని మండిపడింది… చట్టాలను ఉల్లంఘిస్తారా..? అమలు చేస్తారా? ప్రభుత్వం ఇష్టమని పేర్కొంది. ఇప్పుడైతే తీర్పును సవరించలేమని తేల్చి చెప్పింది. హుస్సేన్‌సాగర్‌ని కాలుష్యం చేయమని చెప్పలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది.. గణేశ్‌ విగ్రహాల నిమజ్జనంపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్‌, పోలీస్‌ అధికారులతో పాటు అడ్వకేట్ జనరల్‌‌తో చర్చించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తీసకున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.. దీంతో నిమజ్జనంపై సస్పెన్స్‌ కంటిన్యూ కానుంది..

మరోవైపు బల్దియా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని 25 చెరువుల్లో ప్రత్యేక కొలనులు నిర్మిస్తోంది జీహెచ్‌ఎంసీ. అయితే కొలనులు తీసి నీరు నింపేందుకు ఇంకొన్ని రోజులు సమయం పట్టనుంది. దీనికి తోడు పెద్ద విగ్రహాల నిమజ్జనం బేబీ పాండ్స్‌లో కష్టమవనుంది.