కరోనా వ్యాక్సిన్ కు అడుగు దూరంలో భారత్.. ప్రపంచ దేశాల చూపు మనవైపే

కరోనా వ్యాక్సిన్ కు అడుగు దూరంలో భారత్.. ప్రపంచ దేశాల చూపు మనవైపే

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అరికట్టడం దాదాపు అసాధ్యమవుతోంది. కానీ దీన్ని ఎలాగైనా అధిగమించాలని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. వైరస్‌ను అంతం చేసేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ రేసులో భారత్ చాలా ముందంజలో ఉంది. ఈ పాటికే మేము సైతం అంటూ సిప్లా హెటిరో సంస్థ ముందుకొచ్చింది.

తాజాగా భారత్ బయోటిక్ సంస్థ అద్భుతమైన ఫలితాలు చూపుతూ ఈ రేస్‌ను అధిగమిస్తుంది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ రూపకల్పనలో అద్భుతమైన పురోగతి కనబరుస్తోంది. ఐసీఎంఆర్‌తో కలిసి పనిచేస్తున్న భారత్ బయోటెక్ కో వ్యాక్సిన్ పేరుతో తయారుచేస్తోంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ పలు దశలను విజయవంతంగా అధిగమించింది.

జంతువులపై వ్యాక్సిన్‌ను ప్రయోగించగా సురక్షితమేనని తేలడంతో పాటు సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 120కిపైగా వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉండగా.. వీటిలో భారత్‌కు చెందిన 6 సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. లోకల్‌గా సేకరించిన వైరస్ స్ట్రెయిన్‌ను ప్రయోగశాల పరిస్థితులకు అనుగుణంగా బలహీనపరిచి.. అదే సమయంలో వాక్సిన్ తయారు చేశారు. తొలి భారతీయ వ్యాక్సిన్ కూడా ఇదే.

డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీజీసీఏ.. భారత్ బయోటెక్‌కు రెండు దశల్లో మానవులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులిచ్చింది. దీంతో ఇదే నెలలో మనుషుల పై ప్రయోగాలు చేసేందుకు రెడీ అయింది. మరోవైపు తాము జరిపిన ముందస్తు పరిశోధనల ఫలితాల ఆధారంగా ఇది ఎంతవరకు సురక్షితం.. రోగనిరోధక ప్రతిస్పందన ఎలా ఉందనే వివరాలు సమర్పించడంతో తమకు అనుమతులు వచ్చాయని వెల్లడించింది భారత్ బయోటెక్.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ వివిధ వ్యాక్సిన్లను 400 కోట్ల డోసులకు పైగా పంపిణీ చేసింది. హెచ్1ఎన్1, రోటావైరస్ లాంటి వాటికి ఈ సంస్థ వ్యాక్సిన్లు తయారుచేసింది. వ్యాక్సిన్ ఎంత సమర్థంగా పనిచేస్తుందనే దాని కంటే.. ఇది ఎంత సురక్షితం అనే దానిపైనే ప్రధానంగా ప్రయోగాలు జరుగుతున్నాయని అంటోంది భారత్ బయోటిక్.

కరోనాను పూర్తిగా నివారించే మందు ఇప్పటిదాకా ఎక్కడా కనిపెట్టలేదు. కానీ వైరస్‌కి మెడిసిన్ వచ్చేసిందంటూ జోరుగా ప్రచారాలు మాత్రం జరుగుతున్నాయి. ఏదో ఒకటి వస్తున్నా ఇవన్నీ ఓ మోస్తరుగా వైరస్‌ను తగ్గించేవే తప్ప.. మొత్తంగా వైరస్‌ను చంపలేవని స్పష్టమవుతోంది. గ్లెన్ మార్క్ సంస్థ ఈ మధ్య రిలీజ్ చేసిన ఫ్యాబి ఫ్లూ కూడా ఇలాంటిదే. కరోనా తక్కువగా, మధ్యస్థంగా ఉన్న పేషెంట్లు ఈ మందు వాడితే కోలుకుంటారు. అయితే ఫ్యాబి ఫ్లూతో పాటు మరికొన్ని మెడిసిన్స్‌పై కూడా ఈ మధ్య కాలంలో పెద్ద చర్చ నడుస్తోంది.

కరోనాకు ఆరంభం నుంచి వాడుతున్న మందు రెమ్‌డెసివిర్. అమెరికాకు చెందిన గిలియాడ్‌ సైన్సెస్‌ మొదట దీన్ని అభివృద్ధి చేసింది. ఇది ఒక యాంటీ వైరల్‌ డ్రగ్‌. దీన్ని గతంలో ఎబోలా ట్రీట్‌మెంట్‌కు ఉపయోగించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని కోవిడ్‌-19 ఎమర్జెన్సీ పేషెంట్లకు వాడవచ్చని సూచించింది. అలాగే ఈ ఏడాది మే 1న యునైటెడ్‌ స్టేట్స్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ కూడా ఈ మెడిసిన్‌ ఉపయోగానికి ఆమోద ముద్ర వేసింది.

ఈ డ్రగ్ మన దేశంలోనూ ప్రస్తుతం కోవిడ్‌ మధ్యస్థ లక్షణాలు ఉన్నవాళ్లు.. ఎమర్జెన్సీ పేషెంట్ల చికిత్స కోసం వాడుతున్నారు. హెటిరో గ్రూప్‌ ఈ మెడిసిన్‌ను కోవిఫోర్‌ పేరుతో ఇంజెక్షన్‌ రూపంలో అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో ఇంజెక్షన్‌ 100 మిల్లీగ్రాముల డోసులో ఉంటుంది. ఒక్క డోసు ధర 5వేల నుంచి 6వేల మధ్య ఉంది. ఫావిపిరవిర్‌ అనే మరో మెడిసిన్‌ను కూడా ఇండియాలో వాడుతున్నారు.

జపాన్‌కు చెందిన ఫ్యూజిఫిలిం టోయామా కెమికల్‌ లిమిటెడ్‌ ఈ మందును తయారు చేసింది. ఇది ఒక యాంటీ ఇన్‌ఫ్లుయెంజా డ్రగ్‌. ఈ మెడిసిన్‌ శరీరంలో వైరస్‌ కణాలు వృద్ధి చెందకుండా చూస్తుంది. కోవిడ్‌ 19 క్లినికల్‌ ట్రయల్స్‌లో ఈ మెడిసిన్‌ 88 శాతం వరకు సత్ఫలితాలను ఇచ్చింది. స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్న కోవిడ్ పేషెంట్ల చికిత్సకు ఈ మెడిసిన్‌ను ఇప్పటికీ వాడుతున్నారు. అలాగే ఇండియాలో గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్స్‌ ఈ మందునే ఫ్యాబి ఫ్లూ పేరుతో విక్రయిస్తోంది. ఒక్కో ఫాబిఫ్లూ ట్యాబ్లెట్‌ను 103 రూపాయలకు అమ్ముతున్నారు.

డెక్సామిథసోన్‌ అనే మరో మెడిసిన్ కోవిడ్‌ 19 పేషెంట్లు మృతి చెందే అవకాశాలను తగ్గిస్తుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ కోవిడ్‌పై మరింత మెరుగ్గా పోరాడేందుకు ఈ మెడిసిన్‌ ఉపయోగపడతుంది. దీన్ని వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కోవిడ్‌ 19 పేషెంట్లకు కూడా ఇస్తున్నారు. యూకేలో ఈ డ్రగ్‌ను కోవిడ్‌ పేషెంట్లకు వాడేందుకు ముందుగా అనుమతి ఇచ్చారు. ఈ స్టెరాయిడ్‌ చాలా తక్కువ ధరకే దొరుకుతుంది.

భారత్‌లో ఇంజెక్షన్‌ ఖరీదు పది రూపాయల కంటే తక్కువగానే ఉంది. కరోనా సమయంలో ఎక్కువగా చర్చనీయాంశమైన మరో మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌. భారత్‌లో ఎప్పటినుంచో దీన్ని మలేరియా చికిత్సకు వాడుతున్నారు. ఇది యాంటీ రుమాటిక్‌ డ్రగ్‌గా కూడా పనిచేస్తుంది. ఆర్థరైటిస్‌ ఉన్నవారిలో వాపులు, నొప్పులను తగ్గిస్తుంది. ఈ డ్రగ్‌ కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించకుండా చూస్తోందని తేలింది. దీంతో కోవిడ్‌ చికిత్సకు కూడా ఉపయోగిస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో 12 ఫార్మా కంపెనీలు ఈ మెడిసిన్‌ను తయారు చేస్తున్నాయి. ఈ మెడిసిన్‌ ఒక్క ట్యాబ్లెట్‌ ఖరీదు జస్ట్ మూడు రూపాయలు మాత్రమే. ఈ మెడిసిన్‌ను అమెరికా సహా కొన్ని దేశాలకు ఎగుమతి చేసింది భారత్. కరోనాకు చెక్‌ పెట్టేందుకు మన దేశంలో జోరుగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో మిగతా దేశాల కంటే మనమే ముందున్నాం. అయితే భారత్ బయోటిక్‌ కో వ్యాక్సిన్ మాత్రం చాలా ఆశలు పుట్టిస్తోంది.
మనుషులపై ట్రయల్స్‌లో మెరుగైన రిజల్ట్ వస్తే ఇక భారత్‌కు తిరుగులేనట్టే లెక్క. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఇయర్ ఎండింగ్‌లో వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. దీంతో ప్రపంచ దేశాలు కూడా కో వ్యాక్సిన్‌ పనితనాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి.

Read:మొదట చైనా.. ఇప్పుడు పాకిస్థాన్.. పొరుగు దేశాలతో భారత్ ‘టూ-ఫ్రంట్’ వార్‌